మరో బ్లాగు తుఫాను సూచన?

 1. ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?
 2. తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి
 3. ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్
 4. ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య
 5. [పాత బంగారం] వార్తల్లో విప్లవం – ఇందిరమ్మ టీవీ

ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు:

 • ఇందిరాబాద్
 • రాహుల్‌గూడ
 • ప్రియాంక నగర్
 • రాజీవ్ పేట

రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా నానికి కీడుచేసే యంత్రాంగం

ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని.

బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు.

ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు?

మీరేమంటారు?

(ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)

తెలుగుపదం

తెలుగుపదం ముఖ్యంగా రెండు లక్ష్యాలతో ఏర్పడింది:

 • చాన్నాళ్ళుగా మందగించిన కొత్త తెలుగు పదాలు తయారీని వేగవంతం చేయడం, ప్రోత్సహించడం, అందుకుకావాల్సిన సాముదాయిక వాతావరణాన్ని కల్పించడం.
 • పలు చోట్ల (బ్లాగుల్లో, గుంపుల్లో, ఇతర చోట్ల) తయారౌతున్న తెలుగు పదాలను ఒకేచోట (వెతుకుకొనగలిగే సౌలభ్యంతో) క్రోడీకరించడం.

ఈ లక్ష్యాలకు సాధనాలుగా తెలుగుపదం వికీ సైటు మరియు తెలుగుపదం గుంపులను స్థాపించాం.

మీరెలా తోడ్పడవచ్చు?

 1. మీ బ్లాగులో, ఇతర రచనలలో తెలుగు పదాలు వాడుతుండండి. మీనుండి మేం ఆశించే పెద్ద సహాయం ఇదే.
  కొత్త తెలుగు పదాలు వాడడానికి మీరు సందిగ్థంలో ఉండవచ్చు, మీ చదువరులకు ఈ కొత్త తెలుగు పదాలు అర్ధమౌతాయా అని. కానీ ధైర్యం చేసి తెలుగుపదాలు వాడండి. చాలావరకు సందర్భమే ఆ తెలుగుపదమేంటో తెలియజేస్తుంది. ఇక్కడ సందర్భం అంటే context అని మీకు తెలిసిపోయిందిగా అలా. ఆ రిస్కుకూడా తీసుకోకూడదు అనిపిస్తే ఆంగ్ల సమానార్థకాన్ని కూడా బ్రాకెట్లలో ఇవ్వండి. ఉ.దా. మీ వెబ్ విహరిణి (web browser) ని తెరవండి.
 2. మీక్కావలసిన పదాలు తెలుగుపదం సైటులో లేకపోతే, తెలుగుపదం గుంపులో అడగవచ్చు. మీకు తప్పక ఓ తెలుగుపదం దొరుకుతుంది.
 3. కొత్త పదాలను మీరు ప్రతిపాదించవచ్చు కూడా. ఇతరుల ప్రతిపాదనలకు మీ ప్రత్యామ్నాయాలూ సూచించవచ్చు. తెలుగుపదాల తయారీకి మీక్కావలిసిన మార్గదర్శకాలు రూపొందుతున్నాయి మరియు సమాచార వనరులు కూడా సేకరిస్తున్నాం
 4. గుంపులో జరిగే చర్చల్లో చాలా కొత్త పదాలు జాలువారుతుంటాయి. వీటిని తెలుగుపదం వికీలో చేర్చండంలో తోడ్పడడం ద్వారా మంచి పదసంపద తయారీలో మీ వంతు కృషిచేసినవారుఅవుతారు.
 5. మీకు తెలిసిన పండితులను (వివిధ రంగాలకు చెంది వారిని, తెలుగుపై ఆసక్తి ఉన్న వారిని) తెలుగుపదానికి సాయపడమని ప్రోత్సహించండి.
 6. మీ వెబ్ సైటు లేదా బ్లాగులో తెలుగుపదం బొత్తాలు పెట్టుకోండి.
  మామూలు బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/6/6f/Button88x31.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

  చిన్ని బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/3/36/Button80x15.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

అంతర్జాలంలో తెలుగుని వాడి మీరిప్పుడు చేస్తున్న తోడ్పాటు భవిష్యత్తులో బయటి ప్రపంచంలోని తెలుగు స్థాయిని కూడా పెంచేంతగా ప్రభావంచూపిస్తుంది.

