చిఱుచిరలు

‘చిరకాలం’ అంటే ఎక్కువ కాలం అని అర్థం. కానీ ‘చిరుప్రాయం’ అంటే చిన్న వయసు అని. ఏమిటీ తిరకాసు అని చిఱచిఱలాడకండి. ఒకటి సంస్కృతం నుండి వచ్చిన మాట, మరోటి అచ్చ తెలుగు మాట. ఈ కింది అర్థాలనూ ఉదాహరణలనూ చూడండి:

చిరం (సంస్కృతం)
ఎక్కువ కాలం. చిరంజీవి, చిరాయువు, చిరకాలం
అచిరం (సంస్కృతం)
తక్కవ కాలంలో. నువ్వు అచిర కాలం లోనే గొప్ప ధనవంతుడివై పెద్ద భవనం కట్టిస్తావు.
చిఱు, చిరు (తెలుగు)
చిన్నని, అల్ప. చిరుగాలి, చిట్టెలుక (చిఱు + ఎలుక), చిరునవ్వు, చిరుతిండి, చిఱుప్రాయం

కొందరు అచిరకాలం అంటే ఎక్కువ కాలం అని అనుకుంటున్నారు. మిల్లెట్లు… ఆరోగ్యానికి బుల్లెట్లు! అనే వ్యాసంలో తప్పుగా అచిరకాలం జీవించేలా చేసేవివి అని వ్రాసారు. సుజనరంజని పత్రికలో తెలుగు క్రికెట్ తేజం సీకే నాయుడు గురించిన వ్యాసంలో బంతి ఉన్నది కొట్టడానికే అన్న దృష్టి కలిగి ఉండి, అచిరకాలం అలానే ఆడేరు అని వ్రాసారు. ఈ రెండు చోట్లా చిరకాలం అని ఉండాలి.

సరైన వాడుక, నిన్నటి సాక్షి పత్రికలో సంగీత దర్శకుడు చక్రి గురించి ఆర్.పీ. పట్నాయక్:

సంగీతం అందించాలంటూ తన దగ్గరకు వచ్చినవాళ్ళను అతను ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. ‘నాకు పని వచ్చింది. అది బాగా చేయాలి’ అన్నదే అతని దృష్టి అంతా! అందుకే, సినిమాలతో నిత్యం బిజీగా ఉండేవాడు. అచిరకాలంలోనే 90 పైచిలుకు సినిమాలు పూర్తి చేయగలిగాడు.

… అని బేతాళుడు కథ చెప్పడం ఆపి, “ఓ! విక్రమార్కా, ఆ చిరంజీవి ఇప్పుడు చిఱుజీవి ఎందుకు అయ్యాడు? ఆ తోటలోని చిఱుగాలి అచిరకాలం లోనే పెనుగాలిగా ఎలా మారింది? పవనించడానికి చిరకారం ఎందుకు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వేయి వ్రక్కలవుతుంది!” అని హెచ్చరించాడు.

2 thoughts on “చిఱుచిరలు

  1. వామ్మో?నా తల ఇక్కడ కామెంటు వేస్తే వెయ్యి ముక్కలవుతుందో వెయ్యకపోతే అవుతుందో తేలిసిచావడం లేదేందిరా?
    అబ్బా!వేసి బతికుంటే మళ్ళీ వస్తా,లేకుంటే చిరుజీవిలాగా మారిన చిరంజీవి లాగా బతికేస్తా!యేందయినా వొకటే గందా!

  2. కరు చిరు కడు నిడు నడు సబ్ధలకు ర, డ ల అచ్చు పరంబైనప్పుడు ద్విరుక్త టకారంబగు

    ద్విరుక్త టకార సంధి సూత్రం చెప్పమంటే చెప్తాం గానీ చివరి ప్రశ్నకు జవాబు చెప్పలేం! తెలిసి కూడా! తల వేయి చెక్కలు కాక ముందే నిష్క్రమిస్తే మంచి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.