ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) లో ఉండే చరిత్రని ఓసారి చూడడం ఉత్తమం.

మీ విహరణ చరిత్ర (browsing history) ని మీరు వాడే వెబ్ విహరిణి గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూసిన సైటు మీ విహరణ చరిత్రలో ఉండేఉంటుంది. ఈ విహరణ చరిత్రని ఫైర్‌ఫాక్స్‌లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం.
చదవడం కొనసాగించండి

ప్రకటనలు

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు తెలుగులా కనిపిస్తుంది. ఇకనుండి నా Unjustify! అవసరముండదు. మీకోసం కొన్ని తెరచాపలు (screenshots): చదవడం కొనసాగించండి

ఫైర్‌ఫాక్స్ కొత్త పొడగింత: థంబ్‌స్ట్రిప్స్

థంబ్‌స్ట్రిప్స్ అనేది మీ వెబ్ విహరణ చరిత్రని సినిమా రీలులా చూపించే ఓ ఫైర్‌ఫాక్స్ పొడగింత.

Thumbstrips

విహరణ చరిత్రని దృష్యరూపంలో (నఖచిత్రాలుగా) చూపిండంలో ఇది కొత్త పద్ధతి. వెనక్కి ముందికి స్క్రోల్ చేస్తుంటే రీలు తిప్పుతునట్టే. వడపోత (filter) కూడా బావుంది: మనక్కావలిన సైట్ల నఖచిత్రాలను మాత్రమే చూపించేలా వడపోసుకోవచ్చు. మన విహరణ చరిత్రని శోధించవచ్చుకూడా.

Searching in Thumbstrips

ఈ పొడగింత ద్వారా మన విహరణ చరిత్రని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. కానీ నేనింకా ప్రయత్నించలేదు.

ఆనంద జాలా జ్వాలనం!

ఫైర్‌ఫాక్స్ ఉపయోగిచడం నేర్చుకోండి!

learnfirefox.cybernetnews.com అనే సైటులో ఫైర్‌ఫాక్స్‌లో వివిధ అంశాలని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త హంగులని ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై సచిత్ర వివరణలతో (వీడియోలు కూడా) ఉన్నాయి. కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది.

ఎలా: వెబ్‌సైట్లకి మన భాషాభీష్టాన్ని తెలపడం

మనమేదైనా వెబ్‌సైటుని మనం సందర్శించాలనుకున్నప్పుడు, ఆ వెబ్‌సైటు చిరునామాని మన విహరిణి (web browser) లో టైపు చేస్తాం. మన విహరిణి మనతరపున వెబ్‌సైటుకి అభ్యర్థన (request) పంపిస్తుంది. ఈ అభ్యర్థనలో భాగంగా మన భాషా ప్రాధాన్యతలు కూడా పంపిస్తుంది. ఉదాహరణకి:

request-headers-default

నేను గుర్తించిన అంశాలను గమనించండి. భాష ఇంగ్లీషుగా ఎన్నుకోబడి, charset లో utf-8 (యూనికోడ్) రెండవ ప్రాధాన్యతలో ఉంది. ఇది మంటనక్కలో డీఫాల్టు అమరిక.

మనమేదైనా షాపులోకి వెళ్ళి పెన్ను అడిగితే, వాడు బ్లూ పెన్నే ఇస్తాడు. మనకి రెడ్డింకు పెన్ను కావలిస్తే రెడ్డింకు అని అడగాలి. లేకపోతే, సాధారణంగా అందరూ వాడేదే ఇస్తాడు. అలాగే, వెబ్ విహరుణులు కూడా అందరికీ సరిపడా అమరికతో వస్తాయి. మనకేదైనా ప్రత్యేకంగా కావలిస్తే, ఆ అమరికను మార్చుకోవాలి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏం కావాలి, అవి మనకెలా ఉపయోగపడతాయి?

