ఆంగ్లంలో 12-గంటల ఫార్మాటులో సమయాన్ని చెప్పేప్పుడు మధ్యాహ్నానానికి ముందో తర్వాతో సూచించడానికి a.m. అనీ p.m. అనీ వాడతాం. తెలుగులో అయితే, మాట్లాడేటప్పుడు తడుముకోకుండా ఉదయం/పొద్దున్న/మార్నింగు 8 గంటలకు అనో, రాత్రి/నైటు 8 గంటలకు అనో తెల్లవారు 5 గంటలకు అనో, సాయంకాలం/ఈవెనింగు 5 గంటలకు అనో అంటాం. కానీ కంప్యూటర్లోనో లేదా వేరే డిస్ప్లేలలో సమయాన్ని తక్కువ అక్షరాలతో సూచించాల్సి వచ్చినప్పుడు లేదా సాంకేతికంగా లాంఛనప్రాయంగా వాడాల్సివచ్చినప్పుడు తెలుగులో (ఏయెమ్, పీయెమ్ కాకుండా) ఏ పదాలను వాడవచ్చు, ఇప్పటికే అలా వాడుకలో ఏమైనా ఉన్నాయా అని చర్చించడం ఈ టపా ఉద్దేశం.
Meridiem
ఆంగ్లంలో a.m., p.m. అనేవి ante meridiem (మధ్యాహ్నానానికి ముందు) post meridiem (మధ్యాహ్నానికి తర్వాత) అనే లాటిన్ మాటలకు పొడి మాటలు. ఇదే పద్ధతిని తెలుగుకి కూడా అన్వయించి ‘పూర్వాహ్నం’, ‘అపరాహ్నం’ అనీ తెలుగులో వాడుక ఉం(డే)ది (చూ. బ్రౌణ్యం). వీటిని ఇప్పుడు (పొడి మాటలుగా పూ, అ అనీ) స్థానికీకరణల్లో కొన్ని చోట్ల ఇప్పటికే వాడారు. సాంకేతిక వాడుక కాబట్టి ఈ సంస్కృతాధారిత పదాలను అలానే వాడేయవచ్చు. కానీ విరివిగా వాడేయాలంటే కష్టమే. నేను వీటిని వాడదామనుకుంటే ఎందుకో కాస్త అయిష్టత. వీటికి సెటిలయ్యేముందు, తెలుగు మాటలు ఎమైనా దొరుకుతాయేమో చూద్దామనిపించంది.
పగలు – రాత్రి
amకు పగలు లేదా ఉదయం, pmకు బదులుగా రాత్రి అని కొన్ని చోట్ల స్థానికీకరణల్లో వాడారు. చూడాగానే బానేవుంది అనిపించినా, అర్థరాత్రి ఒంటిగంటను 1:00 పగలు అనీ మధ్యాహ్నం ఒంటిగంటను 1:00 రాత్రి అని సూచించాల్సి రావడమే దీనితో చిక్కు. వీటిని యధాలాపంగా చూచినవాడు రైలో, బస్సో తప్పిపోయాడనుకోండి, ఇత్తడే!
పరిమితులు
మనం వాడుకలో వాడినట్టు పూటలను (తెల్లవారుఝాము, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్థరాత్రి) సాంకేతికంగా వాడేయడానికి లేదు. ఎందుకంటే వాచీలు, కంప్యూటర్లు, ఇతరత్రా మెషిన్లూ రోజుని రెండు భాగాలుగానే సూచిస్తున్నాయి కాబట్టి. రెండు భాగాలే అయినా అవి పగలూ రాత్రీ కాదు. ఒక్కో భాగం లోనూ వెలుగు నీడలు రెండూ ఉన్నాయి. మనం మామూలుగా అనుకునే రోజు యొక్క రెండు భాగాలూ సాంకేతిక విభజనా ఒకటి కాదు.
కొత్త ఆలోచన
ఈ సాంకేతిక విభజన గురించి ఆలోచిస్తున్నప్పుడు — “రోజుని రెండు భాగాలు చేసారు… మధ్యాహ్నానికి ముందూ తర్వాత… పూర్వాహ్న/అపరాహ్నలూ అంతే… ఈ మధ్యాహ్నం గొడవ లేకుండా చేయలేమా!?” అప్పుడు తట్టింది — “రెండు భాగాలు… రెండు సగభాగాలు… అంటే రెండు సగాలు! కానీ ఏ సగం ఏదో గుర్తిండం ఎలా? ఆఁ ఏముంది మొదటిది మొదటి సగం, రెండోది రెండో సగం!! ఓహో… భలే! తొలి సగం, మలి సగం అనుకుంటేనో. ఇంకేం తిరుగే లేదు.” అదీ సంగతి!
ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా… am, pm లకు తెలుగు మాటలుగా “తొలి సగం” (పొడిగా తొలి, తొ), “మలి సగం” (పొడిగా మలి, మ) అన్న మాటలను ప్రదిపాదిస్తున్నానహో!
రేఖాచిత్రం ఇంక్స్కేప్తో తయారీ
ఈ లెక్కన అర్థరాత్రి ఒంటి గంటను ‘1:00 తొలి’ అని మధ్యాహ్నం ఒంటి గంటను ‘1:00 మలి’ అని సూచించవచ్చు.
ఇక మీ వంతు
మీరేమంటారు? మీకు ఇవి నచ్చితే వీటిని వాడటం మొదలుపెట్టండి. తగినంత మంది వీటిని వాడుతూంటే ఇవి వ్యాప్తిలోకి వస్తాయి.
ఇవికూడా చూడండి
- తెలుగుపదం గుంపులో afternoon గురించి జరిగిన చర్చ