అప్రమేయాలతో అప్రమత్తం!

ఈ వ్యాసం తొలుత తెలుగు వెలుగు పత్రిక ఏప్రిల్ 2020 సంచికలో “అప్రమేయాలతో జాగ్రత్త!” అనే శీర్షికతో ప్రచురితమైంది.

అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్/మొబైలు అనువర్తనాలు గానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరపున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. అంటే, వాటి తయారీదార్లు మనకోసం ముందుగా నిర్ధేశించిన అమరికలు అన్నమాట. ఉదాహరణకు, మీరు టీవీ పెట్టగానే ఏ ఛానెల్ వస్తుంది? మీరు టీవీ కట్టక మునుపు చూస్తున్న ఛానెలా లేక మీకు ప్రసారాలు అందించే డిష్/కేబుల్ సర్వీసు వాడి ఛానెలా? అది అప్రమేయ ఎంపికకు ఒక ఉదాహరణ.

మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ తెరిచి టైపు చేస్తుంటే ఆ పాఠ్యం ఏ ఫాంటులో ఉండాలి? అందుకోసం మైక్రోసాఫ్ట్ వాడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది మీరు వాడే వెర్షనును బట్టి టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్, లేదా కాలిబ్రి అయివుంటుంది.

మనం ఏదైనా వెబ్‌సైటులో నమోదు చేసుకుంటున్నప్పుడు, వాడి న్యూస్‌లెటర్ లేదా మార్కెటింగ్ ఈమెయిళ్ళు మనకు తరచూ పంపించేలా టిక్కు పెట్టేసి ఉంచుతాడు.

మనం తెలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ లేదా స్మార్టు ఫోను కొన్నా అది ఆంగ్లంలో ఉంటుంది, టైపు చేస్తే ఆంగ్లమే టైపవుతుంది.

ఇవన్నీ మన తరపున ఆ తయారీదార్లు తీసుకున్న అప్రమేయ నిర్ణయాలే.

అసలంటూ ఉన్నది మన సౌకర్యానికే.

ఆయా ఉత్పత్తులను, సేవలను అవి ప్రతీ చిన్న విషయానికి ప్రతీసారీ ‘మీ ఎంపిక ఏమిటి?’ అని మనల్ని విసిగించకుండా మనం వాటిని సౌకర్యంగా వాడుకోడానికే ఈ అప్రమేయం అన్న భావన పుట్టింది. ఎక్కువమంది వాడుకరులకు సరిపడేలా లేదా ఎక్కువ సందర్భాలకు అనుకూలమైన ఎంపికలనే తయారీదార్లు అప్రమేయాలుగా ఎంచుకుంటారు.

మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉదాహరణనే తీసుకుంటే, మీరు ఒక ఉత్తరం టైపు చేద్దామని మొదలుపెట్టగానే మీ కంప్యూటరు ఈ ప్రశ్నలు వరుసగా అడగాల్సివస్తుంది: ఫాఠ్యం ఏ ఫాంటులో ఉండాలి, ఎంత పరిమాణం ఉండాలి? అక్షరాల మధ్య ఎడం ఎంత ఉండాలి, పంక్తుల మధ్య ఖాళీ ఎంత ఉండాలి, పేరాల మధ్య ఖాళీనో? పాఠ్యం ఎడమవైపుకి బద్దించి ఉండాలా, పేజీ కుడివైపుకా, మధ్యకా?, పేజీ పరిమాణం ఏఫోరా, మార్జిన్లు ఎంత ఉండాలి? పాఠ్యం రంగు, పేజీ రంగు? ఇలా చిన్ని చిన్ని నిర్ణయాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇవన్నీ ప్రతీసారీ అమర్చుకుంటూ కూర్చుంటామా? అందుకే ఈ అప్రమేయాలు.

అప్రమేయాల ఎంపిక సహేతుకంగా ఉంటే మనం వాటిని ప్రతీసారీ మార్చుకునే పనుండదు. చాలా సందర్భాలకు అవి సరిపోతాయి. ప్రత్యేక అవసరాలకు మాత్రం మార్చుకుంటే సరిపోతుంది.

కానీ…

కొన్నిసార్లు ఈ అప్రమేయాలు మనకి, అంటే అంతిమ వాడుకరులకు, మేలు చేయకపోగా హాని కలిగించేవి గానూ లేదా ఆయా ఉత్పత్తుల, సేవల తయారీదార్లకు అనుకూలంగా ఉంటాయి.

మీకు గూగుల్ ఖాతా ఉంటే, అది జాలంలో మీ వెతుకులాటలను, యూట్యూబ్ వీక్షణ చరిత్రను మీకు వ్యాపార ప్రకటనలను చూపించడానికి గూగుల్ వాడూ, వాడికి పనిచేసే మూడోపక్ష కాంట్రాక్టరులూ వాడుకోవచ్చు అనేలా ఎంపిక చేసి ఉంటుంది. ఇదే విధంగా, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల గూళ్ళలో వివిధ అమరికలు అవసరాన్ని మించి మన సమాచారాన్ని వాడితో పంచుకునేలా ఉంటాయి.

