ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ కీబోర్డు లేయవుట్లు

ఈ టపా కార్తిక్ వ్రాసిన ఇన్‌స్క్రిప్ట్ గొప్పదా లేక ఆపిల్ కీబోర్డు గొప్పదా అన్న టపా లోని కొన్ని విషయాలపై నా స్పందన. ఆ టపాపై అక్కడే వ్యాఖ్య రాస్తే, బ్లాగర్ ఏదో తిట్టి నా వ్యాఖ్యని మింగేసింది. ఫార్మాటింగు, లంకెలతో ఒక టపాగా వ్రాస్తే మంచిదని ఇలా ఇక్కడ.

ఏది గొప్పది అని నిర్ణయించను గానీ, నేను మాత్రం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని సిఫారసు చేస్తాను.

  • ఇన్‌స్క్రిప్ట్ మరియు అనూ: బయట మార్కెట్లో డీటీపీ చెయ్యడానికి ఎక్కువగా అనూ స్క్రిప్ట్ మేనేజరుని (దానిలో ఆపిల్ కీబోర్డు లేయవుటుని) ఉపయోగిస్తారు. కానీ, అనూ ఉపయోగించడానికి ఆపిల్ కీబోర్డు లేయవుటు రావాల్సిన పనిలేదు. అనూలో కూడా ఇన్‌స్క్రిప్ట్ లేయవుట్ ఉంది. దీన్ని DOE అని పిలుస్తారు. (అనూ 7 సంగతి నాకు తెలియదు మరి.)
  • యూనికోడ్ టైపు చెయ్యడానికి ఆపిల్ లేయవుటు పరికరం: ఆ పరికరాన్ని నేను కేవలం ఇప్పటికే ఆపిల్ లేయవుటు తెలిసివున్న వారు బ్లాగుల్లోనూ గట్రా (మరో లేయవుటో, లిప్యంతరీకరణో నేర్చుకోనవసరం లేకుండా) యూనికోడ్ తెలుగు టైపు చెయ్యడానికి ఉపయోగపడుతుందని మాత్రమే తయారుచేసాను. ఆ లేయవుటు విశ్వవిజేత అవ్వాలని కాదు. కనుక “వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు” … అన్న ఆయన వ్యాఖ్యతో నేను ఏకీభవించలేను.
  • రివర్స్ టైపింగ్:

    మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత “ర + గ వత్తు +దీర్గం”) మమూలుగా అయితే “ర + దీర్గం+ గ వత్తు” అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి. (వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)

    ఈ సమస్య అనూకి లేదా ఇతర సాంప్రదాయ పద్ధతులకి అలవాటు పడినవారికే అనుకుంటాను. ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ మాత్రమే కాకుండా యూనికోడ్లో ఏ రకంగా వ్రాసినా ఈ రివర్స్ పద్ధతే. ఇది మనం పలికే విధానానికి దగ్గరగా ఉంటుంది. మార్గాలు అన్న పదాన్ని ఎలా పలుకుతాం. కాస్త నెమ్మదిగా పలికి చూడండి… మా ర్ గా లు. ఇలా అయితే మన మెదడుకి చేతివేళ్ళకి సిక్రనింగు బాగా ఉంటుందనిపిస్తుంది.

  • ఇంగ్లీషు – తెలుగుల మధ్య మారడం: Alt + Shift మీటలు కష్టమైతే, వీటిని మనకిష్టమైన మీటకి మార్చుకోవచ్చు కూడా. నేను Caps Lockని మార్పిడి మీటగా ఉపయోగించి అలవాటుని మార్చుకోలేక తిరిగి Alt + Shiftకి మళ్ళాను.
  • ఇన్‌స్క్రిప్ట్ లేయవుటుకి తాజాకరణలు: 2010లో C-DAC వాళ్ళు ఇన్‌స్రిప్ట్ కీబోర్డుని మెరుగుపరుస్తూ—యూనికోడ్ ప్రమాణం లోని అన్ని తెలుగు అక్షరాలను మరియు తెలుగుకి అవసరముండే భారతీయ సంజ్ఞలనూ టైపు చెయ్యగలిగేలా విస్తరిస్తూ—విస్తరిత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డ్ లేయవుట్ 5.2 అని రూపొందించారు. (ఈ పుట లోని మొదటి లంకె ద్వారా ప్రతిపాదిత లేయవుటుని దించుకోవచ్చు.) ఈ విస్తరిత లేయవుటుని లినక్సులో ఉపయోగించుకొనే విధంగా m17n కొరకు ఇన్‌పుట్ పద్ధతిని నేను తయారు చేసాను. (దీని గురించి వివరంగా మరోసారి వ్రాస్తాను. వ్రాసాను, చూడండి.)

