మార్చిన టపాలు ఇక కూడలిలో రావు!

మీరు (బ్లాగుస్పాట్ బ్లాగర్లు) టపాలో ఏ మార్పు చేసినా లేదా టపాల యొక్క లేబుళ్ళు మార్చినా అవి కూడలిలో తిరిగి దర్శనమిచ్చేవి. ఈ ఇబ్బందికరమైన సమస్యని ఎట్టకేలకు పరిష్కరించాను.

అన్నట్టు, తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది. (కూడలి మెరుగుపరచడం కోసం వస్తున్న టపాలు చదువుతున్నాను.) అయినా, ఇప్పట్లోనే ఇంకా ఏమీ ఆశించవద్దు. :)

ప్రకటనలు

మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?

కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.

కూడలిలో పిచ్చి అక్షరాలు

ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:

ఫీడులో తప్పిదం 1

ఫీడులో తప్పిదం 2

వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.

ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.

నెట్‌వైబ్స్‌లో కూడలి

నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.

కొత్త కూడలి విడుదలయ్యింది!

కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా.

Screenshot of New Koodali

గమనించాల్సిన మార్పులివీ:

 • మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా: కూడలి 100 అన్ని బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, బ్లాగుల పేజీ చూడండి.
 • వ్యాఖ్యలు ఆయా సంబంధిత పేజీలలో కుడివైపు వస్తాయి. కానీ మీరు కావాలని అడిగితే వ్యాఖ్యల పేజీ కూడా ఉంది.
 • విభాగాలు: మీకు అంతగా సమయం లేకపోతే, టపాలన్నింటినీ చదవకుండా మీకు ఆసక్తి ఉన్న విభాగాలనుండి టపాలను మాత్రమే చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ విభాగాలున్నాయి:
  • కూడలి 100: నా దృష్టిలో ఉత్తమ 100 తెలుగు బ్లాగులు
  • సాహిత్యం: కథలు, కవితలు, మరియు వాటిపై సమీక్షలు
  • హాస్యం: జోకులు, కార్టూన్లు
  • సినిమా: సినీ సమీక్షలు, గట్రా
  • సాంకేతికం: కంప్యూటర్ రంగంలో మరియు అంతర్జాలంలో కొత్త విషయాలు మరియు చిట్కాలు
  • రాజకీయాలు: ప్రభుత్వాలు, పార్టీలు, వ్యూహాలు, సమాజం
  • ఇంకే విభాగాలు కావాలి?
 • అన్వేషణ: నావిగేషన్ బద్దీలో ఉన్న అన్వేషణ పెట్టె నుండి వెతకడంద్వారా కూడలిలో వచ్చే అన్ని తెలుగు బ్లాగులనుండి గూగుల్ ఫలితాలను పొందవచ్చు. (ఉదా: మీగడ, సూరేకారం)
 • సేకరణలు మరియు ఇంగ్లీషు పేజీలలో కూడా విభాగాలు. ఇకనుండి మీకు నచ్చినవే చదవండి.
 • ఫీడులకు మార్పులు: మీలో చాలా మంది కూడలిని ఫీడుల ద్వారా చదువుతూ ఉండవచ్చు. బ్లాగుల ఫీడుని తాజాకరించుకోండి. మీరేమీ మార్చుకోకపోయినా పర్లేదు. కానీ తాజాకరించుకోవడం ఉత్తమం. బ్లాగుల విభజన వల్ల మీకు ఆసక్తి ఉన్న విభాగాలనే చేర్చుకునే సౌలభ్యం కూడా ఉంది.
 • మీ బ్లాగు లేదా వెబ్ సైటు నుండి కూడలికి లంకె వెయ్యడానికి మీకు కావలసిన సమాచారమందించే ప్రచార పేజీ.
 • మంచి 404 పొరపాటు పేజీ :)

మరి మీకు నచ్చిందా? సూచనలు, సలహాలు, విమర్శలు తెలియజేయండి మరి.

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి.

(ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.)

కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే నిర్ణయించా):
“పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు” ‌చదవడం కొనసాగించండి

కూడలి వార్షికోత్సవ కానుక: చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం

కూడలి వార్షికోత్సవ కానుకగా చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం అందిస్తున్నా. ఇది సరళమైన, చిన్ని పరిష్కారం*.

Hide Visited Posts in Koodali

ఆ నక్షత్రం మీద నొక్కండి చాలు. మీరు చదివేసిన టపాలన్నీ ఎగిరిపోతాయి. (కీబోర్డు ప్రేమికులు “*” (asterisk), “.” (dot) లలో ఏదైనా వాడవచ్చు. Shift key does not matter.) మళ్ళీ అన్ని టపాలు కావాలంటే, పేజీని రీలోడ్ చేయండి.

ఇప్పుడే ప్రయత్నించండి!*

*document.defaultView ని అందించే ఏ విహరిణిలో ఐనా పనిచేస్తుంది. (మంటనక్కలో పనిచేస్తుంది. IE6లో పనిచేయదు. IE7 తెలియదు.)

ప్రస్తుతం బ్లాగుల పేజీలోనే దీన్ని చేతనం చేసా. మిగతా పేజీలలో కావాలంటే ఇక్కడ వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు.

అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని: