తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం).

వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా లోని విషయం నా పరిమిత అవగాహనే, ఎక్కువగా తెలికపరచబడి ఉండొచ్చు, తప్పు కూడా అయివుండొచ్చు.

తెలుగు లిపికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు కాలక్రమేణా తమిళ లిపి సంస్కరణల్లో తీసివేయబడి ఉండొచ్చు. స్థూలంగా పై రెండవ ఇబ్బందికి కారణాలు ఇవీ (తమిళం వైపు నుండి చూస్తే):

  1. పలు శబ్దాలకి ఒకే అక్షరం: తమిళంలో క, గ లను ఒకే అక్షరంతో (க) రాస్తారు. ప, బ లకూ ఒకే అక్షరం (ப).
  2. సున్న లేదు: తమిళ లిపిలో సున్నా లేదు. సున్నా స్థానంలో (ప్రాచీన తెలుగు వలె) తర్వాతి అక్షరపు వర్గంలోని ఞ/ఙ/న్/మ్/ణ్ అక్షరాన్ని వాడతారు? ఉదా॥పణ్‌ట.
  3. మహాప్రాణాలు లేవు: అంటే ఖ,ఘ,భ వంటి అక్షరాలు (ఆ శబ్దాలు కూడా?) లేవు. కానీ ఆంగ్ల ఫ, జ్, ఎక్స్ వంటి శబ్దాలను సూచించడానికి మూడుచుక్కల గుర్తు (ஃ) ఉంది.
  4. సంయుక్తాక్షరాలు లేవు: పొల్లు తర్వాతి అక్షరం ఆటోమెటిగ్గా ముందు అక్షరంతో కలిసిపోదు. ‘మమ్ముట్టి’ రాయాలంటే ‘మమ్‌ముట్‌టి’ అని రాస్తారు.

పై మూడింటినీ కలిపి చూస్తే, ‘రంభ’ని తమిళ లిపిలో రాయాలంటే ‘రమ్‌బా’ అని రాస్తారు. ప,బ లకు ఒకే అక్షరం కాబట్టి మనబోటి వారం ‘రమ్‌పా’ అని చదివినా చదువుతాం.

తెలుగు నేర్చుకునే తమిళుల వైపు నుండి చూస్తే—

  1. గుణింతాలు పర్లేదు, తమిళ లిపి లోనూ ఉన్నాయి కాబట్టి ఆ భావన వారికి తెలుసు.
  2. క, గ ప,బ లకు వేర్వేరు అక్షరాల ఇబ్బందినీ సులువుగానే అధిగమించవచ్చు, శబ్దంలో భేదం ఉందీ, ఆంగ్లంలో స్పెల్లింగులు అలవాటయీ ఉంటాయి కనుక).
  3. సున్న కాస్త ఇబ్బంది
  4. మహాప్రాణాలు మహా ఇబ్బంది
  5. సంయుక్తాక్షరాలు మరీ మరీ ఇబ్బంది

ఈ అంశాలను తెలుగు నేర్చుకునే తమిళులు ఎక్కాల్సిన మెట్లు అనుకోవచ్చేమో. నేర్చుకునే వారు వీటిలో ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. వారికి చదువుకోడానికి, అభ్యసించడానికీ ఇచ్చే మెటీరియల్ వారి స్థాయికి తగ్గట్టు తెలుగు సంక్షిష్టతను తొలగించేసి, వారి స్థాయి పెరిగే కొలదీ పై స్థాయిలను చేరుస్తూ పోయేదిగా ఉంటే బావుంటుంది కదా. అంటే మొదటి స్థాయిలో అచ్చులూ, అల్పప్రాణ హల్లులూ మాత్రం నేర్పించాలి. రెండో స్థాయిలో, వాటికే గుణింతాలు. మూడో స్థాయిలో సున్న (తమిళ లిపిలో సున్న లేదు కాబట్టి దీన్ని గుణింతాల స్థాయిలో కలపలేదు). నాలుగో స్థాయిలో మహాప్రాణాలు, ఇక ఐదో స్థాయిలో సంయుక్తాక్షరాలు నేర్పించాలి.

అయితే తమిళులకు తెలుగు నేర్పించే వారికి వారి పనిని తేలిక చేసే పనిముట్లు ఉన్నాయో లేదో తెలియదు. తమిళనాడులో ఉన్న/ఉండిపోయిన తెలుగు జిల్లాల్లోని తెలుగు వారికి (వారు తమిళాన్నే మొదటి భాషగా బడిలో నేర్చుకుంటారు) తెలుగు నేర్పడానికి స. వెం. రమేశ్ (రమేశ్ గారి గురించి మరింత) గారి ఆధ్వర్యంలో కృషి జరుగుతోంది. వీరితో పనిచేసే ఔత్సాహికులు పాఠాలు తయారుచేసుకోడానికి వీలుగా ఆక్షరాలు కలిసిపోకుండా, సున్నా లేకుండా లేఖినిలో టైపు చేసుకోవడం సాధ్యమవుతుందేమో అని అడిగారు. నేను ఉడత సాయంగా, లేఖిని తెమిళ్ అనే ఉప సైటుని తయారు చేసాను. దీనిలో మీరు లేఖినిలో టైపు చేసిన విధంగానే టైపు చెయ్యవచ్చు, కానీ సంయుక్తాక్షరాలూ, సున్నాలూ రావు.

మీరు తమిళులకి తెలుగు నేర్పేవారయితే, మీకూ ఈ లేఖిని తెమిళ్ పనికొస్తుందేమో చూడండి.

మీరు పరాయి భాషల వారికి తెలుగు నేర్పేవారయితే, మీ ప్రధాన సమస్యలూ సవాళ్ళూ ఏమిటి? కాస్త వీలు చేసుకుని మీ బ్లాగులో వ్రాయండి. మీకు అదే సమస్యలను ఎదుర్కొంటున్నవారు పరిచయమవవచ్చు. పరస్పరం చిట్కాలనూ మెళకువలనూ పంచుకోవచ్చు. మీ సమస్యలను మరెవరైనా సాంకేతిక పనిముట్లతో పరిష్కరించనూవచ్చు.

మీరు తెలుగు తెలిసిన సాఫ్ట్‌వేరు ఇంజనీర్లయితే, మన భాషకు అనేక సాంకేతిక సవాళ్ళు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కృషిచేయండి. ఇరుసు వికీలో కొన్ని ఆలోచనలను చూడవచ్చు.

ఆనంద తెలుగు బోధనం, సాధనం!