ఫ్యూయల్ తెలుగు: పరిచయం

మనం పలు ప్రాజెక్టులకి పలు చోట్ల అనువాదాలు చేస్తున్నాం. అలాంటప్పుడు ఒకే పదానికి ఒక ప్రాజెక్టులో అనువాదాలకీ మరో ప్రాజెక్టులోని అనువాదాలకి పొంతన లేకుండే అవకాశం ఉంది. అలానే, ఒకే ప్రాజెక్టులో వేర్వేరు అనువాదకులు చేసిన అనువాదాలు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకి, user అన్న పదానికి ఓ చోట వాడుకరి అని వాడి ఉండవచ్చు, అదే ప్రాజెక్టులో మరోచోట వియోగదారుడనో మరోటో వాడి ఉండవచ్చు.

మృదుపరికరాల స్థానికీకరణలలో తరచూ వాడే పదాలలో ఇలాంటి అనియతత్వత (inconsistency) రాకుండా నివారించేందుకు ఫ్యూయల్ ప్రాజెక్టు (FUEL, Frequently Used Entries for Localization) మొదలైంది. వీరి జాబితాలో ఇప్పటికే తెలుగు కూడా ఉంది.

తరచూ ఉపయోగించే ఉపకరణాలనుండి తరచూ ఉపయోగించే పదాలను తీసుకుని ఓ జాబితా తయారు చేసారు. ఇవి 578 ఉన్నాయి. వీటిపై అనువాదం, సరిచూత, మరియు సమీక్షలు పూర్తయిన తర్వాత వీటిని వివిధ ఉపకరణాల స్థానికీకరణలో వాడుకోవచ్చు. తెలుగు అనువాదాలని వీరు ప్రస్తుతం వివిధ ఓపెన్ సోర్సు ప్రాజెక్టుల అనువాదాలనుండి తీసుకున్నారు.

ఫ్యూయల్ తెలుగు అనువాదాలు
కొన్ని ఫ్యూయల్ తెలుగు అనువాదాలు

ఈ పదాలు వాటి తెలుగు అనువాదాల పూర్తి జాబితాని మీరు ఫ్యూయల్ తెలుగు సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు.వీటిపై మీ సూచనలు మరియు సలహాలు తెలియజేసి ఈ అనువాదాల నాణ్యతని పెంపొందించడంలో తోడ్పడండి.