 1. భాషాప్రాధాన్యతలలో తెలుగుకి ప్రథమ ప్రాధాన్యత: మనమడిగిన వెబ్ పేజీ కనుక తెలుగులో ఉండిఉంటే వెబ్ సర్వర్ మనకి తెలుగు వెర్షన్ ని పంపిస్తుంది. ప్రస్తుతం కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే ఈ భాషాప్రాధాన్యతలని గౌరవిస్తున్నాయి. అంతర్జాతీయీకరణ మరియు స్థానికీకరణలు పెరిగేకొలదీ వినియోగదార్ల భాషాప్రాధాన్యతలకి ప్రాముఖ్యం పెరుగుతుంది. తెలుగు పేజీలకోసం ప్రజలు చూస్తున్నారు అని వెబ్‌సైట్ల యజమాలకు తెలుస్తుంది. తెలుగులో కూడా వారివారి వెబ్‌సైట్లను అందించాలాని వారికిది ఒక సూచనలా పనిచేస్తుంది. ఉదాహరణకి, కూడలికి వచ్చే సందర్శకుల భాషాప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి. తెలుగు మూడవ స్థానంలో ఉంది. కూడలి సందర్శకుల భాషా ప్రాధాన్యతలు
 2. charset లలో యూనికోడ్‌కి ప్రథమ ప్రాధాన్యత: దీనివల్ల మీరు వెబ్‌లో తెలుగు చూడడానికి అడ్డంకులు తగ్గుతాయి. మీరు పంపించే సందేశాలు సరైన ఎన్‌కోడింగుతో వెళ్ళే అవకాశం ఉంది.

ఫైర్‌ఫాక్స్‌లో ఈ ప్రత్యేక అమరికని ఎలా కూర్చుకోవాలి?

 1. Tools > Options > Advanced > General > (Under Languages) Choose…
  Firefox Advanced Options
 2. తర్వాత జారుడు జాబితా నుండి తెలుగుని చేర్చండి.
  Choosing Languages in Firefox
 3. తెలుగుని జాబాతాలో పైకి తీసుకురావడానికి Move Up బటన్ని వాడండి.
 4. నా అమరిక ఇదీ:
  My Preferred Languages in Firefox
 5. Tools > Options > Content > (Under Fonts & Colours) Advanced…
  Firefox Content Preferences
 6. ఇక్కడ వర్ణ సంకేతలిపి (Character Encoding) UTF-8 ఉండేలా చూసుకోండి.
  Choosing Character Encoding in Firefox

IEలో అయితే Tools > Internet Options > General tab > Languages. అక్కడ Add… బటన్ నొక్కి తెలుగుని ఎన్నుకోవచ్చు. ఇతర విహారిణుల కొరకు సూచనలని కూడా చూడండి.

ఇదంతా అమర్చిన తర్వాత, వెబ్‌సైటుకి అభ్యర్థన ఇలా వెళ్తుంది.

Custom Request Headers

ఇంత ప్రక్రియ తర్వాత, మీక్కొంత ఆనందం మరియు ఆశ్చర్యం కలగాలంటే, ఈ సైట్లని దర్శించండి:

ఆ సైట్లు మీకు తెలుగులో కనిపిస్తాయి. (పై తతంగం చేసి ఉండకపోతే, ఇంగ్లీషులోనే కనిపిస్తాయి.)

నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు

2ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి.

నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు.

మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

గమనిక: ఫైర్‌ఫాక్స్ 3 మరియు ఆపైన వెర్షనులలో ఈ సమస్య లేదు.

మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం.

మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ పేజీని IEతో చూపిస్తుంది. రెండవ పరిష్కారం కొన్నిసార్లు దైవాదీనం కావచ్చు. ఈ రెండూ కాకుండా, ఫైర్‌ఫాక్స్‌తోనే ఆ జస్టిఫై వచనాన్ని సరిచేసుకోగలిగితే బాగుంటుంది కదా.

అందుకే నేనో పిల్ల బుక్‌మార్కుని తయారుచేసా. దాని పేరు… ఆ unjustify. దీన్ని మీ బుక్‌మార్కు బారులో పెట్టుకొని, జస్టిఫై వచనమున్న తెలుగుపేజీ ఎదురైనప్పుడు దీనిమీద ఓ నొక్కు నొక్కితే చాలు. ఆ పేజీలోని వచనం మీరు చదివేందుకు వీలుగా మారుతుంది.

ఎలా వాడాలి?

