e-తెలుగు ప్రశ్నలు & జవాబులు

e-తెలుగు గురించి కొన్ని ప్రశ్నలు కొన్ని నా జవాబులు.

హిందీ, ఇంగ్లిష్‌, అరబిక్‌ వంటి భాషల సాపత్యం వల్ల కొత్త పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. చేరుతున్నాయి. ఈ భాషలను మనం కలుపుకొని వాటి ద్వారా వచ్చిన బలాన్ని మనం చేజిక్కించుకుంటే వచ్చిన తప్పేమిటి? ప్రతి పదాన్ని తెలుగులోనే పలకాలనే భావన ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఈ మాత్రం సహేతుకం?

ఇతర భాషల పదాలని భేషుగ్గా తెలుగులో కలిపేసుకోవచ్చు. తప్పేంలేదు.

ఇక ప్రతీ పదాన్నీ తెలుగులోనే పలకాలనే భావనని నేను వ్యక్తిగత అభిరుచి కంటే ఎక్కుగా చూడలేను. నాకయితే, పదాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకి, మెనూ అన్నదాన్ని నేను మెనూ అనే అంటాను (నాకు నచ్చిన పదం తగిలే వరకు). మరొకరు జాబితా అనో, పట్టిక అనో అనవచ్చు.

– ఈ-తెలుగు వ్యవస్థాపక అధ్యక్షులెవరూ? దానిలో సభ్యులెవరూ?

e-తెలుగు ఎలా ఏర్పడింది? లో చూడండి.

బ్లాగర్లందరూ ఈ-తెలుగులో సభ్యులవుతారా? ఒక వేళ కాకపోతే- ఈ-తెలుగు కరపత్రాల్లో పదహారు వందల మంది బ్లాగర్లు తమ వెంట ఉన్నారన్నట్లు ఎందుకు ప్రచురించుకుంటున్నారు?

బ్లాగర్లందరూ ఆటోమెటిగ్గా e-తెలుగులో సభ్యులు కారు. కరపత్రాల్లో తెలుగు బ్లాగర్లు ఇంత మంది ఉన్నారు అని అన్నారా? లేక వీరందరూ e-తెలుగు వెంట ఉన్నారన్నారా?

– అసలు ఈ-తెలుగు లక్ష్యమేమిటి? ఇంటర్నెట్‌లో తెలుగును వ్యాప్తి చేయటమా? లేక బ్లాగర్లకు సలహాలు సూచనలు అందించటమా? ఈ రెండు వేర్వేరు లక్ష్యాలనే విషయం ఈ-తెలుగు సభ్యులకు తెలుసా?

బ్లాగర్లకు సూచనలు e-తెలుగు ఎప్పుడు అందించింది? ఒక వేళ అందిస్తే తప్పేంటి? జాలంలో తెలుగుకి వచ్చేసరికి తెలుగు బ్లాగులదే సింహ భాగం. దాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సలహాలు, సూచనలు అందించడం అన్నది నా దృష్టిలో చేయకూడనిదేమీ కాదు. అధికారిక సమాధానం కోసం e-తెలుగు సైటులోని సందేహాల పేజీని కూడా చూడండి.

– కేవలం బ్లాగులను పెట్టినంత మాత్రాన నెట్‌లో తెలుగు ప్రచారం జరుగుతుందా? దీనికి అనుసరించాల్సిన వ్యూహాలేమిటి? ఖాళీ ఉన్నప్పుడు లేదా తమకు వెసులుబాటు ఉన్నప్పుడు ఏ మాత్రం ఉపయోగం లేని భాషసంఘం వంటి వాటికి వెళ్లి ఛైర్మన్లను కలిసిరావటం తప్పితే- ఇప్పటి దాకా చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఒక వేళ ఉంటే దాన్ని విస్తృత ప్రచారం చేయవచ్చు కదా..

హైదరాబాద్ మరియు విజయవాడ పుస్తక ప్రదర్శనల వల్ల లక్షల మందికి (కాకపోయినా వేల మందికి) కంప్యూటర్లలో తెలుగు చూడవచ్చనీ, రాయవచ్చనీ తెలిసింది. That’s really a big one. ఏం చేసినా ఖాళీ సమయాల్లోనే చేయగలం. ఆలోచనలు చాలా ఉన్నాయి. ఆలోచనలని, ఉపాయాలని, సూచనలని క్రోడీకరించి వాటిని చేయదగ్గ పనులుగా మలిచే వాళ్లూ కావాలి. పనులు చేయడానికి e-తెలుగుకి ఇంకా చాలా మంది కావాలి. e-తెలుగుకి చాలా పరిమితులున్నాయి. అదింకా పరిపూర్ణ సంస్థగా ఎదగాల్సి ఉంది.

-ఈ-తెలుగు వెనక రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే రాజకీయ పార్టీల ఎజెండాలో ఈతెలుగును చేర్చాలనే ప్రచారం ఎందుకు జరుగుతోంది?

రాజకీయ ప్రయోజనాలేమీ లేవు. రాజకీయ పార్టీల ఎజెండాలో చేర్చాలన్నది తెలుగునా? లేక e-తెలుగునా?

వీటన్నింటి కన్నా ముఖ్యంగా..సైబర్‌ ప్రపంచంతో తెలుగు నిటిజన్లను అనుసంధానించటానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా?

బ్లాగులనేవి అలాంటి ఓ ప్రయత్నమే కదా. తెలుగు రత్న, తెలుగు వల లాంటి సాంఘిక సైట్లు ఉన్నాయి కదా.

ఉదాహరణకు ఇటీవల ఐసీఏఎన్‌ఎన్‌ డొమైన్‌ నేమ్స్‌ ఎక్స్‌టెన్షన్‌ కోసం ఒక ప్రకటన ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి ఉన్నవారు తమ ప్రపోజల్స్‌ పంపుకోవచ్చని ప్రకటించింది. అసలు దీని గురించి ఘనత వహించిన ఈ-తెలుగు సభ్యులకు తెలుసా?

నాకైతే తెలియదు. ఘనత వహించిన అన్నది పై ప్రశ్న సంధించిన వారి ఊహ కావచ్చు.

డాట్‌ కామ్‌, డాట్‌ ఆర్గ్‌ల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌, తెలుగుకు సంబంధించిన వెబ్‌ సైట్లకు డాట్‌ టెల్‌ అనే సఫిక్స్‌ కావాలని మనం డిమాండ్‌ చేయచ్చు కదా.. ఈ దశగా ప్రయత్నాలు చేయచ్చు కదా.. ?

కదా. తెలుగు వార్తా పత్రికల సైట్లని యూనికోడులో పెట్టమని పోరవచ్చు, తెలుగు సంఘాల సైట్లని తెలుగులో తయారుచేయమని చెప్పవచ్చు. అడోబ్ పరికరాలని తెలుగుకి తోడ్పాటుతో విడుదల చేయమని అడగవచ్చు. అనూ వారిని వారి ఫాంట్లని యూనికోడులోనికి మార్చమని అడగవచ్చు, ఫైళ్ళను ప్రైవేటు ఎన్‌కోడింగుల నుండి యూనికోడుకి మార్చేలా పరికరాలు రూపొందించవచ్చు, వివిధ తెలుగీకరణ ప్రయత్నాలలో పాలుపంచుకోవచ్చు, తెలుగు వికీపీడియా మరియు దాని సోదర ప్రాజెక్టులలో పనిచేయవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సైట్లన్నీ తెలుగులో కూడా అందుబాటులో ఉండాలని ఉద్యమించవచ్చు.

ఇంకా చాలా చేయవచ్చు. మనకి చాలా మంది పనిచేసే వాళ్లు కావాలి.

5 thoughts on “e-తెలుగు ప్రశ్నలు & జవాబులు

  1. :)…:)…తెల్లావారకముందే ఎంకమ లేసిందీ, ముసుగు ఈరులందరినీ తట్టీ లేపిందీ…అసలు పని దగ్గరకొచ్చేటప్పటికి సూరీడు కళ్లలో కనపడి ముసుగు తీసి లగెత్తటమే…మాటలకేం చాలా వస్తాయి, ప్రశ్నలకేం చాలా ఉంటాయి…కాళ్ళెత్తి పీఠం మీద పెట్టినప్పుడు గందా, ఎంత ఎత్తులో ఉండిద్దో తెలిసేది…

  2. తెలుగువల ని వీవెన్ ప్రస్థావించారు కాబట్టి కొన్ని వివరాలు అందిస్తున్నాను. ఆ సమూహం పేరు ‘లోగిలి’. లంకె teluguvala.ning.com దానిని యోగి గారు తయారుచేసి నిర్వ్హహణ (నేను కోరగా) నాకు ఇచ్చారు. వేరే సమూహం మీద శ్రద్ధ పెట్టాల్సిన కారణంగా మళ్ళీ పగ్గాలు తీసుకోమని యోగి గారిని కోరాను. ఒకటి రెండు రోజుల్లో వారు ప్రధాన నిర్వాహకులు అవుతారు. (అందులోని నా టపాలు ఏమయినా వారికి అభ్యంతరమేమో అడిగి తీసివేస్తాను). సహ నిర్వాహకులు యోగి గారు మరియు భవాని గారులు. ప్రస్తుతం భవాని గారు చురుకుగా నిర్వహిస్తున్నారు. నాకేమో ఈ మధ్య ఈ వ్యాఖ్యల పిచ్చి పట్టి కాస్త తీరిక లేకుండా అయ్యింది. శరత్తూ, సైడుకి వుండి సూస్తుండమ్మా – నా బుజ్జి కదా అని ఎవరయినా చెప్పేంతవరకు తగ్గేట్టుగా లేదు :))

    తెలుగువారి లోగిలికి అందరికీ ఆహ్వానం.