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు తెలుగులా కనిపిస్తుంది. ఇకనుండి నా Unjustify! అవసరముండదు. మీకోసం కొన్ని తెరచాపలు (screenshots): చదవడం కొనసాగించండి

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి.

మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి.

మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది అవసరం.

ఇన్‌స్క్రిప్ట్‌ని ఇంగ్లీషు లేఔట్‌తో ముడి పెట్టడమనేది ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునేవారు చేసే మొదటి పొరపాటు మరియు వదులుకోవాల్సిన మొదటి అలవాటు. “ర” రాయాలంటే j అక్షరం టైపుచేయాలి అని గుర్తుంచుకోకూడదు. కుడిచేతి చూపుడువేలును వొత్తాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి నియమం. ఉన్న నియమం కూడా ఇదొక్కటే! పెద్దలమాట చద్దిమూట. మరొక్కసారి నా మాటల్లో:

Rule 1: Don’t try to remember keys; remember their positions.

మీరు ఇన్‌స్క్రిప్ట్‌లో టైపు చేస్తున్నప్పుడు మీ మదిలో తెలుగు అక్షరాల లేఔట్ ఉండాలి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నప్పుడు ఇంగ్లీషు అక్షరాల లేఔట్ ఉండాలి. అప్పుడు మీరు టైపింగులో మంచి వేగం సాధించగలుగుతారు. ఇంగ్లీషు లేఔట్‌తో తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంగ్లీషు మరియు తెలుగు టైపింగుల వేగం ప్రతికూలంగా ప్రభావితమౌతుంది. మీరు టైపుచేస్తున్నప్పుడు రెండు లేఔట్లు (మీ మదిలో) కలగలిసిపోయి ఒకదానిబదులు ఇంకొకటి టైపుచేసి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది (మొదట్లో నాకు పట్టింది).

ఇన్‌స్క్రిప్ట్‌లో ఫలానా అక్షరం ఎలా టైపుచెయ్యాలి అని ఎవరైనా నన్ను అడిగితే, నేను మొదట ఆ కీ స్థానం గుర్తుతెచ్చుకుని, ఆ స్థానంలో ఇంగ్లీషుకి ఏ కీ ఉంటుందో చెప్తా. అవును, పై నియమం నేను అనుసరించిన తర్వాతే చెప్తున్నా.

ఒక్కసారి కీల స్థానాలమీద పట్టు సాధించాకా, వేగంగా టైపు చేయడమనేది ఇన్‌స్క్రిప్ట్‌ లోఔట్‌తో చాలా సులభమౌతుంది.

నాకైతే ఇన్‌స్క్రిప్ట్‌ లేఔట్‌తో తక్కువ నొక్కులతో టైపుచేయగల్గుతున్నాననిపిస్తుంది. ఇంకా తర్వాత టైపు చెయ్యాల్సిన కీ వేలి క్రిందే ఉన్నట్టు అనిపిస్తుంది. (సరే చాలా అతిగా చెప్పేసాననుకోండి.)

ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం.

ఎలా: వెబ్‌సైట్లకి మన భాషాభీష్టాన్ని తెలపడం

మనమేదైనా వెబ్‌సైటుని మనం సందర్శించాలనుకున్నప్పుడు, ఆ వెబ్‌సైటు చిరునామాని మన విహరిణి (web browser) లో టైపు చేస్తాం. మన విహరిణి మనతరపున వెబ్‌సైటుకి అభ్యర్థన (request) పంపిస్తుంది. ఈ అభ్యర్థనలో భాగంగా మన భాషా ప్రాధాన్యతలు కూడా పంపిస్తుంది. ఉదాహరణకి:

request-headers-default

నేను గుర్తించిన అంశాలను గమనించండి. భాష ఇంగ్లీషుగా ఎన్నుకోబడి, charset లో utf-8 (యూనికోడ్) రెండవ ప్రాధాన్యతలో ఉంది. ఇది మంటనక్కలో డీఫాల్టు అమరిక.

