పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు…

లేఖినికి 16 ఏళ్ళు నిండాయి! పుట్టిన రోజు కానుకగా కొత్త సౌలభ్యాలతో లేఖిని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది! ఇప్పుడే ప్రయత్నించి చూడండి!! కొత్త విశేషాల మాలికే ఈ టపా:

💾 ఆటోసేవ్

దాదాపు లేఖిని మొదలయినప్పటినుండీ వాడుకరులు ఎక్కువగా అడిగిన సౌలభ్యం ఇదే. ఇక నుండి మీరు లేఖినిలో టైపు చేసేది ఆటోమెటిగ్గా మీ విహారిణిలోనే భద్రమవుతుంది. 🕙 చరిత్ర అనే బొత్తాన్ని నొక్కితే మీ పాత రాతలు కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై నొక్కితే అది టైపింగు చోటికి వస్తుంది. అలా పాతవాటిని వ్రాయడం కొనసాగించవచ్చన్నమాట. అన్నట్టు, లేఖినిలో మీరు వ్రాసేవి మీ పరికరంలోనే భద్రం అవుతాయి. సర్వరుకి గానీ మరోచోటికి వెళ్ళవు. (అందువల్ల, మీరు ల్యాపుట్యాపు లేఖినిలో రాసుకున్నది, మీ ఫోనులో లేఖిని లోనికి అందుబాటులో ఉండదు.)

ఈ చరిత్రలో ఉన్న అంశాలు ఓ 60 రోజుల తర్వాత ఆటోమెటిగ్గా తొలగిపోతాయి. కానీ ఒక అంశాన్ని మీరు లేఖినిలో అట్టేపెట్టుకోవాలంటే దానికి కుడివైపున చుక్క గుర్తు నొక్కిపెట్టవచ్చు.

లేఖినిలో ఆటో-సేవ్ అయిన చరిత్ర అంశాల తెరపట్టు

🪄 మంత్రదండం

లేఖినిలో మీరు టైపించినదాన్ని అందంగా తెరపట్టు తీసుకొనే సౌలభ్యం ఇది. మీరు రాసిన కొన్ని పంక్తులను కాస్త అందంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకోడానికి ఉపయోగపడతుంది. ఇది కేవలం వచనం, పాట వంటి వాటి కోసం సరిపోతుంది. అనేక హంగులుండే పోస్టర్లు తయారుచేసుకోడానికి పనికిరాదు.

లేఖిని మంత్రదండం తెరపట్టు

శీర్షికలు, ఉపశీర్షికలు, తదితర శైలులను ఎలా పొందవచ్చో తెలుసుకోడానికి మంత్రదండాన్ని వాడటానికి కొన్ని చిట్కాలు చూడండి.

ఈ మంత్రందండం కోసమూ, లేఖిని అంతటా అపూర్వ ఫాంట్స్ (పురుషోత్త్ కుమార్ గారు) ఉచితంగా అందిస్తున్న జిమ్స్ ఖతిని జాల ఖతిగా ఉపయోగించాను. మీ కంప్యూటర్లో/పరికరంలో ఈ ఫాంటులో లేకపోయినా లేఖినిలో మీకు కనిపిస్తుంది.

🤞 ఆఫ్‌లైన్ తోడ్పాటు

గతంలో ఆఫ్‌లైను తోడ్పాటు ఒకసారి చేసాను, కానీ దానికి వాడిన సాంకేతికత (ఆప్‌కాషే) సమర్థవంతమైన జాల ప్రమాణంగా రూపొందలేదు. కనుక దానికి విహారిణులు తోడ్పాటును తొలగించాయి. ఇప్పుడు దానికంటే మెరుగైన సాంకేతికతలు (సర్వీస్‌వర్కర్లు, మెరుగైన విహారిణి కాషె) అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇది మరో ప్రయత్నం.

లేఖినిని ఆఫ్‌లైనులో వాడుకోడానికి మీరు చేయాల్సిందల్లా అంతర్జాల అనుసంధానం ఉన్నప్పుడు ఒకసారి లేఖినిని తెరవడమే. ఆ తర్వాత మీ పరికరానికి అంతర్జాల అనుసంధానం లేకపోయినా, లేఖిని చిరునామాని తెరిస్తే మీ విహారిణి తను భద్రపరచుకున్న కాపీని తెరుస్తుంది. మీరు లేఖినిని వాడుకోవచ్చు.

🗗 పరికరంలో స్థాపన

ఇప్పుడు లేఖినిని మీ పరికరంలో స్థాపించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్‌ 10 ఆపైన వ్యవస్థలలో అయితే క్రోమ్ విహారిణి లోనూ, ఆండ్రాయిడ్ 11 ఆపైన అయితే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ విహారిణుల లోనూ మీరు లేఖినిలో ఉన్నప్పుడు “Install” వంటి ఆదేశాలను వాడి లేదా సంబంధిత ప్రతీకాలపై (కింద కొన్ని చూపించాను) వాటిపై నొక్కి లేఖినిని మీ పరికరంలో స్థాపించుకోవచ్చు.

