“ఇంగ్లీషు మాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు – ఇవి, [ ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ ] పుస్తకంలో కూర్చబడ్డాయి. […] ఇప్పటి వరకూ మనకి [తెలుగు] వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే పుస్తకం లేదు. […] పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచనలని మెరుగు పరిచే కొన్ని సూత్రాలు తెలుగు రచనలకి కూడా ఉపయోగ పడతాయి. ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్’ వంటి పుస్తకం తెలుగులో తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను.”
— ఒక తెలుగు పుస్తకం కావాలి, వేలూరి వేంకటేశ్వర రావు
“రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకొని అందరూ నీళ్ళే పోస్తే పాలు మిగలనట్లు, ఎన్నో రంగాలలో ఎన్నో విద్యలలో తెలుగువారికున్న విజ్ఞాన సాంకేతిక సంపద తెలుగు రూపంలో వ్యక్తీకరింపబడనంత వరకు భాషకు నీటి సహాయమే కాని, పాల సహాయం అందనట్లు అనిపిస్తుంది.” — శ్రీనివాస్ నాగులపల్లి
విండోస్ 10లో మీ అభిమాన తెలుగు కీబోర్డు లేయవుటు స్థాపించుకోవడం ఎలా?
విండోస్ కంప్యూటర్లలో వివిధ లేయవుట్లలో తెలుగు టైపు చేసుకోడానికి వీలుగా కొన్ని కీబోర్డులు గతంలో తయారు చేసాను. అవి ఇన్స్క్రిప్ట్+, ఆపిల్ (వేరిటైప్), మాడ్యులర్. అయితే విండోస్ 10లో వీటిని స్థాపించుకోవడం వీలుకావడంలేదని నాకు పిర్యాదులు అందాయి.
దీనిపై పరిశోధిస్తే తేలిందేమిటంటే, విండోస్ 10లో విండోస్ ఇన్స్టాలర్తో అప్లికేషన్లను స్థాపించుకోడాన్ని అచేతనం చేసాడు. అందువల్ల పై కీబోర్డు లేయవుట్లను (ఇతర విండోస్-ఇన్స్టాలర్-ఆధారిత ఉపకరణాలనూ) విండోస్ 10లో మామూలుగా స్థాపించుకోలేము. వీటిని స్థాపించుకోడానికి తాత్కాలికంగా విండోస్ ఇన్స్టాలర్తో అప్లికేషన్లను స్థాపించుకోడాన్ని చేతనం చేసుకోవాలి. ఇలా:
- మీ విండోస్ 10 కంప్యూటర్లో, Run కమాండ్ తెరిచి (Win + R).దానిలో gpedit.msc అని టైపు చెయ్యండి. (ఇది గ్రూప్ పాలసీ ఎడిటర్ అనే విండోని తెరుస్తుంది.)
- ఆ తర్వాత, మీరు Local Computer Policy అన్న విభాగంలో, Computer Configuration మీద నొక్కండి.

- తర్వాత, Administrative Templates పైనా, దాని లోని Windows Components, దాని లోని Windows Installer పైనా నొక్కుకుంటూ వెళ్ళండి.
- ఆ Windows Installer విభాగంలో Turn off Windows Installer అన్న అమరికను, డబల్-క్లిక్ చెయ్యండి.

- తర్వాచ వచ్చే విండోలో, క్రింద చూపిన విధంగా Enabled అని Never అని ఎంచుకోని OK నొక్కండి. (మీరు కీబోర్డును స్థాపించుకున్న తర్వాత దీన్ని తిరిగి Not Configured అని అమర్చుకోవచ్చు.)

అంతే! ఇక విండోస్ 10లో కూడా మీకు నచ్చిన తెలుగు కీబోర్డు లేయవుటుతో విజృంభించండి.
ఆనంత తెలుగు టంకనం!
తెరపట్ల సౌజన్యం దొప్పలపూడి శ్రీకాంత్
ఐఫోనులో తెలుగు వ్రాయడం ఎలా?
ఐఫోనులో తెలుగులో వ్రాయడానికి మనకి ప్రత్యేకమైన ఆప్స్ అవసరం లేదు, ఎందుకంటే ఐఫోను కీబోర్డు ఆప్ లోనే తెలుగు ఎంచుకునే అవకాశం ఉంది. ఈ అంచెలు అనుసరించండి:
1. ఐఫోను సెట్టింగులలోకి వెళ్ళండి. సెట్టింగుల తెరలో కీబోర్డు అన్న దాన్ని ఎంచుకోండి.

2. కీబోర్డు సెట్టింగుల తెరలో కీబోర్డులు అన్న దాన్ని ఎంచుకోండి.

3. కీబోర్డుల తెర నుండి మీరు కొత్త కీబోర్డులను ఎంచుకోవచ్చు.
(క్రింది తెరపట్టు తెలుగును ఎంచుకున్న తర్వాత తీసినదన్నమాట!)