మనమేదైనా షాపులోకి వెళ్ళి పెన్ను అడిగితే, వాడు బ్లూ పెన్నే ఇస్తాడు. మనకి రెడ్డింకు పెన్ను కావలిస్తే రెడ్డింకు అని అడగాలి. లేకపోతే, సాధారణంగా అందరూ వాడేదే ఇస్తాడు. అలాగే, వెబ్ విహరుణులు కూడా అందరికీ సరిపడా అమరికతో వస్తాయి. మనకేదైనా ప్రత్యేకంగా కావలిస్తే, ఆ అమరికను మార్చుకోవాలి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏం కావాలి, అవి మనకెలా ఉపయోగపడతాయి?

 1. భాషాప్రాధాన్యతలలో తెలుగుకి ప్రథమ ప్రాధాన్యత: మనమడిగిన వెబ్ పేజీ కనుక తెలుగులో ఉండిఉంటే వెబ్ సర్వర్ మనకి తెలుగు వెర్షన్ ని పంపిస్తుంది. ప్రస్తుతం కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే ఈ భాషాప్రాధాన్యతలని గౌరవిస్తున్నాయి. అంతర్జాతీయీకరణ మరియు స్థానికీకరణలు పెరిగేకొలదీ వినియోగదార్ల భాషాప్రాధాన్యతలకి ప్రాముఖ్యం పెరుగుతుంది. తెలుగు పేజీలకోసం ప్రజలు చూస్తున్నారు అని వెబ్‌సైట్ల యజమాలకు తెలుస్తుంది. తెలుగులో కూడా వారివారి వెబ్‌సైట్లను అందించాలాని వారికిది ఒక సూచనలా పనిచేస్తుంది. ఉదాహరణకి, కూడలికి వచ్చే సందర్శకుల భాషాప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి. తెలుగు మూడవ స్థానంలో ఉంది. కూడలి సందర్శకుల భాషా ప్రాధాన్యతలు
 2. charset లలో యూనికోడ్‌కి ప్రథమ ప్రాధాన్యత: దీనివల్ల మీరు వెబ్‌లో తెలుగు చూడడానికి అడ్డంకులు తగ్గుతాయి. మీరు పంపించే సందేశాలు సరైన ఎన్‌కోడింగుతో వెళ్ళే అవకాశం ఉంది.

ఫైర్‌ఫాక్స్‌లో ఈ ప్రత్యేక అమరికని ఎలా కూర్చుకోవాలి?

 1. Tools > Options > Advanced > General > (Under Languages) Choose…
  Firefox Advanced Options
 2. తర్వాత జారుడు జాబితా నుండి తెలుగుని చేర్చండి.
  Choosing Languages in Firefox
 3. తెలుగుని జాబాతాలో పైకి తీసుకురావడానికి Move Up బటన్ని వాడండి.
 4. నా అమరిక ఇదీ:
  My Preferred Languages in Firefox
 5. Tools > Options > Content > (Under Fonts & Colours) Advanced…
  Firefox Content Preferences
 6. ఇక్కడ వర్ణ సంకేతలిపి (Character Encoding) UTF-8 ఉండేలా చూసుకోండి.
  Choosing Character Encoding in Firefox

IEలో అయితే Tools > Internet Options > General tab > Languages. అక్కడ Add… బటన్ నొక్కి తెలుగుని ఎన్నుకోవచ్చు. ఇతర విహారిణుల కొరకు సూచనలని కూడా చూడండి.

ఇదంతా అమర్చిన తర్వాత, వెబ్‌సైటుకి అభ్యర్థన ఇలా వెళ్తుంది.

