15 వసంతాల లేఖిని

15 వసంతాల లేఖిని పోస్టర్

15 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు లేఖినిని తెలుగు బ్లాగులోకానికి పరిచయం చేసాను! తాత్కాలిక పరిష్కారం అనుకున్న చిన్న పనిముట్టు ఇన్నేళ్ళు కొనసాగడం నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే.

లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.

— లేఖిని విడుదలైన 5 నెలలకి నా స్పందన లేఖిని పుట్టుక, పెరుగుదల

ఇన్నేళ్ళూ లేఖినిని ఆదరిస్తూన్న తెలుగువారందరికీ నా కృతజ్ఞతలు!!

లేఖినికి కొన్ని మెరుగులు

కరోనా కట్టడి కాలంలో లేఖినికి కొన్ని చిన్న మెరుగులు:

 • ఇప్పుడు కంప్యూటర్లకు వెడల్పాటి తెరలు ఉంటున్నాయి. లేఖిని సహాయపు పట్టికని దాచేసి వాడుకునేవారికి, ఈ మూల నుండి ఆ మూల వరకూ పెట్టె ఉంటుంది. అంత పొడవుగా ఉన్నదాన్ని చదవడమూ ఇబ్బందే. మీ కంప్యూటర్ తెర మరీ వెడల్పాటిది అయితే గనక టెపు చేసే పెట్టె, తెలుగు పాఠ్యం వచ్చే పెట్టె రెండూ పక్కపక్కనే ఆటోమెటిగ్గా సర్దుకుంటాయి. తగినంత జాగా లేకపోతే, ఇంతకు మునుపు లానే ఒకదాని కింద ఒకటి కుదురుకుంటాయి.
 • లేఖినిలో మనం ఆంగ్లాక్షరాలలో రాసేది ఇంగ్లీషు కాదు. కానీ సైటు భాష తెలుగు అని సూచించినా కొన్ని విహారిణులు ఇంగ్లీషు స్పెల్‌చెకింగ్ చేస్తున్నాయి. చేతిఫోన్లలో అయితే, కీబోర్డులు వాక్యంలో మొదటి అక్షరాన్ని క్యాపిటలైజ్ చేసేస్తాయి. ఈ రెండూ లేఖిని వాడేవారికి అసౌకర్యంగా ఉండేవే. ఇప్పుడు, ప్రత్యేకించి స్పెల్‌చెక్ చేయవద్దని, ఆటోకరెక్షనూ, ఆటోక్యాపిటలైజ్ వద్దన్న సూచనలను టైపు చేసే పెట్టెకు తగిలించాను. వీటిని వివిధ విహారిణులు గౌరవిస్తే, కొంత సౌఖ్యంగా ఉంటుంది. (సుధీర్ ప్రతిస్పందన మేరకు.)
 • రెండు మూడు లైన్ల తర్వాత తెలుగుకి ‘వెనువెంటనే’ కాకుండా ‘పదానికి ఒకసారి’ మారుతుంది. ఇప్పుడు ఆ పరిమితిని మూడింతలు చేసాను. అంటే పదం పూర్తయ్యేవరకూ ఆగకుండా తెలుగులో ఎలా వస్తుందో చూసుకోవచ్చు. అయితే ఇది తక్కువ శక్తివంతమైన లేదా బాగా పాత కంప్యూటర్లపై లేఖినిని నెమ్మదింపజేయవచ్చు. (సుధీర్ ప్రతిస్పందన మేరకు.)
 • జూలై 13 తాజాకరణ: పై మార్పుల తర్వాత Tab మీట ఇంతకుముందులా పనిచేయడం లేదు. ఇప్పడు సరిచేసాను! ఇప్పుడు, ఎడమవైపు పెట్టెలో టైపు చేసాకా Tab నొక్కితే, ఫోకస్ కుడివైపు పెట్టెలోకి మారుతుంది, అందులో ఉన్న తెలుగు పాఠ్యం మొత్తం ఎంచుకోబడుతుంది. అంతేకాక అది క్లిప్‌బోర్డుకి కూడా కాపీ అవుతుంది. వేరే చోట పేస్టు చేసుకోవడమే. (సమస్యను నివేదించిన జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు!)

ఇవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. వీటిని ప్రయత్నించి చూసి, మీ ప్రతిస్పందనను తెలియజేయండి.

🛈 ఒక వేళ లేఖిని పేజీ చిందరవందరగా కనిపిస్తున్నా, లేదా లేఖిని సరిగా పనిచేయకపోతుంటే, లేఖిని పేజీలో ఉన్నప్పుడు Ctrl + Shift + R అని కొట్టండి.

లేఖిని చిహ్నం

ఆనంద తెలుగు లేఖనం!

లేఖినిలో చిన్న చిన్న మార్పులు

చాన్నాళ్ళకు, లేఖినిలో కొన్ని మార్పులు! చిన్నివేలెండి.

 • మొబైలులో లేఖిని చిన్నమార్పుల్లో పెద్దది లేఖినిని స్మార్టుఫోన్లలో వాడుకునే వారికోసం. ఇప్పుడు లేఖిని చిన్న తెరలపై కూడా ఇమిడిపోతుంది.
 • ఇప్పుడు లేఖినిలో రూపాయి (₹) గుర్తుని కూడా పొందవచ్చు. ఇందుకోసం $$ అని టైపు చెయ్యాలి.
 • గతంలో # తర్వాత టైపు చేసే పాఠ్యం తెలుగులోకి మారేది కాదు. ఇప్పుడు మారుతుంది. అంటే # గుర్తుని ఇక వాడుకోవచ్చు. (ఏదైనా పాఠ్యం తెలుగు లోనికి మారకూడదనుకుంటే దాని చుట్టూ ` (backtick) లను చేర్చండి. Esc కింద మీట.)
 • ఇంతకుముందు @2 అని కొడితే దేవనాగరి అవగ్రహ (ऽ) వచ్చేది. కానీ ఇప్పుడు సరిగ్గా తెలుగు అవగ్రహ (ఽ) వస్తుంది.
 • (మే 29, 2018) ఇప్పుడు లేఖినిని https చిరునామా ద్వారా కూడా చేరుకోవచ్చు: https://lekhini.org.

ఇంతే సంగతులు.

గమనిక: ఈ మార్పులు మీ లేఖినిలో కనిపించకపోయినా, లేదా మీరు లేఖినిలో తెలుగులో వ్రాయలేకపోతున్నా, అందుకు మీ విహారిణిలో (బ్రౌజరులో) ఉన్న ఆఫ్‌లైన్ కాపీ కారణం కావచ్చు. దాన్ని తాజాకరించడానికి, మీ విహారిణిలో లేఖిని పేజీలో Ctrl+Shift+R నొక్కండి.

తాజాకరణ (మే 9): ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాక్‌టిక్ టైపు చెయ్యడం ఇలా: బొమ్మలో ఎర్ర చుక్కలు పెట్టిన మీటలను నొక్కితే చాలు. (ఫోనును బట్టి కీబోర్డులో మార్పులు ఉండవచ్చు.)
backtick_in_android.png

ఆనంద లేఖనం!

తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం).

వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా లోని విషయం నా పరిమిత అవగాహనే, ఎక్కువగా తెలికపరచబడి ఉండొచ్చు, తప్పు కూడా అయివుండొచ్చు.

తెలుగు లిపికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు కాలక్రమేణా తమిళ లిపి సంస్కరణల్లో తీసివేయబడి ఉండొచ్చు. స్థూలంగా పై రెండవ ఇబ్బందికి కారణాలు ఇవీ (తమిళం వైపు నుండి చూస్తే):