లాభాపేక్ష, పోటీతత్వం పెరిగిపోయిన ఈ రోజుల్లో వస్తూత్పత్తుల తయారీదార్లు, మనకు వివిధ సేవలు అందించేవారు అన్ని నిర్ణయాలు, ఎంపికలు మనకు అనుకూలంగా ఉండేవే, మేలు చేసేవే ఎంచుకుంటారని ఆశించలేము.

ఒకవేళ తయారీదార్లు మంచికి కట్టుబడి ఉన్నా వారి నిర్ణయాలు ఎక్కువ మంది వాడుకరులకు అనుగుణంగా ఉండవచ్చు గానీ మనకి, ప్రత్యేకించి మన ఒక్కరికే అనుకూలంగా ఉండకపోయే అవకాశం కూడా ఉంది. కంప్యూటర్ తెరలపై అక్షరాలు 9 పాయింట్ల పరిమాణంలో చూపించడం అందరికీ బావున్నా, చూపుతక్కువ ఉన్నవారికి కొంచెం పెద్ద అక్షరాలు అవసరం కావచ్చు.

కనుక మన భద్రత కోసం (ఉదాహరణకు, అప్పనంగా మన సమాచారాన్ని, వనరులను తయారీదార్లు వాడేసుకోకుండా చూసుకోడానికి), మన సౌకర్యం కోసమూ (తెరపై అక్షరాలు పెద్దగా కనబడేలా అమర్చుకోవడం వంటివి) మనం తరచూ వాడే కంప్యూటర్, మొబైల్ అనువర్తనాల అమరికలను మనకు తగ్గట్టు మలచుకోవడం మనకే మంచిది.

ఈ విషయంలో ప్రముఖ వ్యాపార సంస్థలు అందించే అనువర్తనాల కంటే, స్వచ్ఛంద ప్రయత్నాల ద్వారా తయారయ్యే స్వేఛ్ఛా సాఫ్ట్‌వేరు అనువర్తనాలే వాడుకరుల భద్రత, అంతరంగిత రాజీపడకుండా ఉండేలా అప్రమేయ ఎంపికలతో లభిస్తున్నాయి. ఉదాహరణకు, మనం జాలంలో విహరిస్తున్నప్పుడు మన జాడను గుట్టుగా కనిపెట్టే వివిధ ట్రాకర్లను, కుకీలను ఫైర్‌ఫాక్స్ అంతర్జాల విహారిణి అప్రమేయంగానే అడ్డుకుంటుంది. ఎందుకంటే దాన్ని తయారు చేసిన మొజిల్లా అనే సంస్ఠ వాడుకరుల హక్కుల కోసం, అంతర్జాల స్వతంత్రత కోసం పోరాడే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. వారి ఉత్పాదనలలో వాడుకరుల భద్రత, అంతరంగికతలు మొదటి ప్రాధాన్యతలు. ఇటువంటి సంరక్షణ గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి ప్రముఖ సంస్థల విహారిణులలో అప్రమేయంగా ఉండదు.

చాలామంది తెలియకో, కష్టమనుకునో, అర్థంకాకనో (లేక బద్దకం వల్లనో మరి) కంప్యూటర్, ఫోను వంటి వాటిల్లో అప్రమేయ అమరికలను మార్చుకోరు.  అందుకేనేమో ఎంత ఎడమచేతి వాటం వాళ్ళైనా కంప్యూటర్ మూషికాన్ని కుడిచేతితోనే వాడుతూంటారు! బహుశా, ఈ అనువర్తనాలు తెలుగులో ఉంటే అర్థంకాకపోవడం, తెలియకపోవడం అనే సమస్య ఉండదేమో.

కంప్యూటర్, మొబైల్ అనువర్తనాలలో అమరికలు, అభిరుచులు, ఎంపికలు (సెట్టింగులు, ప్రిఫరెన్సులు, ఆప్షన్స్) వంటివి ఈ అప్రమేయాలను మనకు తగ్గట్టు మార్చుకునేందుకు వీలుకల్పిస్తాయి. మీ కంప్యూటరు లోనూ స్మార్టుఫోను లోనూ మీ అభిమాన అనువర్తనాల అమరికలను ఓసారి చూడండి. వాటిని మీకు తగ్గట్టు మలచుకోండి. వాటిలో కొన్ని భాషను “తెలుగు” అని ఎంచుకోనిస్తాయి కూడా! నేడే మీ అనువర్తనాల అమరికలు సరిచూసుకోండి!!

One thought on “అప్రమేయాలతో అప్రమత్తం!

  1. అయ్యా, సంస్కృతం మాటలను తగ్గించండి.
    లభిస్తున్నాయి కి మారుగా దొరుకుతున్నాయి అనవచ్చు. వల (జాలం), ఎలుక(మూషికం), రాజోక (ఫొన్ట్) లను వాడండి. ఆంగ్లంలో j, g ల ముందు వచ్చే d ను మామూలుగ పలకరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.