నగరాలు పలు భాషల నగారాలు కావాలి

ఈ వ్యాసం తొలుత అమ్మనుడి మాస పత్రిక జూలై 2018 సంచిక లో ప్రచురితమైంది.

ప్రపంచ జనాభాలో సగం నగరాలలోనే ఉన్నదని ఐక్యరాజ్యసమితి 2008లో ప్రకటించింది. తాజా అంచనాల ప్రకారం 2030వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరువకావచ్చనీ చెప్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు. ఈ వృద్ధికి మామూలుగా జనాభా పెరుగుదలతో పాటు నగరాలకు వలసలు, నగరీకరణలు దోహదం చేస్తున్నాయి.

కోటి మంది కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలను మహానగరాలు (మెగాసిటీ) అని వ్యవహరిస్తున్నారు. ప్రవంచవ్యాప్తంగా 46 మహానగరాలు ఉంటే, కేవలం భారతదేశంలోనే 6 ఉన్నాయి. భవిష్యత్తు అంతా నగరాలదే. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం, పరిరక్షణ గురించిన అంశాలతో ఈ వ్యాసం.

నగరాలలో జనాభాలో అధిక శాతం (వారో వారి పూర్వీకులో) వలసలుగా వచ్చినవారే అయివుంటారు. తత్ఫలితంగా నగరాలు భిన్న సంస్కృతుల, విభిన్న భాషల నమ్మేళనాలు. కాలక్రమేణా ప్రతీ నగరానికీ దానికంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడుతుంది. పాలన ఏదో ఒక భాషకి పరిమితమవుతుంది. నగరాలలో మరో వింత పోకడ: ఒకవైపు ఆకాశహార్మ్యాలు, మరోవైపు మురికి వాడలు. (ఎవరో రచయిత అన్నట్టు అత్యంత ధనికుడూ, అతి పేదవాడూ నగరంలోనే ఉంటాడు.) ఈ విభజన కూడా ఆ నగర భాషాసంస్కృతులపై ప్రభావం చూపిస్తుంది.
నగరాలలో దాదాపు చాలా వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండి తీరిక లేని పరిస్థితే కనిపిస్తుంది. ఉరుకులు, పరుగులు నిత్యకృత్యమవుతాయి. అందువల్ల భాషాసంస్కృతుల పట్ల ఆసక్తి చూపించేవారూ, అందుకు సమయం కేటాయించేవారూ జనాభాలో అతి కొద్దిశాతమే ఉంటారు. అధికాదాయ వర్గాలు తగినంత తీరికసమయంతో ఉన్నా వారి ప్రాథామ్యాలు వేరుగా ఉంటాయి. సగం పైన జనాభా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రోజుగడవడమే గగనం అన్న రీతిలో ఉంటారు.

అటు నగర/పురపాలక సంస్థలు కూడా వేగంగా పెరుగుతూన్న జనాభాకి తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమవుతున్నాయి. స్వచ్ఛమైన గాలీ నీరూ అందేలా చూడడం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, సాఫీయైన రహదారులు వంటి సేవల నిర్వహణే కుంటుతూ నడుస్తుంది. కొండోకచో వీటిని ప్రయివేటు నిర్వహణలో కూడా నడిపిస్తున్నారు. ఈ స్థితిలో నగరంలోని ప్రజల భాషలకు, వారి సంస్కృతులకు—నగరం లోనూ, దాని బడ్జెట్టులోనూ—సముచిత స్థానం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం అనేవి ఊహకందని విషయాలుగానే ఉండిపోతున్నాయి. ఏదో ఒక భాష (మరో అనుబంధ భాషతోనో) పాలన అంతా నెట్టుకొచ్చేయబడుతుంది. జపాన్, చైనా దేశాల నగరాలలో ఆక్కడి స్ధానికభాష చెలామణి ఉంటే, అదొక్కటే ఉంటుంది. ఇతర/పరాయి భాషలకు ఆదరణ ఉంటుందనుకోలేము. సింగపూర్ వంటి నగరాలు పలు భాషలను ఆదరిస్తూ ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాయి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల నగరాలలో అధిక శాతం జనాభా అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే, తెలుగు, ఉర్దూల తర్వాత హిందీ, రాజస్థానీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల వారే ఇందులో ఉంటారు. వీరందరికీ ఆంగ్లం రాదు. అయినా, కార్యాలయాలు, పాలన లోనూ ఆంగ్లానిదే భోగం. కేవలం ఆంగ్లం, తెలుగు (కొన్ని చోట్ల ఉర్దూ) మాత్రమే కనబడే ఈ నగరంలో వీరందరూ ‘సమాచారం అందుబాటు’కి బహుదూరంగానే ఉంటున్నారు. గల్ఫ్ నగరాలతో తెలుగువారి పరిస్థితీ ఇంతే దారుణంగా ఉంటుంది.