 1. ఈ పేజీలోని unjustify లంకెని బుక్‌మార్కు బారు లో చేర్చుకోండి.unjustify
 2. జస్టిఫై చేసిన వచనమున్న ఒక వెబ్‌సైటుకి వెళ్ళండి.
 3. ఇందాక చేర్చుకున్న బుక్‌మార్కు మీద ఓ నొక్కు నొక్కండి.
 4. జుస్టిఫైడ్ వచనం సరి అవుతుంది.

ఇక మీరు ఫైర్‌ఫాక్స్ సౌఖ్యంతోనే తెలుగు పేజీలని చదవవచ్చు.  ఏమైనా ఇబ్బందులుంటే తెలుగుబ్లాగు సమూహానికి రాయండి. నేను బదులిస్తా.

(అన్నట్టు మీరోటి గమనించారా, కూడలిలో ఈ సమస్య రాకుండా నేను సరిచేసా.)

తాజాకరణ 2007-02-19: ఇప్పుడు WordPress.com బ్లాగులలో కూడా పనిచేస్తుంది. (మీ వర్డుప్రెస్ బ్లాగు థీమ్ justifed text లేదా/మరియు letter-spacing ని వాడుతుంటే ఫైర్‌ఫాక్స్ ని ఉపయోగించే మీ బ్లాగు సందర్శకులకి Unjustify ని వాడమని సూచించండి.)

ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

Firefox with Locationbar2 Extension

పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా?

 • http:// అన్నది లేదు.
 • డొమైను పేరు బొద్దుగా ఉంది.
 • వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా.

 1. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి మామూలుగా వచ్చే నష్టమేమీలేదు. కానీ కొన్ని ప్రత్యేక అవసరాలకి (ఉ.దా. పేజీ URL ని కాపీ చేసుకునేప్పుడు) ఖచ్చితమైన వెబ్ చిరునామా కావాల్సిరావచ్చు. లొకేషన్ బార్2 పొడగింత http లేదా https ని చూపించదు. కానీ చిరునామా పట్టీ లో కర్సర్ ఉన్నప్పుడు లేదా చిరునామా పట్టీ పైకి మూషికాన్ని తీసుకెళ్ళినా పూర్తి చిరునామాని చూపిస్తుంది. అంటే సరిగ్గా మనకవసరమైనప్పుడే!
 2. బొద్దు డొమైను పేరు: డొమైను పేరుని ఇలా ప్రత్యేకంగా చూపించడం నకిలీ వెబ్ సైట్లని గుర్తించడంలో మనకి తోడ్పడుతుంది. మన లాగిన్ వివరాలు సరైన వెబ్ సైట్లోనే ఇస్తున్నామో లేదో ఓసారి సరిచూసుకోవచ్చు.
 3. వెబ్ చిరునామాలో తెలుగు అక్షరాలు: వెబ్ చిరునామాలో “%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81” కంటే “తెలుగు” అని చూడడం బాగుంటుందికదా. తెవికీ లేదా తెలుగు బ్లాగుల్లో విహరించేటప్పుడు ఉపయోగపడుతుంది.

ఇంకెందుకాలస్యం, లొకేషన్ బార్2 పొడగింతని తెచ్చుకోండి మరి.

సూక్ష్మసంగ్రహాలు: ఒక పరిచయం

సూక్ష్మసంగ్రహం (microsummary) అంటే ఏదైనా ఒక వెబ్‌పేజీ నుండి సంగ్రహించిన ఒక చిన్న సమాచార విశేషం. ఉదాహరణకి మీకు నచ్చిన బ్లాగులో కొత్త టపా, లేదా మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ షేరు యొక్క మార్కెట్ ధర, ఇలా ఏదైనా కావచ్చు.

ఉపయోగశీలత
తరచుగా తాజాకరించబడే ఈ చిన్న సమాచారంకోసం ప్రతీసారీ మీరు పూర్తి వెబ్‌పేజీని దర్శించనవసరంలేకుండా, మీ విహరిణి (web browser) ఈ సమాచారాన్ని సంగ్రహించిపెడుతుంది. ఉదాహరణకి, ఫైర్‌ఫాక్స్ 2 ఈ సూక్ష్మసంగ్రహాలని మన బుక్‌మార్కు యొక్క శీర్షికగా తరచూ తాజాకరించి చూపిస్తూంటుంది. వీటినే తాజా శీర్షికలు (live titles) అంటారు. మనక్కావాల్సిన సమాచారంకోసం బుక్‌మార్కుల పట్టీవైపోసారి చూస్తే సరిపోతుంది.