 1. పలు శబ్దాలకి ఒకే అక్షరం: తమిళంలో క, గ లను ఒకే అక్షరంతో (க) రాస్తారు. ప, బ లకూ ఒకే అక్షరం (ப).
 2. సున్న లేదు: తమిళ లిపిలో సున్నా లేదు. సున్నా స్థానంలో (ప్రాచీన తెలుగు వలె) తర్వాతి అక్షరపు వర్గంలోని ఞ/ఙ/న్/మ్/ణ్ అక్షరాన్ని వాడతారు? ఉదా॥పణ్‌ట.
 3. మహాప్రాణాలు లేవు: అంటే ఖ,ఘ,భ వంటి అక్షరాలు (ఆ శబ్దాలు కూడా?) లేవు. కానీ ఆంగ్ల ఫ, జ్, ఎక్స్ వంటి శబ్దాలను సూచించడానికి మూడుచుక్కల గుర్తు (ஃ) ఉంది.
 4. సంయుక్తాక్షరాలు లేవు: పొల్లు తర్వాతి అక్షరం ఆటోమెటిగ్గా ముందు అక్షరంతో కలిసిపోదు. ‘మమ్ముట్టి’ రాయాలంటే ‘మమ్‌ముట్‌టి’ అని రాస్తారు.

పై మూడింటినీ కలిపి చూస్తే, ‘రంభ’ని తమిళ లిపిలో రాయాలంటే ‘రమ్‌బా’ అని రాస్తారు. ప,బ లకు ఒకే అక్షరం కాబట్టి మనబోటి వారం ‘రమ్‌పా’ అని చదివినా చదువుతాం.

తెలుగు నేర్చుకునే తమిళుల వైపు నుండి చూస్తే—

 1. గుణింతాలు పర్లేదు, తమిళ లిపి లోనూ ఉన్నాయి కాబట్టి ఆ భావన వారికి తెలుసు.
 2. క, గ ప,బ లకు వేర్వేరు అక్షరాల ఇబ్బందినీ సులువుగానే అధిగమించవచ్చు, శబ్దంలో భేదం ఉందీ, ఆంగ్లంలో స్పెల్లింగులు అలవాటయీ ఉంటాయి కనుక).
 3. సున్న కాస్త ఇబ్బంది
 4. మహాప్రాణాలు మహా ఇబ్బంది
 5. సంయుక్తాక్షరాలు మరీ మరీ ఇబ్బంది

ఈ అంశాలను తెలుగు నేర్చుకునే తమిళులు ఎక్కాల్సిన మెట్లు అనుకోవచ్చేమో. నేర్చుకునే వారు వీటిలో ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. వారికి చదువుకోడానికి, అభ్యసించడానికీ ఇచ్చే మెటీరియల్ వారి స్థాయికి తగ్గట్టు తెలుగు సంక్షిష్టతను తొలగించేసి, వారి స్థాయి పెరిగే కొలదీ పై స్థాయిలను చేరుస్తూ పోయేదిగా ఉంటే బావుంటుంది కదా. అంటే మొదటి స్థాయిలో అచ్చులూ, అల్పప్రాణ హల్లులూ మాత్రం నేర్పించాలి. రెండో స్థాయిలో, వాటికే గుణింతాలు. మూడో స్థాయిలో సున్న (తమిళ లిపిలో సున్న లేదు కాబట్టి దీన్ని గుణింతాల స్థాయిలో కలపలేదు). నాలుగో స్థాయిలో మహాప్రాణాలు, ఇక ఐదో స్థాయిలో సంయుక్తాక్షరాలు నేర్పించాలి.

అయితే తమిళులకు తెలుగు నేర్పించే వారికి వారి పనిని తేలిక చేసే పనిముట్లు ఉన్నాయో లేదో తెలియదు. తమిళనాడులో ఉన్న/ఉండిపోయిన తెలుగు జిల్లాల్లోని తెలుగు వారికి (వారు తమిళాన్నే మొదటి భాషగా బడిలో నేర్చుకుంటారు) తెలుగు నేర్పడానికి స. వెం. రమేశ్ (రమేశ్ గారి గురించి మరింత) గారి ఆధ్వర్యంలో కృషి జరుగుతోంది. వీరితో పనిచేసే ఔత్సాహికులు పాఠాలు తయారుచేసుకోడానికి వీలుగా ఆక్షరాలు కలిసిపోకుండా, సున్నా లేకుండా లేఖినిలో టైపు చేసుకోవడం సాధ్యమవుతుందేమో అని అడిగారు. నేను ఉడత సాయంగా, లేఖిని తెమిళ్ అనే ఉప సైటుని తయారు చేసాను. దీనిలో మీరు లేఖినిలో టైపు చేసిన విధంగానే టైపు చెయ్యవచ్చు, కానీ సంయుక్తాక్షరాలూ, సున్నాలూ రావు.