కొత్త ఆశలు

  1. న్యూయార్క్ నగరంలో ‘లిటిల్ చైనా’, మరికొన్ని నగరాల్లో ‘చైనా టౌన్’ వంటివి ఆయా ప్రాంతాలనుండి వలనవచ్చిన వారు ఒకే చోట దగ్గరదగ్గరగా స్థిరపడి తమ ప్రత్యేకతతో నివసిస్తూంటే ఏర్పడిన విభాగాలు. ఇలాంటివి పరాయి దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ ఆయా భాషాసంస్కృతుల అచరణకు, పరిరక్షణకు ఎంతగానో తోడ్బడతాయి. నగరాలలో భిన్న సంస్కృతుల ఎదుగుదలకు ఇలాంటివాటికి ఏదో రకమైన తోడ్పాటుని ప్రభుత్వాలు అందిస్తే బాగుంటుంది.
  2. సాంకేతికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు:
    • (అ) దుకాణాల పేరుపలకలు మెల్లగా డిజిటల్ రూపం లోనికి మారుతున్నాయి. వీటిల్లో ఎల్ఈడీ లైట్లతో కూడిన తెర ఉంటుంది, దీనిలో ఏమి కనబడాలి అనేది కంప్యూటర్ ద్వారా నియంత్రించబడుతూంటుంది. వీటిలో కనబడే వాటిని ఎన్ని భాషలలో అయినా ఒకదాని తర్వాత ఒకటి చూపించవచ్చు.
    • (ఆ) నేటి కాలంలో ప్రభుత్వ, నగరపాలక సంస్థల సేవలు అన్నీ అంతర్జాలం ద్వారానో చేతిఫోనులో యాప్ ద్వారానే అందించే వీలుంది. ఆయా సైట్లనూ, యాప్‌లనూ స్థానికీకరించి పలు భాషలలో అందించవచ్చు. పౌరులు తమకు కావలసిన భాషను ఎంచుకుంటారు. కాగితపు ఫారాల వలే ఒకటిరెండు భాషలకు పరిమితమవ్వాల్సిన గత్యంతరం ఉండదు. ఈ స్థానికీకరణ ప్రక్రియను ప్రజల భాగస్వామ్యంతో (క్రౌడ్ సోర్సింగ్) చేయవచ్చు.
    • (ఇ) కృత్రిమ మేధ, యంత్రాలు నేర్చుకోవడం వంటిని మెరుగయ్యేకొద్దీ, వివిధ భాషల మధ్య యంత్రానువాదమూ మెరుగవుతుంది. గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి ఉపకరణాలతో ఇప్పటికే మనం చూస్తున్న అంతర్జాల పేజీలను అప్పటికప్పుడు పలు భాషల్లో చూసే వీలుంది (తక్షణ అనువాదం). ఎదుటనున్న బోర్డు మీది సమాచారాన్ని మన చేతిఫోను కెమేరాతో మన భాషలో చూసుకునే వీలు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా బయటి ప్రపంచాన్ని అప్పటికప్పుడు మన భాషలో చూడవచ్చు. మనుషుల మాటల్ని అప్పటికప్పుడు మరో భాష లోనికి అనువదించి చెప్పే రోబోట్లు, ఉపకరణాలు పరిశోధనల్లోనూ, తయారీ దశల్లోనూ ఉన్నాయి. (తెలుగుకి సంబంధించి ఈ రంగంలో జరగాల్సిన కృషి చాలా ఉంది. మనం పూనుకుని తెలుగుని క్రియాశీలంగా వాడుతుండాలే గానీ, ఇది భవిష్యత్తు సాంకేతిక నిపుణులకు అపార అవకాశాలు కల్పిస్తుంది.)

అందరికీ వారి మాతృభాషలో విద్య వంటి మౌలిక కార్యక్రమాలతో పాటు, ప్రజల భాషలలో సమాచారాన్నీ సేవలనూ అందించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విభిన్న భాషాసంస్కృతుల కలివిడి మనుగడకూ, పెంపుదలకూ సరైన సుహృద్భావ వాతావరణం/పరిస్థితులు కల్పించడం, ప్రజలకు వారి భాషా సంస్కృతుల పట్ట మక్కువను పెంచే చర్యలు చేపట్టడం లాంటి విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు, నగర/పురపాలక సంస్థలూ చేయాల్సిన కృషి చాలా ఉంది. ●

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.