అమెరికాలో తెలుగు సైన్‌బోర్డుతో రెస్టారెంట్

పెసరట్టు, సన్నీవేల్ నగరంలో రెస్టారెంటుకి తెలుగు పేరు

కాలిఫోర్నియా రాష్ట్రంలో సన్నీవేల్ నగరంలో ఇది కనబడింది. గూగుల్ పటంలో ఖచ్చితమైన స్థానం. పటంలో తాజ్ ఇండియా కుసైన్ ఉన్నచోటనే ఈ పెసరట్టు ఉంది. గూగుల్ పటాల్లో ఇంకా లేదంటే ఈ మధ్యనే పెట్టినట్టున్నారు.

దీనిపై సమీక్షలు, గట్రా.

ప్రకటనలు

మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక

పోయిన నెలాఖరులో సిలికాన్ వ్యాలీలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశపు ప్రారంభ సదస్సు యొక్క నివేదిక ఇది. నివేదికకు వెళ్ళేముందు రెండు ప్రశ్నలకు సమాధానాలు:

  • అమెరికాలో ఎందుకు? సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక రంగానికి ప్రధాన కేంద్రం. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నదీ ఇక్కడే. తెలుగు కోసం లేదా తెలుగు వారి కోసం వీరు చేసింది తక్కువే. వీరి దృష్టిని ఆకర్షించడం అన్నది ఈ సామావేశాన్ని అక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం. ఇక్కడి వదాన్యుల నుండి వివిధ చేపట్లకు నిధుల/విరాళాల సేకరణ మరో కారణం.
  • ‘తెలుగు అంతర్జాల’ అన్న పేరెందుకు? తెలుగు సంగణన గురించి అన్ని విషయాలనూ స్పృషించే ఈ సమావేశానికి పరిమితార్థాన్నిచ్చే అంతర్జాల సమావేశం అన్న పేరు ఎందుకు అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేసారు. ఇదీ ఆలోచన: ఇప్పుడంతా జాలమే. అన్ని రకాల ఉపకరణాలూ (క్లిష్టమైన ఫొటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగులతో సహా) జాల సేవలుగా మారిపోతున్నాయి. వివిధ సేవల భారీతనాన్ని సూచిండానికి ఇప్పుడు ఆంగ్లంలో web-scale అని వ్యవహరిస్తున్నారు. ఎలాగూ పూర్తిస్థాయిలో తెలుగు సంగణన సిద్ధమయితేనే జాలంలో తెలుగు సంపూర్ణమవుతుంది. కనుక అంతర్జాలం అన్నది విస్త్రుతార్థకమే.

ఇక ప్రారంభ సదస్సు నివేదిక.
“మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక” ‌చదవడం కొనసాగించండి

మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (సెప్టెంబర్ 28 – 30)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రసార సాంకేతిక విభాగం మరియు సిలికానాంధ్ర – విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) సంయుక్తంగా నిర్వహించు మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (ITIC 2011) ఈ నెల చివర్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మిల్పీటస్ నగరంలో జరగనుంది. సాంకేతికంగా తెలుగు గురించి అనేక సంస్థలూ వ్యక్తులూ కృషి చేస్తున్నారు. వీరందరినీ ఒక చోట చేర్చి కంప్యూటర్లలోనూ, అంతర్జాలంలోనూ తెలుగు అమలుకి ఉన్న సాధకబాధకాలు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం, వీరి కృషిని సమన్వయ పరిచే అవకాశాలను కనుక్కోవడం మరియు ఈ దిశగా ప్రేరణోత్సాహాలను కల్గించడం ఈ సమావేశ ముఖ్యోద్దేశం.

మీ సహాయం కావాలి
ఈ సమావేశం గురించి మీ స్నేహితులకు తెలియజేయండి. మీరు అమెరికాలో ఉంటే, ఈ సమావేశ నిర్వహణలో ఔత్సాహికులుగా మీ సహాయం అందించవచ్చు. మరిన్ని వివరాలకు iticgift[ఎట్]జీమెయిల్.కామ్ అన్న ఈమెయిలు చిరునామాను సంప్రదించండి.

ఈ సమావేశం విజయవంతం అవ్వాలనీ తద్వారా తెలుగుకి సాంకేతికంగా అన్ని సౌలభ్యాలూ సమకూరాలనీ ఆశిస్తున్నాను.

తాజాకరణ 2011-10-09:

ట్విట్టర్‌లో తెలుగులో వ్రాసేవాళ్ళు తక్కువ!

https://twitter.com/#!/tveeven/status/106020039769071616

మీరు ట్విట్టరులో ఉంటే… అర్థమయ్యిందికదా…

తాజాకరణ:
నా పై ట్వీటుకి బఠాణీలు అందరం కలిసి ట్వీటుదామని ఈ విధంగా స్పందించారు.

https://twitter.com/#!/bataanilu/status/106060015248478208

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29ని మించిన ముహూర్తం ఏముంటుంది.

https://twitter.com/#!/tveeven/status/106213198558015488

కాబట్టి, మీరు ట్విట్టరు ఖాతా ఉంటే, ఆగస్టు 29న తప్పకుండా తెలుగులో ట్వీటండి!

రమణీయ: ఆదిత్య ఫాంట్స్ వారి నుండి ఒక ఉచిత తెలుగు ఖతి

పోయిన వారం జరిగిన 2 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో, అంబరీష్ గారు రమణీయ అనే ఒక ఉచిత యూనికోడ్ తెలుగు ఖతిని ఆవిష్కరించారు.