    ఇంకొక చక్కని సాంఘిక సైటు వుంది – ప్రక్షాళన. http://prakshalana.ning.com నరసింహారావు గారు దాని నిర్వాహకులు.

  3. వీవెన్ గారూ ! ఈ రెండో వ్యాఖ్యని ఉంచి మొదటిదాన్ని తీసివేయగలరని ప్రార్థన.

    “హిందీ, ఇంగ్లిష్‌, అరబిక్‌ వంటి భాషల సాపత్యం వల్ల కొత్త పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. చేరుతున్నాయి. ఈ భాషలను మనం కలుపుకొని వాటి ద్వారా వచ్చిన బలాన్ని మనం చేజిక్కించుకుంటే వచ్చిన తప్పేమిటి? ప్రతి పదాన్ని తెలుగులోనే పలకాలనే భావన ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఈ మాత్రం సహేతుకం?”

    వినడానికి చాలా బావుంది. తెలుగుని ఇంగ్లీషులాంటి వలసవాద భాషగా, ఆధిపత్య భాషగా ఊహించుకుంటే ఈ విశాలభావాలు చాలా బావుంటాయి. ఇదొక అణగదొక్కబడిన భాష అనీ, పదాల్ని చంపడం ద్వారా ఉద్దేశపూర్వకంగా చంపబడుతున్న భాష అనీ గుర్తిస్తే ఈ భావాలు చప్పున చల్లారతాయి. ఈ పైపై విశాలభావాల వెనుక వాస్తవంలో జఱుగుతున్నది వేఱు. వాస్తవంలో మన జనం ఏం చేస్తున్నారంటే – తెలుగులో దేనికీ పదాలు లేవని ఎగతాళి చెయ్యడం. తెలుక్కి సంబంధించి మనకంతా సర్వసన్నద్ధంగా (మనం పుట్టకముందే) జఱిగిపోయుండాలి. అలా జఱక్కపోతే తెలుగు పనికిమాలిన భాష. మనం మాత్రం మన వంతుగా తెలుకి ఏమీ చెయ్యం. కనీసం మన పక్కింట్లో కిరాయికొచ్చిన పరాయి రాష్ట్రవాసులకి నాలుగు తెలుగు పదాల్ని నేర్పే “రిస్కు” కూడా మనం తీసుకోం. మన కన్నకూతుఱికీ/ కొడుక్కీ తెలుగు అక్షరాలు దిద్దబెట్టడం కూడా మనకి చాలా భారం. .కానీ తెలుక్కి ఈ సేవలు ఎవరైనా చెయ్యబోతే ఇలా లేవిడీ పట్టించడం. మొదట్నుంచి అదొక్కటే మనకి బాగా చేతనైన విద్య.

    ఎల్లప్పుడూ హిందీ, అరబిక్, ఇంగ్లీషు భాషల వల్లనే మనం ప్రభావితులమౌతున్నాం. కానీ మనవల్ల మాత్రం ఎవరూ ఎందుకు ప్రభావితులు కావడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా మనవాళ్ళు ? ఎల్లపొద్దులూ పదాల దగ్గర్నుంచి ప్రతి విషయంలోను ఇతరుల్ని కాపీ కొట్టడమే పరమార్థంగా గల మనలాంటి కాపీరాయుళ్ళు ఏ జాతికీ ఆదర్శం కాదు. అదీగాక ప్రభావితం చెయ్యాలనే సంకల్పశక్తి మనకి లేకపోవడం ఒక కారణం. ఆ సంకల్పశక్తి, ఆ Linguistic aggressiveness ఉన్న జాతులు తప్పకుండా ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలుగుతాయి. మన తెలుగువాడు చంద్రమండలానికి వెళ్ళినా అక్కడ “మేరా భారత్ మహాన్” అని రాస్తాడు తప్ప “పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయడు.

    ఈ కొఱగాని విశాలభావాలు తెలుగువాళ్ళని మొదట్నుంచి నాశనం చేస్తూనే వచ్చాయి తప్ప ఎప్పుడూ బాగుచేసిన పాపాన పోలేదు. నేనయితే “మనకే విశాలభావాలూ వద్దు, అవి మీ శత్రువులు, భాష విషయంలో వీలయినంత సంకుచితంగానే ఉండండి, ఆ సంకుచితత్వాన్నే మీ జాతి లక్షణంగా మార్చుకోండి” అని చెబుతాను.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.