తెలుగు వినియోగదారులకు (భాషాభిమానులకు) మేలుకొలుపు

ఈ వ్యాసం తొలుత అమ్మనుడి మాస పత్రిక మే 2018 సంచిక లో ప్రచురితమైంది.

మన రోజువారీ జీవనంలో అనేక వస్తువులని వినియోగిస్తూంటాం, అనేక సేవలు పొందుతుంటాం. టూత్ పేస్టు నుండి గదిలో ఫ్యాను వరకూ, పచారీ సరుకులు ఇంటికే తెప్పించుకోవడం నుండి బీమా, బ్యాంకు సేవల వరకు. అయితే, వీటిలో ఎన్ని తెలుగులో ఉంటున్నాయి?

ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. రోజంతా మీరు వాడే వస్తు సేవల్లో తెలుగులో ఉన్నవి ఎన్ని లేనివి ఎన్ని చిట్టా రాయండి. అది కష్టం అనుకుంటే, వారాంతపు లేదా నెలవారీ కిరాణా సామాను కొన్నప్పుడు వచ్చే సామానులో ఎన్ని తెలుగులో ఉన్నాయో లెక్కించి చూడండి. తెలుగులో ఉండటం అంటే ఏమిటి? ఈ ఉండటం కొన్ని స్థాయిల్లో ఉండొచ్చు:

 1. వస్తువు లేదా ఉత్పత్తి పేరు (బ్రాండు, లేదా కంపెనీ పేరు) తెలుగు అక్షరాలలో ఉండటం.
 2. వస్తువును వాడుకోడానికి సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు తదితర సమాచారం తెలుగులో ఉండటం.
 3. వస్తువు తయారీలో వాడిన పదార్థాల వివరాలు, పోషక విలువలు తదితర సమారారం తెలుగులో ఉండటం.
 4. వస్తువు ధర, ఎప్పుడు ఎక్కడ తయారైంది తదితర వివరాలు తెలుగులో ఉండటం.

మీ ఓపికను బట్టి వీటంన్నింటనీ లెక్కగట్టండి.

నా వరకూ అయితే, (హైదరాబాదులో ఒకనాటి కిరాణా జాబితాలో) జెమినీ టీపొడి ప్యాకెట్టు మీద తప్ప మరో దానిమీద తెలుగు అక్షరం కనబడలేదు. (నా జాబితాలో లేని సరుకులలో గమనించినవి: బిస్లెరీ మంచినీళ్ళ సీసాల మీద పేరు తెలుగులో రాస్తున్నాడు.)  టీవీల్లోనూ, పత్రికల్లోనూ తెలుగులో వ్యాపార ప్రకటనలు ఇచ్చే వస్తువులు కూడా తెలుగులో లేవు. (చిన్నప్పుడు కోల్గేట్ పండ్లపొడి డబ్బా తెలుగులో ఉండేది.)

వస్తూత్పత్తుల మీద తెలుగు అనేది భాషోద్యమకారులూ, భాషాభిమానులూ పెద్దగా పట్టించుకోని అంశం. వారు అంతగా ప్రభావం చూపించలేకపోయిన అంశం! తతిమా విషయాలపై కృషి చేసినంతగా, పట్టుపట్టినంతగా ఈవిషయంలో చేయలేదు. మనందరం దీన్ని తలకెత్తుకోవాలి.

ఉత్పత్తుల మీద పేర్లూ, వివరాలూ తెలుగులో ఉంటే రెండు దీర్ఘకాలిక లాభాలు కూడా ఉన్నాయి: (1) మన చూట్టూ ఉన్న వాతావరణంలో తెలుగు పాలు పెరుగుతుంది. (2) తెలుగు వచ్చిన వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

మన దైనందిన జీవనం (అందులో భాగమైన ప్రతీదీ) మన సొంత భాషలో ఆశించడం మన హక్కు. ఆ దిశగా కృషి చేయడం, పోరాడటం మన బాధ్యత.

ఎలా మొదలుపెడదాం?

 1. సామాజిక మాధ్యమాలు: మనం రోజువారీ వాడే వస్తువుల తయారీ సంస్థలన్నీ ట్విట్టర్, ఫేస్‌‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకుని మీ ఉత్పత్తులను తెలుగులో అందించండి అని అడగడం. ఒక్కరు అడిగినా సరిపోదు, ఒక్కసారి అడిగినా సరిపోదు. సందర్భానుసారం అడుగుతూనే ఉండాలి.
 2. ఆయా కంపెనీల వినియోగదార్ల తోడ్పాటు కేంద్రాలకు విన్నవించుకోవడం. వారి సర్వేలు, అభిప్రాయ సేకరణల్లో వారి ఉత్పత్తులు తెలుగులో కావాలని ప్రత్యేకంగా అడగాలి.
 3. ప్రభుత్వ విధానాలు: ఈ దిశగా సరైన ప్రభుత్వ విధానాలు రూపొందుకొనేలా సరైన వ్యక్తులను, సంస్థలను ప్రభావితం చెయ్యాలి.

