తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి.
మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి.
మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది అనవసరం.
ఇన్‌స్క్రిప్ట్‌ని ఇంగ్లీషు లేఔట్‌తో ముడి పెట్టడమనేది ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునేవారు చేసే మొదటి పొరపాటు మరియు వదులుకోవాల్సిన మొదటి అలవాటు. “ర” రాయాలంటే j అక్షరం టైపుచేయాలి అని గుర్తుంచుకోకూడదు. కుడిచేతి చూపుడువేలును వొత్తాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి నియమం. ఉన్న నియమం కూడా ఇదొక్కటే! పెద్దలమాట చద్దిమూట. మరొక్కసారి నా మాటల్లో:
Rule 1: Don’t try to remember keys; remember their positions.
మీరు ఇన్‌స్క్రిప్ట్‌లో టైపు చేస్తున్నప్పుడు మీ మదిలో తెలుగు అక్షరాల లేఔట్ ఉండాలి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నప్పుడు ఇంగ్లీషు అక్షరాల లేఔట్ ఉండాలి. అప్పుడు మీరు టైపింగులో మంచి వేగం సాధించగలుగుతారు. ఇంగ్లీషు లేఔట్‌తో తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంగ్లీషు మరియు తెలుగు టైపింగుల వేగం ప్రతికూలంగా ప్రభావితమౌతుంది. మీరు టైపుచేస్తున్నప్పుడు రెండు లేఔట్లు (మీ మదిలో) కలగలిసిపోయి ఒకదానిబదులు ఇంకొకటి టైపుచేసి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది (మొదట్లో నాకు పట్టింది).
ఇన్‌స్క్రిప్ట్‌లో ఫలానా అక్షరం ఎలా టైపుచెయ్యాలి అని ఎవరైనా నన్ను అడిగితే, నేను మొదట ఆ కీ స్థానం గుర్తుతెచ్చుకుని, ఆ స్థానంలో ఇంగ్లీషుకి ఏ కీ ఉంటుందో చెప్తా. అవును, పై నియమం నేను అనుసరించిన తర్వాతే చెప్తున్నా.
ఒక్కసారి కీల స్థానాలమీద పట్టు సాధించాకా, వేగంగా టైపు చేయడమనేది ఇన్‌స్క్రిప్ట్ లోఔట్‌తో చాలా సులభమౌతుంది.
నాకైతే ఇన్‌స్క్రిప్ట్ లేఔట్‌తో తక్కువ నొక్కులతో టైపుచేయగల్గుతున్నాననిపిస్తుంది. ఇంకా తర్వాత టైపు చెయ్యాల్సిన కీ వేలి క్రిందే ఉన్నట్టు అనిపిస్తుంది. (సరే చాలా అతిగా చెప్పేసాననుకోండి.)
ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం.