అభిప్రాయ సేకరణ: మీ రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు ఎంత?

రోజూ మనం ఎంతో సమాచారాన్ని (క్రియాశీలంగానైనా లేదా యధాలాపంగానైనా) చదివి వినియోగిస్తుంటాం: వార్తలు, బ్లాగులు, ఈమెయిళ్లు, కబుర్లు (IM), సూక్ష్మ బ్లాగులూ, బజ్, వాల్, స్క్రాపులు, గట్రా. మీకు సంబంధించి వీటిలో సగటున రోజుకి తెలుగు ఎంత శాతం ఉండవచ్చు? మీ మౌఖిక సంభాషణలనీ, టీవీలో చూసిన మరియు రేడియో, జాలంలో విన్న తెలుగుని వదిలేస్తే, మీరు రోజు వారీ చదివే దానిలో తెలుగు సమాచారం/విషయం యొక్క శాతం ఎంత?

ఉదాహరణకి, మీరు ఒక రోజు అన్ని పనులూ ఇతరత్రా కాలక్షేపాల నుండి విరామం తీసుకుని, కేవలం ఒక్క నవ(ల)లే చదివారనుకుందాం. ఆ నవల(లు) తెలుగు అయితే, ఆ రోజు మీ తెలుగు సమాచార వినియోగం నూరు శాతం. ఆదే నవల ఆంగ్లమయితే, తెలుగు సున్నా. అలాంటి అనుభవాలు మీకు అరుదు అయితే, వాటిని వదిలివేసి సగటున మామూలు రోజుల్లో తెలుగు వినియోగం ఎంత అన్నది ఆలోచించండి.

మీరు చేసేవన్నీ పద్దురాసి, సంకలనించి, శాతం కట్టేంత ఖచ్చితంగా అక్కరలేదు కానీ, స్థూలంగా మీ అంచనా ఏమిటి?

 

అంకెల్లో తేల్చలేకపోతే, ఇక్కడ వ్యాఖ్యగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?

ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది? ఈ ప్రశ్నలడగడానికి కారణమేమంటే, మన సమాధానాలు లేదా అవసరాలు సమాచార సృష్టికర్తలకీ (బ్లాగర్లని కలిపే) మరియు జాల గూళ్ళ నిర్వాహకులకీ తమ తమ ప్రాధాన్యతలలో ఉపకరిస్తాయి. (చాలామంది తెలుగులో పర్యాటక సమాచారం చూడాలనుకుంటున్నాం అన్నారనుకోండి, ఆ దిశగా బ్లాగులూ లేదా సైట్లూ వస్తాయని ఆకాంక్ష.)

దీన్ని నా బ్లాగుకే పరిమితం చేయనవసరంలేదు; ఈ విషయంపై మీ ఆకాంక్షలనీ, అభిప్రాయాలని టపాగా మీ బ్లాగులో కూడా వ్రాయండి.

ఆనంద తెలుగీకరణం!

ప్రకటనలు

హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!

హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం అని కొత్తపాళీ రాసారు. ఆయన అన్న వేమూరి వారి వీరతాళ్ళు (సుజనరంజని పత్రిక) లంకెలు:

వేమూరి వారు వీరతాళ్ళు అన్న బ్లాగుని కూడా మొదలుపెట్టారు. ఈ బ్లాగుని క్రియాశీలంగా కొనసాగించమని బ్లాగ్ముఖంగా వారికి నా అభ్యర్థన.

ఇక హీబ్రూ. హీబ్రూ గురించి నాకు పెద్దగా (అసలేమీ) తెలియదు. కొ.పా. గారు లంకిచ్చిన ఆడియో విని ఆపై వికీపీడియాలో చదివాను. రెండు ముక్కల్లో కావాలంటే, కొ.పా. గారి టపాలో చంద్ర మోహన్ గారి వ్యాఖ్య:

మరణించిన రెండువేల సంవత్సరాల తరువాత ఫీనిక్సు పక్షిలా పునర్జీవితమైన్ ఆధునిక ప్రపంచ భాషల్లో ఒకటిగా మారిన హిబ్రూ భాషకథ భాషాప్రేమికులకు ‘బైబిల్’ లాంటిది (literally!). ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత హిబ్రూను అధికార భాషగా నిర్ణయించాక చూసుకుంటే వారికి మిగిలి ఉన్న ఒకేఒక లిఖిత సాహిత్యం పాత నిబంధన గ్రంధం ఒక్కటే. అందులోని పదాలనుండే ఆధునిక భావనలకు పదబంధాలను సృష్టించవలసి వచ్చింది. ఉదాహరణకు, విద్యుత్తు అన్న మాటకు ఏంపదం వాడాలా అని వెదికి బైబిల్లో దేవుని తలచుట్టూ ఉన్న కాంతి చక్రానికి వాడిన పదం “హష్ మల్” ను ఖాయం చేశారు. దేవుని సంజ్ఞ అనే అర్థంలో బైబిల్లో వాడిన ‘రాంజోర్’ అన్న పదాన్ని ‘traffic signal’ కు వాడారు. ఇలా ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళలో సకల విజ్ఞానశస్త్రాలనూ వారిభాషలోకి అనువదించుకొన్నారు. వారిభాషలోనే చదువుకొంటున్నారు.

మనమూ హీబ్రూ నుండి స్ఫూర్తి పొందాలి అని నేను చెప్పగలను. హీబ్రూ వికీపీడియా నిన్ననే లక్ష వ్యాసాలకు చేరిందని ఇప్పుడే చదివాను.

This achievement is quite remarkable for a language with less than 10 million speakers, from which about 3.5 million are native speakers (data taken from the Hebrew wikipedia).

86 మిలియన్ల మంది మాట్లాడేవారు (అందులో 74 మిలియన్లు తెలుగుని మాతృభాషగా గలవారు) ఉన్న తెలుగు భాష వికీపీడియాలో 44,274 వ్యాసాలు ఉన్నాయి (గణాంకాలు తెలుగు వికీపీడియా నుండి.)

అవును, మనం తప్పకుండా హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందాలి!

ఒకే అచ్చు గుణింతంతో పదాలు

తెలుగులో చాలా పదాలు ఒకే అచ్చుతో వస్తాయి. నాకు తట్టినవి ఇక్కడ. అసలు తలకట్టు తప్ప వేరే అచ్చులేని పదాలు (ఉదా. పలక) కాకుండా:

  1. కాకా (కాకా హోటల్ అంటాం కదా)
  2. కాజా
  3. కామా
  4. టాటా
  5. బాకా
  6. బాజా
  7. బాబా
  8. లావా
  1. గిరి
  2. చిలిపి
  3. తిమ్మిరి
  4. నిడివి
  5. పిడికిలి
  6. పిప్ఫి
  7. మిసిమి
  8. లిపి
  9. విరివి
  10. సిరి
  1. టీవీ
  1. ఉడుకు
  2. ఉరుము(లు)
  3. కుక్కు (సంచిలో కుక్కడం)
  4. కుదుపు(లు)
  5. కుదురు
  6. కులుకు(లు)
  7. గుద్దు(లు)
  8. గుబులు
  9. తుడుపు
  10. దుద్దు(లు)
  11. దున్ను
  12. పులుపు
  13. బుద్ధుడు
  14. ముక్కు(లు)
  15. ముగ్గు(లు)
  16. ముగ్గురు
  17. ముడుపు(లు)
  18. ముదురు
  19. ముద్దు(లు)
  20. మురుగు
  21. ములుకు
  22. ముసురు
  23. రుద్దు
  24. సుద్దులు
  1. వేరే

ఇంకేమైనా?

ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని.

బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు.

ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు?

మీరేమంటారు?

(ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)

తెలుగుపదం

తెలుగుపదం ముఖ్యంగా రెండు లక్ష్యాలతో ఏర్పడింది:

 • చాన్నాళ్ళుగా మందగించిన కొత్త తెలుగు పదాలు తయారీని వేగవంతం చేయడం, ప్రోత్సహించడం, అందుకుకావాల్సిన సాముదాయిక వాతావరణాన్ని కల్పించడం.
 • పలు చోట్ల (బ్లాగుల్లో, గుంపుల్లో, ఇతర చోట్ల) తయారౌతున్న తెలుగు పదాలను ఒకేచోట (వెతుకుకొనగలిగే సౌలభ్యంతో) క్రోడీకరించడం.

ఈ లక్ష్యాలకు సాధనాలుగా తెలుగుపదం వికీ సైటు మరియు తెలుగుపదం గుంపులను స్థాపించాం.

మీరెలా తోడ్పడవచ్చు?