అంతే! ఆ తర్వాత మీరు మీ ఐఫోనులో ఎక్కడ తెలుగు టైపు చెయ్యాలన్నా కీబోర్డులో స్పేసుబార్కి ఎడమవైపున ఉండే గ్లోబు మీటను నొక్కి ఇంగ్లీషు, తెలుగుల మధ్య మారవచ్చు.
తెరపట్ల సౌజన్యం సుబ్రమణ్యం నాయుడు.
భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ
భారతదేశం ఎలా ఉంటుందో మీకు ఎలా తెలిసింది? ఏదో ఒక పటాన్ని చూస్తేనే కదా. మనం చిన్నప్పటిని నుండీ పాఠ్యపుస్తకాల్లోనూ ఇతరత్రానూ చూసి మన మనసుల్లో భారతదేశానికి ఒక ముద్ర ఏర్పడిపోయింది. అయితే, గూగుల్ మ్యాప్ వంటి సైట్లలో చూపించే భారతదేశ పటం తేడాగా, తల పక్కన కోసేసినట్టు ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీరుని మన దేశంలో భాగంగా చూపకపోవడం వల్ల. ఈ విషయమై భారత ప్రభుత్వం సదరు సైట్లకు పిర్యాదులూ, ఆదేశాలూ చేసి ఉంది. కానీ ఫలితం శూన్యం అని ప్రభుత్వాథికారులు విచారం వ్యక్తం చేసారు కూడా. (అన్నట్టు గూగుల్, బింగ్ మ్యాపుల్లో ఇప్పుడు భారతదేశం పటం సరిగానే ఉంది. వేరే దేశాలలో ఉన్నవారికి ఎలా కనబడుతుందో తెలియదుమరి. వేరే దేశాల వారికి తేడాగానే కనబడుతుంది, అంతర్జాతీయంగా అంగీకరించబడిన సరిహద్దుల ప్రకారం.) “భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ” చదవడం కొనసాగించండి
మేరీ నిఘంటువు — మనకి మన చేతులు ఎలా వచ్చాయి?
ఓ ముసలావిడ — తన భాషని బాగా మాట్లాడగలిగే చివరి వ్యక్తి — తన భాషకి ఒక నిఘంటువుని తయారుచేసింది. తమ తెగ వారు ఆ భాష నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంది. వివరాలకు ఈ వీడియో కథనం చూడండి:
ఆ వీడియో లోని ఒక పిట్టకథ, తెలుగులో నా స్వేచ్ఛానువాదం:
మనకి మన చేతులు ఎలా వచ్చాయి
చాన్నాళ్ళక్రితం, అప్పటికింకా మనుషులు లేరు, జంతువులే ఉండేవి. వాటి నాయకురాలు గద్ద మనుషుల్ని తయారుచేయాలి అంది. జంతువులన్నీ మనుషుల చేతులు తమ చేతుల్లానే ఉండాలని కోరాయి. కుచ్చు తోడేలూ, బల్లి మాత్రం మనుషుల చేతులు తమ తమ చేతుల్లానే ఉండాలని పట్టుబట్టాయి. అయితే, తోడేలుకీ బల్లికీ పరుగు పందెం అంది గద్ద. పర్వతం పైకి పరిగెత్తాలి, పరిగెత్తి ముందుగా ఎవరైతే దానిపై చేయివేస్తారో వారే గెలిచనట్టు.
పర్వతం మీది బండరాయిపై ముందుగా బల్లి చేయివేసింది.
“హహ్హా, నేనే గెలిచాను! పందెంలో నేనే గెలిచాను!!”అని నవ్వుతూ గెంతింది.“ఇక మనుషులకి నాలాంటి చేతులే వస్తాయి!”
CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి
వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం.
జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది.
ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు:
p::first-letter { font-size: 3em; }
కానీ కేవలం మొదటి పేరా లోని మొదటి అక్షరానికి మాత్రమే వర్తించాలంటే:
p:first-child::first-letter { font-size: 2em; color: red; }
పై నియమంలో, :first-child అనే సూడో-తరగతి <p> మూలకం అది ఉన్న స్థాయిలో మొదటిది అయితే గనక గుర్తిస్తుంది.
అక్కడవరకూ బానే ఉంది. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి, జాల విహారిణులు మొదటి అక్షరాన్ని సరిగా గుర్తించలేకపోతున్నాయి. (తెలుగులో ఒక అక్షరం 7 యూనికోడ్ కోడుపాయింట్ల వరకూ, అంతకంటే ఎక్కువకూడా, ఉండొచ్చు. ఉదాహరణకు స్ట్రాంగ్ అనే పదంలో మొదటి అక్షరం “స్ట్రాం”లో 7 కోడుపాయింట్లు ఉన్నాయి.) ఫైర్ఫాక్స్ వారికి నేను ఈ దోషాన్ని నివేదించాను. ఆ దోషం సరయ్యింది కనుక ఫైర్ఫాక్స్ ఇప్పుడు తెలుగు మొదటి అక్షరాన్ని సరిగానే గుర్తుపడుతూంది.
వివిధ విహారిణుల్లో తెలుగుకి సంబంధించి ::first-letter సూడో-మూలకానికి ఉన్న తోడ్పాటు ఇదీ (బొమ్మను ఇంకా పెద్దగా చూడడానికి దానిపై నొక్కండి):
మీ అభిమాన విహారిణిలో దీన్ని పరీక్షించి చూడడానికి ఈ పేజీ (మరోటి) ఉపయోగపడవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే, మీ విహారిణి తయారీదారుకి నివేదించండి.