ఇదీ ఆ ఖతి యొక్క నమూనా:

రమణీయ ఖతి నమూనా

రమణీయ ఖతిని దించుకోడానికి వారి వెబ్ సైటు వీలు కల్పించే వరకూ వేచివుండాలి. లేదా, ఇప్పుడే దీన్ని ఈమెయిలు ద్వారా పొందడానికి వారిని వెబ్ సైటు ద్వారా సంప్రదించండి.

ఇది లోహిత్ తెలుగు ఖతి వలెనే ఉన్నా భిన్నమైనది. వీటి రెంటి మధ్య కొన్ని భేదాలు. ఈ క్రింది ఉదాహరణలలో బూడిద రంగు లోనిది లోహిత్ మరియు ఆలివ్ రంగులోనిది రమణీయ ఖతి.

రమణీయ ఖతిలో తలకట్లు కాస్త పొడవుగా ఉంది, నిలువుగా అంతమవుతుంది. లోహిత్ ఖతిలో తలకట్టు వాలుకి లంబంగా అంతమవుతుంది.

లోహిత్ మరియు రమణీయ ఖతుల మధ్య చిన్న తేడాలు

అలానే లోహిత్ ఖతిలో దీర్ఘవృత్తాలు ఉపయోగిస్తే, రమణీయ ఖతిలో ఖచ్చిత వృత్త రూపాలకు ప్రాధాన్యతను ఇచ్చారు.

లోహిత్ ఖతిలో కు అక్షరానికి కొమ్ము పైనుండి వస్తుంది. రమణీయలో క్రింద నుండి ఉంటుంది.

ఆదిత్య ఫాంట్స్ వారి ఈ రమణీయ ఖతి మరిన్ని తెలుగు యూనికోడ్ ఖతులకు తద్వారా తెలుగు విజృంభణకి ప్రేరణోత్సాహాలను కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

మీడియావికీ మరియు ఇతర ఉపకరణాల స్థానికీకరణ

మీరు తెలుగు వికీపిడీయాకి వెళ్తే, వ్యాసాలు మాత్రమే కాక తతిమా సైటు అంతా తెలుగులోనే కనిపిస్తుంది. అలా సైటు మొత్తాన్నీ తెలుగులోనికి తీసుకువచ్చే ప్రక్రియని స్థానికీకరణ అంటారు. ఈ విషయంపై అవగాహనకు మీడియావికీ స్థానికీకరణ గురించిన ఈ స్వబోధక ప్రదర్శనని చూడండి:

దానిలో చెప్పినట్టుగా మీడియావికీ (అంటే వికీపిడియా వెనకవున్న ఉపకరణం) యొక్క స్థానికీకరణ translatewiki.net వద్ద జరుగుతుంది. అక్కడ అదొక్కటే కాకుండా, స్టేటస్.నెట్, ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్, వికియా, వికీరీడర్, షపడూ వంటి మరెన్నో ఉపకరణాల స్థానికీకరణ కూడా జరుగుతుంది. వీటన్నింటినీ తెలుగులో అందుబాటులో తీసుకురావడానికి ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ సైటులో నమోదయి అనువాదాలు చేయండి.

మీరు మీడియావికీని అనువదిస్తే, తెలుగు వికీపీడియా, విక్షనరీ వంటి వికీ ప్రాజెక్టులతో బాటు, తెలుగుపదం వంటి సైట్లు కూడా ఆ అనువాదాలతో లాభపడతాయి. స్టేటస్‌నెట్ ఉపకరణాన్ని అనువదిస్తే, etelugu.status.net, veeven.status.net, koodali.status.net, కేక వంటి సేవలు పూర్తిగా తెలుగులో అందుబాటులోకి వస్తాయి.

మిమ్నల్ని మరికాస్త ఊరించడానికి: ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం ఒక అనువాద ర్యాలీ నడుస్తుంది. దాని ప్రకారం, ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో మీరు గనక ఏప్రిల్ 23 2011 00:00 UTC నుండి ఏప్రిల్ 30 2011 24:00 UTC (భారత సమయం ప్రకారం శనివారం, ఏప్రిల్ 23 2011, ఉదయం 5:30 నుండి ఆదివారం, మే 01, 2011 ఉదయం 5:30 వరకు) మధ్య కాలంలో 500 అనువాదాలను పూర్తిచేస్తే, € 1,000 లలో భాగం పొందుతారు. మరిన్ని వివరాలు.

మరింకెందుకాలస్యం, ఆ ర్యాలీ సమయం మొదలయ్యే లోపు కొన్ని అనువాదాలు చేసి కాస్త అనుభవం సంపాదించి తయారుగా ఉండండి.

ఆనంద స్థానికీకరణం!

పివిక్, జాల గణాంక విశ్లేషణలు

పివిక్ అనేది జాల గణాంక విశ్లేషణల ఉపకరణం. ఇది గూగుల్ అనలిటిక్స్‌కి ఒక బహిరంగాకర ప్రత్యామ్నాయం. మన సైటు గణాంకాల విశ్లేషణ కోసం సైటు గణాంకాల భోగట్టాని ఇతరులచే గమనింపజేసి వారి వద్దే భద్రపరిచే బదులు, పివిక్‌ని మన సర్వరు లోనే స్థాపించుకుని మన భోగట్టాని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం లేదా ఆ భయం నుండి తప్పించుకోవచ్చు. పివిక్ గురించి మరింత వారి సైటులో చూసి తెలుసుకోవచ్చు.

అయితే, దీని తెలుగీకరణని నేను ప్రారంభించాను. మీకోసం ఒక తెరపట్టు (పెద్ద చిత్రం కోసం బొమ్మపై నొక్కండి).
పిపిక్ పాక్షిక తెరపట్టు

పివిక్ తెలుగీకరణలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే, పివిక్ అనువాదాల పుట లోని సూచనలని పాఠించండి.

ఆనంద తెలుగీకరణం!