ఇంతే సంగతులు!

ప్రకటనలు

డిసెంబర్ 2009

నా కొన్ని ఆసక్తులకి సంబంధించిన జరుగుతున్న వివరాల నివేదిక.

e-తెలుగు

  • e-తెలుగు యొక్క ప్రచారం మరియు ఆవగాహన కార్యకలాపంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ ప్రజలకి కంప్యూటర్లలో తెలుగుని చూడవచ్చూ రాయవచ్చూ, తెలుగులో బ్లాగులున్నాయి , వికీపీడియా ఉంది అని తెలియజేయడానికి హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలుని ఎర్పరచింది. ఈ సందర్భంగా కశ్యప్, చక్రవర్తి, సతీష్, మురళీధర్, కౌటిల్య, రవిచంద్ర, సుజాత, వరూధిని, మరియు ఇంకా ఇతర ఔత్సాహికుల కృషి శ్లాఘనీయం. నేను అక్కడకి మూడు రోజులు మాత్రమే వెళ్ళగలిగాను :( కొత్త బ్లాగర్లను, ఇప్పటివరకూ నేను కలుసుకోని పాత బ్లాగర్లను, సాహిత్య/సినీరంగ ప్రముఖులనూ కలుసుకోవడం ఆనందదాయకం.

స్థానికీకరణ (తెలుగీకరణ)

స్వేచ్ఛా మృదూపకరణాలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

‘యాహూ మెయిల్’ అని తెలుగులో ఎందుకు వెతుకుతున్నారు?

ఆశ్చర్యకరంగా నా బ్లాగుకి చాలా మంది “యాహూ మెయిల్” అని తెలుగులో శోధించి (ఈ టపాకి) వస్తున్నారు. జనాలు యాహూ మెయిల్ గురించి అంత ఎక్కువగా ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రింది తెరపట్టులలో మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్న కీపదాల సందర్శనలకి తేడాని గమనించండి. పొంతనే లేదు. (ఇదేమైనా గూగుల్ బాంబు లాంటిది కాదు కదా?)

గత 30 రోజులలో పై ఐదు కీపదాలు, వాటి ద్వారా నా బ్లాగుకి వచ్చిన సందర్శనలు:

"యాహూ మెయిల్" కీపద శోధనతో నా బ్లాగుకి వచ్చిన సందర్శనలు

“‘యాహూ మెయిల్’ అని తెలుగులో ఎందుకు వెతుకుతున్నారు?” ‌చదవడం కొనసాగించండి

స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు

పట్టణాల్లో ఉంటున్నమనం త్రాగేనీటిపై తగిన శ్రద్ధ వహించాలికదా. మేము మా ఇంట్లో త్రాగేనీటి కోసం కాచి వడపోసిన నీటిని ఉపయోగిస్తాం. స్వచ్ఛమైన నీటికోసం మరింత సులభమైన పద్ధతులు, సాధనాలు ఉండిఉంటాయి. వాటర్ ఫిల్టర్, ఆక్వాగార్డు, తదితరాలు.

నేను హిందూస్థాన్ లీవర్ వారి ప్యూరిట్‌ని కొందామని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా దానిని ఉపయోగించిఉంటే చెప్పండి, మీరు దానితో సంతృప్తికరంగా ఉన్నారా? నేను ప్యూరిట్‌నే ఎంచుకోవాలా? లేదా మరేమైనా ఉత్తమ ఫలితాలు చూపే చౌక సాధనాలు ఉన్నాయా? ఒక రూపాయితో అత్యధిక ప్రయోజనం ప్యూరిట్ అందిస్తుందని హిందూస్థాన్ లీవర్ వారు చెప్తున్నారు. మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయండి.