మీరు తమిళులకి తెలుగు నేర్పేవారయితే, మీకూ ఈ లేఖిని తెమిళ్ పనికొస్తుందేమో చూడండి.

మీరు పరాయి భాషల వారికి తెలుగు నేర్పేవారయితే, మీ ప్రధాన సమస్యలూ సవాళ్ళూ ఏమిటి? కాస్త వీలు చేసుకుని మీ బ్లాగులో వ్రాయండి. మీకు అదే సమస్యలను ఎదుర్కొంటున్నవారు పరిచయమవవచ్చు. పరస్పరం చిట్కాలనూ మెళకువలనూ పంచుకోవచ్చు. మీ సమస్యలను మరెవరైనా సాంకేతిక పనిముట్లతో పరిష్కరించనూవచ్చు.

మీరు తెలుగు తెలిసిన సాఫ్ట్‌వేరు ఇంజనీర్లయితే, మన భాషకు అనేక సాంకేతిక సవాళ్ళు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కృషిచేయండి. ఇరుసు వికీలో కొన్ని ఆలోచనలను చూడవచ్చు.

ఆనంద తెలుగు బోధనం, సాధనం!

ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!

భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)

ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:
ఇన్‌స్క్రిప్ట్+, విస్తృత తెలుగు కీబోర్డు అమరిక

చదవడం కొనసాగించండి

గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని

ఇన్‌స్క్రిప్ట్ లేఖిని తెరపట్టు

ఇప్పుడు లేఖినిలో ఇన్‌స్క్రిప్టుని టైపు చేసుకోవచ్చు మరియు నేర్చుకోవచ్చు: lekhini.org/inscript

ఇన్‌స్క్రిప్ట్ లేఖిని తెరపట్టు

ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.
చదవడం కొనసాగించండి

లేఖిని పనిచేయడం లేదా?

ఈ మధ్య లేఖిని పనిచేయడం లేదన్న పిర్యాదుని తరచూ వింటున్నాను. కానీ నా లినక్స్ కంప్యూటరుపై ఈ సమస్యని నేను చూడలేదు. బహుశా ఇది పాడయిన కోశం వల్ల అయ్యివుండొచ్చు. మీ జాల విహారిణి ఫైర్‌ఫాక్స్ అయితే ఇలా ప్రయత్నించి చూడండి:

 1. Tools మెనూ నుండి Options… అన్న ఆదేశాన్ని ఎంచుకోండి.
 2. ఆ తర్వాత వచ్చే కిటికీలో, (క్రింద తెరపట్టులో చూపినట్టు) Advanced అన్న ప్రతీకాన్నీ తర్వాత Network అన్న ట్యాబునీ ఎంచుకోండి.ఫైర్‌ఫాక్స్ విహారిణి ఉన్నత నెట్‌వర్క్ ఎంపికలు
 3. Offline Storage విభాగంలో (పై తెరపట్టులో గుర్తించి చూపిన చోట) lekhini.org అని ఉంటే, దాన్ని ఎంచుకుని Remove బొత్తాన్ని నొక్కండి.
 4. తొలగింపుని నిర్ధారించండి; OK బొత్తాన్ని నొక్కి అమరికల కిటికీని మూసేయండి.
 5. ఇప్పుడు lekhini.orgకి వెళ్ళి చూడండి.

అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, నాకు తెలియజేయండి.

మీ మిత్రులెవరైనా ఈ సమస్యని మీతో ప్రస్తావించి ఉంటే, వారికి కూడా ఈ టపాని చూపించండి.

ఆనంద లేఖనం!

ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా?

కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది.
చదవడం కొనసాగించండి

ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు

శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.

ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:

లేఖినికి 1 సంవత్సరం

క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:

లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.

నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.

 1. లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
 2. ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)