ఆవశ్యకాలు

 1. సూక్ష్మసంగ్రహాలకి తోడ్పాటుతో నిర్మించబడిన విహరిణి. ప్రస్తుతమున్న వెబ్ విహరిణులలో, ఫైర్‌ఫాక్స్ 2 మాత్రమే ఈ సూక్ష్మసంగ్రహాల తోడ్పాటుతో లభిస్తుంది.
 2. మీక్కావలసిన సమాచారాన్ని వెబ్‌పేజీ నుండి తీసుకొచ్చే యంత్రం (microsummary generator). ఈ యంత్రాన్ని మూడు విధాలుగా సమకూర్చుకోవచ్చు.

నాక్కావల్సిన వెబ్‌సైట్ ఈ సూక్ష్మసంగ్రహ సహితమో కాదో తెలుసుకోవడం ఎలా?
ఒక వెబ్‌సైట్ తన పేజీలకి సంబంధించిన సూక్ష్మసంగ్రహ యంత్రాన్ని తనే అందిస్తే, ఆ వెబ్‌సైట్ సూక్ష్మసంగ్రహ సహితం అవుతుంది. (ఉదాహరణకి, కూడలి ఇప్పుడు సూక్ష్మసంగ్రహ సహితం. కూడలిలోని సరికొత్త టపా యొక్క శీర్షికని సూక్ష్మసంగ్రహంగా అందించే యంత్రాన్ని కూడలే అందిస్తుంది.) ఈ సూక్ష్మసంగ్రహాలనేవి ఇంకా కొత్త భావన కాబట్టి, ప్రస్తుతం వీటిని అందించే సైట్లు తక్కువే. సాధారణంగా అయితే వీటిని అందించే సైట్లోనే సూచిస్తారు (RSS ఫీడ్‌ని సూచించినట్టు). ఒకవేళ అలా సూచించకపోయినా, ఒక సైట్‌ని దర్శించినప్పుడు ఆ సైట్ సూక్ష్మసంగ్రహ సహితమో కాదో మన విహరిణి మనకు తెలుపుతుంది. ఉదాహరణకి, ఫైర్‌ఫాక్స్ 2లో మనమేదైనా వెబ్‌పేజీని బుక్‌మార్కు చేస్తున్నప్పుడు, ఆ బుక్‌మార్కు పేరుగా ఎంచుకోవడానికి వెబ్‌పేజీ శీర్షిక మరియు సూక్ష్మసంగ్రహాల ద్వారా రాబట్టిన తాజా శీర్షికలు ఒక జాబితాలో కనిపిస్తాయి. వీటిలో ఒక దానిని ఎన్నుకోవచ్చు. ఒకవేళ ఆ పేజీ సూక్ష్మసంగ్రహ సహితం కాకపోతే, బుక్‌మార్కు పేరుగా వెబ్‌పేజి శీర్షికే కనిపిస్తుంది. ఎన్నుకోవడానికి జాబితా కనిపించదు.

Live Titles in Firefox
నేనే సూక్ష్మసంగ్రహ యంత్రాలని తయారుచేసుకోవాలంటే?
మీకు XML, XSL మరియు, XPath తెలిసి ఉండాలి. మరిన్ని వివరాలకు ఈ మొజిల్లా డెవలపర్ పేజీ చూడండి. మీకంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే, సూక్ష్మసంగ్రహ యంత్రకారిణి (ఫైర్‌ఫాక్స్ పొడగింత) మీకు ఉపయోగపడుతుంది.

Update to Unjustify

In addition to the justified Telugu text, Firefox also has problems with  letter-spaced Telugu text.  My unjustify bookmarklet is not working on certain sites (especially wordpress blogs), where letter-spaced text is common. So I changed the bookmarklet slightly that now it works on those sites also.

If you are using the earlier bookmarklet, you should delete it re-bookmark it from here.

Well, you try it on this site (before it is changed). Or, you can try it on this test page.