 1. మీ బ్లాగులో, ఇతర రచనలలో తెలుగు పదాలు వాడుతుండండి. మీనుండి మేం ఆశించే పెద్ద సహాయం ఇదే.
  కొత్త తెలుగు పదాలు వాడడానికి మీరు సందిగ్థంలో ఉండవచ్చు, మీ చదువరులకు ఈ కొత్త తెలుగు పదాలు అర్ధమౌతాయా అని. కానీ ధైర్యం చేసి తెలుగుపదాలు వాడండి. చాలావరకు సందర్భమే ఆ తెలుగుపదమేంటో తెలియజేస్తుంది. ఇక్కడ సందర్భం అంటే context అని మీకు తెలిసిపోయిందిగా అలా. ఆ రిస్కుకూడా తీసుకోకూడదు అనిపిస్తే ఆంగ్ల సమానార్థకాన్ని కూడా బ్రాకెట్లలో ఇవ్వండి. ఉ.దా. మీ వెబ్ విహరిణి (web browser) ని తెరవండి.
 2. మీక్కావలసిన పదాలు తెలుగుపదం సైటులో లేకపోతే, తెలుగుపదం గుంపులో అడగవచ్చు. మీకు తప్పక ఓ తెలుగుపదం దొరుకుతుంది.
 3. కొత్త పదాలను మీరు ప్రతిపాదించవచ్చు కూడా. ఇతరుల ప్రతిపాదనలకు మీ ప్రత్యామ్నాయాలూ సూచించవచ్చు. తెలుగుపదాల తయారీకి మీక్కావలిసిన మార్గదర్శకాలు రూపొందుతున్నాయి మరియు సమాచార వనరులు కూడా సేకరిస్తున్నాం
 4. గుంపులో జరిగే చర్చల్లో చాలా కొత్త పదాలు జాలువారుతుంటాయి. వీటిని తెలుగుపదం వికీలో చేర్చండంలో తోడ్పడడం ద్వారా మంచి పదసంపద తయారీలో మీ వంతు కృషిచేసినవారుఅవుతారు.
 5. మీకు తెలిసిన పండితులను (వివిధ రంగాలకు చెంది వారిని, తెలుగుపై ఆసక్తి ఉన్న వారిని) తెలుగుపదానికి సాయపడమని ప్రోత్సహించండి.
 6. మీ వెబ్ సైటు లేదా బ్లాగులో తెలుగుపదం బొత్తాలు పెట్టుకోండి.
  మామూలు బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/6/6f/Button88x31.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

  చిన్ని బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/3/36/Button80x15.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

అంతర్జాలంలో తెలుగుని వాడి మీరిప్పుడు చేస్తున్న తోడ్పాటు భవిష్యత్తులో బయటి ప్రపంచంలోని తెలుగు స్థాయిని కూడా పెంచేంతగా ప్రభావంచూపిస్తుంది.

సంక్షిప్త పదాలు

ఆంగ్లంలో సంక్షిప్త పదాల వాడుక ఎక్కువ. (ఇటీవలి కాలంలో SMS ల జోరుతో ప్రతి పదాన్ని కుదించేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.) ఈ సంక్షిప్త పదాల్లో భాషని సృజనాత్మకంగా వాడటంలో accronyms ది ప్రత్యేక పాత్ర.

ఈ సంక్షిప్త పదాలతో కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. వేర్వేరు విషయాలకి, భావనలకి ఒకే సంక్షిప్త పదం ఉండే అవకాశం ఎక్కువే. IT అంటే Income Tax కావచ్చు, Information Technology కావచ్చు. ఆయా విషయేతర సందర్భాలో వాడినప్పుడు ఈ సంక్షిప్త పదాలు అయోమయాన్ని, సందిగ్ధత ని కల్గిస్తాయి.

ఇక ఒక రంగంలో వారి సంపలు (ఊ… సంక్షిప్త పదాల్లేండి) ఇతర రంగాల వారికి అంతగా కొరుకుడు పడవు. సమాచార సాంకేతిక రంగంలోనైతే, రోజుకో సంపదం (సంక్షిప్త పదం) పుట్టుకొస్తుందంటే అతిశయోక్తి కాదు.

ఇక తెలుగు విషయానికి వస్తే, ఉన్నవే తక్కువ (లేదా, నాకు తెలియవా?). భాష యొక్క వాడకం పెరగాలంటే, ఇలాంటి సులువైన (సృష్టించేవారికి కష్టమైనా) పద్దతులని అవలంబించాలి.

అయితే, వీటిని మన రచనల్లో వాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శ్రోతలకి తెలిసి ఉండకపోవచ్చు. ఏదైనా పదానికి సంక్షిప్త రూపాన్ని రచనలో మొదటి సారి ఊపయోగించినప్పుడు దాని పూర్తిరూపాన్ని కూడ బ్రాకెట్లలో ఇస్తే తెలియనివారికి సౌలభ్యంగా ఉంటుంది.

నాకు తట్టిన కొన్ని తెలుగు సంక్షిప్త పదాలు:

 • విరసం, విప్లవ రచయితల సంఘం
 • అరసం, అభ్యుదయ రచయితల సంఘం
 • తెవికీ, తెలుగు వికీపీడియా
 • నివ్య, నిర్వాహక వ్యవస్థ Operating System (అందమైన పేరు కదూ? నా సృష్టే!)

మీకింకేమైనా తడితే వాటిని తెలుగు విక్షనరీ లో చేర్చండి.

Anonymity in Telugu

అనామకత్వాన్ని తెలుగులో ఎన్ని రకాలుగా చెప్పవచ్చు:

 1. ఆకాశరామన్న
 2. అనామకుడు/అనామిక
 3. అపరిచితుడు
 4. గుంపులో గోవిందయ్య
 5. నలుగురిలో నారాయణ
 6. దారిన పోయే దానయ్య
 7. రోడ్డున పోయే రంగన్న
 8. వీధిలో వీరన్న
 9. నగరంలో నర్సయ్య

మీకు ఇంకేమైనా తడితే వ్యాఖ్యలుగా చేర్చండి.