ఐఐఐటి హైదరాబాదుకి నా సందర్శన

పప్పు నాగరాజు గారు నాకు ఐఐఐటి ప్రొఫెసర్ వాసుదేవ వర్మ గారిని పరిచయం చేసారు. వాసుగారు శోధన మరియు సమాచార వెలికితీతల ప్రయోగశాల (Search and Information Extraction Lab, SIEL) కి నాయకత్వం వహిస్తున్నారు. ఐఐఐటిలో ఇది భాషా సాంకేతికతల పరిశోధనా కేంద్రం (Language Technologies Research Centre, LTRC) లో భాగం. వారి ఆహ్వానంతో లాబ్ సందర్శనకు నేను వెళ్ళా.

SIELలో విద్యార్థులు మరియు పరిశోధకులు (మన తోటి తెలుగుబ్లాగరు సౌమ్య కూడా ఈ విభాగంలోనే) పనిచేస్తున్న ప్రాజెక్టులని చూసా. వీరి ప్రణాళికల్లో బొమ్మల్లో ఉన్న వచనాన్ని శోధించడం (results from scanned images) కూడా ఉంది. ఇది వీలుపడితే, తిరుగేలేదు. ఎందుకంటే చాలా వరకు భారతీయభాషల్లోని సాంఖ్యాసమాచారం (digital content) ఇమేజిల రూపంలో ఉంది. జయధీర్ తిరుమలరావుగారి ప్రాజెక్టు (పోయినసారి e-తెలుగు సంఘ సమావేశ విశేషాల్లో వీరిగురించి చూడండి.) కి దీన్ని అనుసంధానిస్తే పురాతన విషయ సమాచారాన్ని శోధించే వీలు చిక్కుతుంది.

SIEL ప్రాజెక్టులలో కొన్నింటిని మనం వెబ్‌లో ప్రయత్నించవచ్చుకూడా. ఇవన్నీ గొప్ప ప్రాజెక్టులు. కీలకమైన అంశమేంమంటే, వీటిని సాధారణ వాడకానికి అనుగుణంగా తీర్చిదిద్దవలసిఉంది. వీటిని జనబాహుళ్యంలోనికి తీసుకురావడానికి నావంతు సహకారం అందిస్తానని చెప్పాను. ఈ ప్రాజెక్టులలో మీరు ఏయే మార్పులని ఆశిస్తున్నారు? అసలు వీటికి సంబంధంలేకుండా, మీ సమాచార ఆవశ్యకాలేంటి? బ్లాగర్లుగా సమాచార వినియోగంలో మనం ముందుంటాం. వీరినుండి మనమేం ఆశించవచ్చు? మీ ఆలోచనలని ఇక్కడ తెలియజేయండి. వీటిపై వారు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.

నేను పనిచేసిన, చేస్తున్నవాటిగురించి వారికొక ప్రదర్శన (presentation) ఇచ్చా. అంతా మీకుతెలిసిందే, నా సొడబ్బా. కాకపోతే మీరిది చూడలనుకోవడాని ఓ కారణముంది: బహుశా ఇది యూనికోడ్ తెలుగులో తొలి ప్రెజెంటేషన్ కావచ్చు.

2006

నా జీవితంలో ఇప్పటివరకు 2006 అత్యంత ముఖ్యమైన సంవత్సరం. వ్యక్తిగతంగా (వివాహం), వృత్తిపరంగా (రెండుసార్లు పదోన్నతి), మరియు సాంఘికంగా (లేఖిని మరియు కూడలి) ఈ సంవత్సరం నాక్కొంత ప్రత్యేకత, గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇవీ ఈ సంవత్సరంలోని విశేషాలు:

ఇన్ స్క్రిప్ట్ వైపు పయనం

సి-డాక్ వారి సీడీలో తెలుగు ఇన్ స్క్రిప్ట్ టైపింగు ట్యూటర్ ఉంది. దానితోతెలుగు టైపింగు నేర్చుకోవడం మొదలుపెట్టా. త్వరగానే నేర్చుకోగలుగుతున్నాను. అనుకున్నంత కష్టంగా ఏమీలేదు. ఈ టపాని ఇన్ స్క్రిప్టులోనే టైపు చేస్తున్నాను. ఇక నాకు లేఖినితో అవసరం తీరిపోయినట్టే!