నమూనా ప్రభుత్వ విధానం

ఈ విషయంలో విధానపరంగా తెలుగు అమలు ఈ స్థాయిల్లో ఇలా ఉండొచ్చు:

తప్పనిసరి స్థాయి: తెలుగు రాష్ట్రాలలో అమ్ముడయ్యే ప్రతీ ఉత్పత్తిపై వినియోగదార్లకు (ఆరోగ్య, ఆర్ధిక, లేదా ఇతరత్రా) హానికరమైన, లేదా హాని కలిగించే అవకాశమున్న, నష్టాన్ని కలిగించే, కలిగించగల అంశాలపై సమాచారం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి. ఆ సమాచారపు పాఠ్యం పరిమాణం కూడా 10 పాయింట్లకు తగ్గకుండా ఉండాలి. ఉదాహరణకు ఔషదాలు, ఆహార పదార్ధాలకు కాలపరిమితి, వాటిని నిల్వ చేయాల్సిన పద్ధతి, వాటిలో వాడిన హానికరమైన పదార్థాలు, వాటి దుష్‌ప్రభావాలు.

అవసర స్థాయి: ప్రతీ ఉత్పత్తిపై దాని పేరు, దాని ఉపయోగం, కొలతలు, ధర, వాడకంలో వినియోగదార్లు తెలుసుకోవలసిన సమాచారం తెలుగులో ఉండాలి. ఉదాహరణకు: ఆహార పదార్థాలలో పోషక విలువలు. ఉపకరణాలకు వాడుకరి మార్గదర్శినులు.

ప్రోత్సాహక స్థాయి: విలాస వస్తువులు, ఖరీదైన గృహోపకరణాలు వంటివాటిపైన పేర్లు. దిగుమతి చేసుకున్న వస్తువులు.

సేవల విషయంలో అయితే దరఖాస్తు ఫారాలు, ఒప్పంద పత్రాలు, రశీదులు, ఖాతా పద్దులు, నియమ నిబంధనలు వంటివన్నీ కూడా తెలుగులో ఉండాలి.

మనందరం కలిసి ఆలోచిస్తే, మరింత మెరుగైన విధాన పత్రాన్ని తయారుచెయ్యవచ్చు. దాన్ని ప్రభుత్వ ఉత్తర్వుగానో, చట్టంగానో రూపొందించమని ప్రజాప్రతినిథులను కోరవచ్చు.

ఒక విధానమో, చట్టమో రూపొందేవరకూ మనం వేచిచూడకుండా, వినియోగదార్లుగా వ్యాపార సంస్థలను అడగడం, తోటి వినియోగదార్ల నుండి ఒత్తిడి పెంచడం కూడా చాలా అవసరం. “నేను వాడే వస్తుసేవలు నా భాషలో” అన్నది వినియోగదారుల కనీస హక్కు అని వినియోగదార్లలో చెతన్యం పెంచడమూ ముఖ్యం.

3 thoughts on “తెలుగు వినియోగదారులకు (భాషాభిమానులకు) మేలుకొలుపు

 1. వీవెన్ గారూ! సరైన సమయంలో విలువైన విషయాన్ని లేవనెత్తారు. ధన్యవాదాలు. నా వంతు ప్రయత్నం చేసి మరో నలుగుర్ని కదిపుతాను.
  మీ వ్యాసం ఈ ఉదయవే చదివి, మరుగుదొడ్డి లోకీ వంటింట్లోకీ తొంగి చూశాను. గుండె గుభేల్మంది. తెలుగు లేకపోవడమే కాదు. అత్యవసర సమాచారమే ముద్రించని సంగతులు. పాల పాకెట్ పై పోషక విలువల వివరాలు మానేసి, ఎన్నో ‘సమృధ్ధి’ గా ఉన్నాయని ముద్రించారు. అంతకంటే చట్టవిరుధ్దం గా -కరీంనగర్ డైరీ పాల పాకెట్టుపై బాచ్ నెంబరూ, ఉత్పత్తి తేదీ, ఎప్పట్లోగా వాడాలి వంటి వివరాలు ముద్రించనే లేదు..
  ఇక తెలుగులో వివరాలూ, పేర్లూ లేని ఉత్పత్తుల వివరాలు నమోదు చెయ్యాలంటే ప్రత్యేకంగా ఒక వెబ్ సైటు కావాల్సిందే.
  ఇంతటి విషాదంలోనూ… భలే హాస్యపు తునకలు దొరికాయి పొద్దున్న పొద్దున్నే. అందుకు మీకు మరో దణ్ణం.
  ఉదా: ‘హోమోజనైజుడు, పాశ్చరైజుడు పాలు’. హిందీలో (నాకు రాయడం రాదు) ’హేండు వాషు’ పైగా పతంజలి ఉత్పత్తి.

 2. వీవెన్ గారూ,

  మీరు చెప్పినది అక్షర సత్యం. అంతంత మాత్రంగా అక్షరాస్యత ఉన్న చోట్ల, మందులువంటి కొన్ని ముఖ్యమైన వినిమయ వస్తువుల విషయంలో హెచ్చరికలు, వాడే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి వివరాలు తెలుగులో (మాతృభాషలో) లేకపోవడం నిజంగా విచారించవలసిన విషయం. సామాజిక కార్యకర్తలు తప్పకుండా దృష్టిపెట్టవలసిన విషయం.
  మంచి విషయంగురించి ప్రస్తావించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  ఎన్. ఎస్. మూర్తి.

 3. వీవెన్ గారూ, చాల గొప్పగ రాసారు. దీనిని telugu maata ఈమెయిలు జట్టు లోను, whatsapp జట్ల లోను పెట్టండి. తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని), పారుపల్లి కోదండ రామయ్య

  తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.