CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి

వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. Drop cap example జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది.

ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు:

p::first-letter { font-size: 3em; }

కానీ కేవలం మొదటి పేరా లోని మొదటి అక్షరానికి మాత్రమే వర్తించాలంటే:

p:first-child::first-letter { font-size: 2em; color: red; }

పై నియమంలో, :first-child అనే సూడో-తరగతి <p> మూలకం అది ఉన్న స్థాయిలో మొదటిది అయితే గనక గుర్తిస్తుంది.

అక్కడవరకూ బానే ఉంది. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి, జాల విహారిణులు మొదటి అక్షరాన్ని సరిగా గుర్తించలేకపోతున్నాయి. (తెలుగులో ఒక అక్షరం 7 యూనికోడ్ కోడుపాయింట్ల వరకూ, అంతకంటే ఎక్కువకూడా, ఉండొచ్చు. ఉదాహరణకు స్ట్రాంగ్ అనే పదంలో మొదటి అక్షరం “స్ట్రాం”లో 7 కోడుపాయింట్లు ఉన్నాయి.) ఫైర్‌ఫాక్స్ వారికి నేను ఈ దోషాన్ని నివేదించాను. ఆ దోషం సరయ్యింది కనుక ఫైర్‌ఫాక్స్ ఇప్పుడు తెలుగు మొదటి అక్షరాన్ని సరిగానే గుర్తుపడుతూంది.

వివిధ విహారిణుల్లో తెలుగుకి సంబంధించి ::first-letter సూడో-మూలకానికి ఉన్న తోడ్పాటు ఇదీ (బొమ్మను ఇంకా పెద్దగా చూడడానికి దానిపై నొక్కండి):

Support for ::first-letter for Telugu text across major web browsers

మీ అభిమాన విహారిణిలో దీన్ని పరీక్షించి చూడడానికి ఈ పేజీ (మరోటి) ఉపయోగపడవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే, మీ విహారిణి తయారీదారుకి నివేదించండి.

ఈ టపా ఆంగ్లంలో కూడా చదవవచ్చు.

ప్రకటనలు

ఫైర్‌ఫాక్స్ చిట్కా: లంకె మధ్యలోని పాఠ్యాన్ని ఎంచుకోవడం

మనం జాల పేజీల్లో ఉన్న సమాచారాన్ని కాపీ చేసుకోవాలంటే ముందుగా కాపలసిన పాఠ్యాన్ని మూషికంతో (మౌసుతో) లాగి ఎంచుకుంటాం (సెలెక్టు చేసుకుంటాం). లంకె పాఠ్యం కావాలంటే లంకె మొదలవక ముందు నుంచి లాగితే సరిపోతుంది. కానీ, లంకె మధ్యలో ఉన్న పాఠ్యాన్ని ఎంచుకోవాలంటే, కుదరదు. మనం లాగినప్పుడు లంకె మొత్తం వచ్చేస్తూంటుంది.

సమస్య అర్థం కావాలంటే ఈ క్రింది పంక్తిలో కేవలం “ఎస్వీ రంగారావు” అన్న పాఠ్యాన్ని ఎంచుకోండి.

తెలుగు వికీపీడియాలో ఎస్వీ రంగారావు వ్యాసంలో ఎస్వీ అంటే ఏంటో తెలుసుకోవచ్చు.

ఎంచుకోగలిగారా? కుదరడం లేదు కదా, అదీ సమస్య. ఈ సమస్యకి ఫైర్‌ఫాక్స్ జాల విహారిణిలో ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే: లంకె పాఠ్యాన్ని ఎంచుకోడానికి మూషికాన్ని లాగేటప్పుడు Alt మీటను నొక్కి పట్టుకోవడమే! తర్వాతి ఫైర్‌ఫాక్స్ సంచికలో (బహుశా వెర్షన్ 32 నుండి) ఆల్ట్ మీటను పట్టుకోనవసరం లేకుండా నేరుగానే లంకెల్లోని పాఠ్యాన్ని ఎంచుకోవడం సాధ్యమవుతూంది.

ఇతర జాల విహారిణుల్లో ఈ సౌలభ్యం ఉన్నట్టు లేదు. :-(

ఆనంద జాల విహారణం!

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం!

నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ యొక్క సరికొత్త కూర్పు 3.5 ఈ మధ్యే విడుదలయ్యింది. (మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.) ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి చాలా వ్యాసాలు ఇప్పటికే జాలంలో తేలియాడుతున్నాయి చూడండి.

మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!
మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!

ప్రపంచవ్యాప్తంగా ఫైర్‌ఫాక్స్ 3.5 దింపుకోళ్ళు ఎలా జరుగుతున్నాయో చూడండి. అలానే ఫైర్‌ఫాక్స్ తాజా మార్కెట్ వాటా శాతాన్ని కూడా చూడండి.

హైదరాబాదులో సంబరాలు

గత ఏడాది లానే ఈ సారి కూడా ఫైర్‌ఫాక్స్ విడుదల సందర్భంగా హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ అభిమానులం కలుద్దాం రండి. ఆ వివరాలు:

తేదీ మరియు సమయం: ఆదివారం, జూలై 19, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు.

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం:

  • ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి మాట్లాడుకుందాం
  • మీ మీ లాప్‌టాపులు (అంకోపరులు) తెస్తే, దానిలో మంటనక్క 3.5 ని స్థాపించి విశేషాలను అక్కడికక్కడే ప్రదర్శించవచ్చు.
  • మీ లాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ల కోసం స్టిక్కర్లు, మీ కోసం ఫైర్‌ఫాక్స్ 3.5 బాడ్జీలు కూడా ఇస్తాం

మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానులై, హైదరాబాదులో ఉంటే ఈ సంబరాలకి తప్పకుండా రండి.

ఆనంద జాలా జ్వాలనం!

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక

హైదరాబాదులో నిన్న (ఆదివారం, జూన్ 22) ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ విజయవంతంగా జరిగింది. మొత్తం 25గురు  ఫైర్‌ఫాక్స్ అభిమానులు హాజరయ్యారు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సంవత్సరాల నుండి 70 పైబడిన వారి వరకూ వీరిలో ఉన్నారు. మీడియా నుండి సాక్షి విలేఖరి దీప వచ్చారు.

మొదటగా పరిచయాలతో (పేరు తదితర వివరాలతో బాటు, మంటనక్కతో అనుబంధం ఎలా, ఎప్పటినుండి అన్న వివరం కూడా) ప్రారంభించాం. తర్వాత నేను సీడీలు పంచి దానిలోని ఉపకరణాల గురించి క్లుప్తంగా వివరించాను. పవన్ అవసరమైన చోట వివరాలను జోడిస్తూ అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారు. ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాల గురించి మొదలు పెడుతూ పెర్ఫామెన్స్ పరంగా ఈ వెర్షను చాలా మెరుగైనట్టు గమనించానని శ్రీధర్ వివరించారు.  ఆపై ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాలని నేను, శ్రీధర్, పవన్ లు వివరించాం. వెర్షన్ 3లో మెరుగైన విశేషాలు వేగం (improved performance), చిరునామా పట్టీ (location bar), దిగుమతులు నిర్వహణ (download manager), ఒకే నొక్కు బుక్‌మార్కింగ్, font and text rendering, SVG తోడ్పాటు అలానే కొత్త సౌలభ్యాలైన పూర్తి పేజీ జూమ్, విస్టా థీము, ఇంకా అనేకాల గురించి మాట్లాడుకున్నాం. ఫైర్‌ఫాక్సులో తమకు నచ్చే విషయాల గురించి కూడా అందరూ చెప్పారు.

కొత్త విశేషాలపై వివరణలకోసం Field Guide to Firefox 3 చూడమని సూచించాం.

అందరి సందేహాలకు శ్రీధర్ మరియు పవన్ సూక్ష్మ వివరాలతో సహా సమాధానాలు ఇచ్చారు. ఇక పొడగింతల గురించి ప్రస్తావల రాకుంటా ఎలా ఉంటుంది. ఆడ్ బ్లాక్ ప్లస్, హిట్-ఎ-హింట్, డెలీషియస్, గ్రీస్ మంకీ, బెటర్ జీమెయిల్, FireFTP లాంటి పొడగింతల గురించి చెప్పుకున్నాం. కొన్ని ముఖ్యమైన కీబోర్డు షార్టుకట్లను తెలుపమని రావుగారు అడుగగా కొన్నింటిని చెప్పాం.