Custom Request Headers

ఇంత ప్రక్రియ తర్వాత, మీక్కొంత ఆనందం మరియు ఆశ్చర్యం కలగాలంటే, ఈ సైట్లని దర్శించండి:

ఆ సైట్లు మీకు తెలుగులో కనిపిస్తాయి. (పై తతంగం చేసి ఉండకపోతే, ఇంగ్లీషులోనే కనిపిస్తాయి.)

ఐఐఐటి హైదరాబాదుకి నా సందర్శన

పప్పు నాగరాజు గారు నాకు ఐఐఐటి ప్రొఫెసర్ వాసుదేవ వర్మ గారిని పరిచయం చేసారు. వాసుగారు శోధన మరియు సమాచార వెలికితీతల ప్రయోగశాల (Search and Information Extraction Lab, SIEL) కి నాయకత్వం వహిస్తున్నారు. ఐఐఐటిలో ఇది భాషా సాంకేతికతల పరిశోధనా కేంద్రం (Language Technologies Research Centre, LTRC) లో భాగం. వారి ఆహ్వానంతో లాబ్ సందర్శనకు నేను వెళ్ళా.

SIELలో విద్యార్థులు మరియు పరిశోధకులు (మన తోటి తెలుగుబ్లాగరు సౌమ్య కూడా ఈ విభాగంలోనే) పనిచేస్తున్న ప్రాజెక్టులని చూసా. వీరి ప్రణాళికల్లో బొమ్మల్లో ఉన్న వచనాన్ని శోధించడం (results from scanned images) కూడా ఉంది. ఇది వీలుపడితే, తిరుగేలేదు. ఎందుకంటే చాలా వరకు భారతీయభాషల్లోని సాంఖ్యాసమాచారం (digital content) ఇమేజిల రూపంలో ఉంది. జయధీర్ తిరుమలరావుగారి ప్రాజెక్టు (పోయినసారి e-తెలుగు సంఘ సమావేశ విశేషాల్లో వీరిగురించి చూడండి.) కి దీన్ని అనుసంధానిస్తే పురాతన విషయ సమాచారాన్ని శోధించే వీలు చిక్కుతుంది.

SIEL ప్రాజెక్టులలో కొన్నింటిని మనం వెబ్‌లో ప్రయత్నించవచ్చుకూడా. ఇవన్నీ గొప్ప ప్రాజెక్టులు. కీలకమైన అంశమేంమంటే, వీటిని సాధారణ వాడకానికి అనుగుణంగా తీర్చిదిద్దవలసిఉంది. వీటిని జనబాహుళ్యంలోనికి తీసుకురావడానికి నావంతు సహకారం అందిస్తానని చెప్పాను. ఈ ప్రాజెక్టులలో మీరు ఏయే మార్పులని ఆశిస్తున్నారు? అసలు వీటికి సంబంధంలేకుండా, మీ సమాచార ఆవశ్యకాలేంటి? బ్లాగర్లుగా సమాచార వినియోగంలో మనం ముందుంటాం. వీరినుండి మనమేం ఆశించవచ్చు? మీ ఆలోచనలని ఇక్కడ తెలియజేయండి. వీటిపై వారు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.

నేను పనిచేసిన, చేస్తున్నవాటిగురించి వారికొక ప్రదర్శన (presentation) ఇచ్చా. అంతా మీకుతెలిసిందే, నా సొడబ్బా. కాకపోతే మీరిది చూడలనుకోవడాని ఓ కారణముంది: బహుశా ఇది యూనికోడ్ తెలుగులో తొలి ప్రెజెంటేషన్ కావచ్చు.

నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు

2ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి.

నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు.

మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?

బ్లాగులందు ఫొటో బ్లాగులు వేరయా!

నేటి నుండి కూడలిలో ఫొటో బ్లాగుల కోసం ప్రత్యేక పేజీ. మీకు తెలిసిన ఫొటో బ్లాగులు (తెలుగువారివి మాత్రమే) ఉంటే తెలియజేయండి.

లేఖినికి 1 సంవత్సరం

క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:

లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.

నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.

 1. లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
 2. ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)