ఆపై లేఖిని విండోసులో అనువర్తంగా (స్టార్ట్ మెనూ నుండి) తెరవవచ్చు. టాస్క్ బారులోనూ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌లో మీ ముంగిలి తెరలోనూ, ఆప్స్ జాబితాలోనూ కనిపిస్తుంది! అక్కడ నుండి నేరుగా లేఖినిని తెరవవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోనులో లేఖిని (జాల) అనువర్తనంగా తెరపట్టు

🧵 ట్విల్లేఖిని

మీరు ట్విట్టరులో తీగలు/ట్వీటుమాలలు వ్రాస్తూంటే, ఈ సౌలభ్యం ఉపయోగపడవచ్చు. మీరు వ్రాయదలుచుకున్నదంతా వ్రాసేసి ఎక్కడ ముక్కలు చేయాలో అక్కడ కొత్తలైనులో -- (రెండు డ్యాషులు) ఇస్తే అక్కడకు ఒక ట్వీటుగా తీసుకొని అది ఎన్ని అక్షరాలు ఉందో చూపిస్తుంది. కనుక వాక్యాలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఆ అక్షరాల సంఖ్య 280 ఉంటే ఒక ట్వీటులో పడుతుంది. అంతా సిద్ధం అనుకున్నాకా, ఒక్కో ముక్కనూ తీసుకొచ్చి ట్విట్టరులో కొనసాగింపు ట్వీటుగా ట్వీటడమే.

ట్విట్టరులో ట్వీటుమాలలు వ్రాయడానికి ఉపయోగపడే ట్విల్లేఖిని తెరపట్టు

💠 ఇతరత్రా మార్పుచేర్పులు

 • తెలుగు పాఠ్యం మధ్యలో ఇంగ్లీషు టైపు చెయ్యడానికి మొదట్లో # ఉండేది, దాన్ని ` (బ్యాక్‌టిక్‌)కు గతంలో మార్చాను. కానీ చాలామందికి ఈ మీట తెలియదు. ఇప్పుడు దానితో పాటు రెండు#లు కూడా పాఠ్యాన్ని ఇంగ్లీషులో ఉంచడానికి పనికొస్తాయి. ఉదా॥
  svayamcoadaka (##self-driving##) vaahanaalu = స్వయంచోదక (self-driving) వాహనాలు
 • వేగం: లేఖిని ఇంతకు మునుపుకంటే వేగంగా తెరుచుకుంటుంది, వేగంగా పనిచేస్తుంది.
 • లేఖిని గోప్యతా విధానం, నెనరులకు కొత్త పేజీలు.
 • అనేక చిన్న చిన్న మార్పులు.

💡 మీకు తెలుసా? మీరు టైపు చేసిన తర్వాత ట్యాబ్ ⭾ మీటను నొక్కితే తెలుగు పాఠ్యం మీ క్లిప్‌బోర్డుకి కాపీ అవుతుందని! మీరు మానవీయంగా పాఠ్యాన్ని ఎంచుకొని కాపీచేసుకోనవసరం లేదు.

అదీ సంగతి! లేఖిని కొత్త సౌలభ్యాలను ఇప్పుడే వాడి చూడండి. మీకు నచ్చిన సౌలభ్యం ఏమిటి? మీ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయండి.

ఆనంద లేఖనం!

9 thoughts on “పదహారేళ్ళ వయసు… పడిపడి లేచె మనసు…

 1. బాగున్ది. మాకు మున్దే ఇచ్చిన ఉగాది కానుక అనుకుణ్టాము :) వాట్సాప్ కి సరిపోయే వెడల్పు కూడా జత చేసిన మరిన్త సౌలభ్యమనిపిస్తోన్ది. సర్వేజనాః సుఖినోభవన్తు.

 2. లేఖినిని అందించినందుకు దన్యవాదాలు. నాకు లేఖిని చాలా అనుకూలంగా ఉంటుంది తెలుగులో టైపు చేయడానికి. అయితే నాదొక రిక్వెస్టు. ఇంగ్లీషు పదాలు తెలుగులో రాయడానికి కష్టంగా ఉంటుంది.
  కనుక కొన్నింటిని ఇంగ్లిష్‌లోనే రాస్తూ మిగితా తెలుగులో కావాలనుకుంటాను.
  లేఖినిలో ఇంగ్లిష్‌లో రాసినప్పుడు నేను కావలనుకునే కొన్ని పదాలు తెలుగులోకి మారకుండా ఇంగ్లిష్‌లోనే అవుట్‌పుట్ బాక్సులోకి కాపీ కావాలి. ఉదాహరణకు నేను తో నా సెలెక్షన్ చెప్పడానికి పెడితే, నేను ఒక పదానికి ముందు పెడతాను. అప్పుడు అది తెలుగులోకి కాకుండా లు లేకుండా కాపి ఇంగ్లిష్‌లో అవ్వాలి. ఇలాంటి ఫీచరు ఆల్‌రెడీ ఉంటే తెలియజేగలరు. లేకుంటే దయచేసి తీసుకురాగలరని ప్రార్థన.

  1. అలాటి సౌలభ్యం ఇప్పటికే లేఖినిలో ఉంది. తెలుగు లోనికి మారకూడదు అనుకున్న పదాలను రెండు # గుర్తుల మధ్య ఉంచండి. ఉదాహరణ:

   di earoanaaTs (##The Aeronauts##) anea sinimaa coosaaraa?

   = ది ఏరోనాట్స్ (The Aeronauts) అనే సినిమా చూసారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.