మనకి ఏ కంప్యూటర్లో నైనా అందుబాటులో ఉండేట్టుగా మన బుక్‌మార్కులు (పేజీకలు), సంకేతపదాలు (passwords) లాంటివి అంతర్జాలంలో దాచుకోలేమా అన్న ప్రశ్నకి గూగుల్ సింక్రనైజర్ ఉందని అలానే మొజిల్లా ప్రయోగశాల నుండి వీవ్ అనే కొత్త పొడగింత రాబోతుంది అని నేను చెప్పా.

ఫైర్‌ఫాక్స్  యొక్క హైదరాబాదు వాడుకరుల కోసం ఓ గూగుల్ గుంపు ఉన్నట్టు అందరికీ తెలియదని రావుగారన్నారు.

ఇతరత్రా విశేషాలు: కట్టా విజయ్ ఉబుంటు సీడీలను పంచారు. కందర్ప కృష్ణమోహన్ తన మార్కు చిట్టికాజాలను తెచ్చి అందరి నోళ్ళను తీపిచేసారు.

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ గ్రూప్ ఫొటో (ఫొటో: సీబీరావు)

చివరిగా గ్రూప్ ఫొటో దిగి, అటునుండి క్యాంటీనుకి వెళ్ళి టీ తాగి, సెలవు తీసుకున్నాం.

ఈ పార్టీ విజయవంతంగా జరగడంలో చాలా మంది సహకారం ఉంది. ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్, కట్టా విజయ్, పవన్, సీబీరావు మరియు కృష్ణమోహన్. మీకు నెనర్లు. వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు!

ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

(భారత కాలమానం ప్రకారం) ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు రాత్రి 10:30 లోపు ఫైర్‌ఫాక్స్ 3ని దిగుమతి చేసుకోండి.

అప్పటి వరకు ఫైర్‌ఫాక్స్ 3 లోని విశేషాల గురించి తెలుసుకోండి.

మీరు ఇతర దేశాలలో ఉన్నట్లయితే, దిగుమతి చేసుకోవాల్సిన సమయం సుమారుగా 17:00 UTC (మీ నగరంలో ఆ సమయం). ఆ సమయం నుండి 24 గంటలలోపు దిగుమతి చేసుకోవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

తాజా సమాచారం: మీ ప్రదేశం ప్రకారం ఏ సమయమో చూపే పటం (Digital Inspiration నుండి):

Firefox 3 Download Day Start

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!

మీ అభిమాన విహారిణి మంటనక్క యొక్క సరికొత్త వెర్షన్ (మంటనక్క ౩) ఈ నెల 17వ తేదీన విడుదలవ్వబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా మొజిల్లా పార్టీలు జరుగుతాయి.  హైదరాబాదులో ఓ పార్టీని నేను (స్నేహితుల సహాయంతో) నిర్వహిస్తున్నాను. హైదరాబాదులోని వారికి ఇదే మా ఆహ్వానం!

ముఖ్యమైన వివరాలు

తేదీ మరియు సమయం: ఆదివారం, జూన్ 22, 2008 సాయంత్రం 4 గంటలనుండి 6 వరకు

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం

  • మంటనక్క 3 మరియు ఇతర స్వేచ్ఛా మృదుపరికరాల సీడీలు ఇస్తాం.
  • మీ మీ అంకోపరులు (ఉంటే) తెస్తే, దానిలో మంటనక్క 3 ని స్థాపిస్తాం
  • మంటనక్క 3 విశేషాలని వివరిస్తాం.

మీ ఉపాయాలు మరియు సూచనలు ఇక్కడ పంచుకోండి. మీరు హైదరాబాదులో ఉంటే తప్పకరండి.

అన్నట్టు, విడుదల రోజునే అత్యధిక దిగుమతులు జరుపుకున్న ప్రపంచ రికార్డు ఉపకరణంగా మంటనక్కని నిలపడం కోసం మొజిల్లా మరియు దాని అభిమానులు సంకల్పించారు. మీరూ పాల్గొంటున్నారా? జూన్ 17న సిద్ధంగా ఉండండి.

తాజాకలం: సంబరాలు విజయవంతంగా జరిగాయి. పార్టీ నివేదికని చదివి విశేషాలు తెలుసుకోండి.

[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
చదవడం కొనసాగించండి