కూడలి యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతల బదిలీ

కూడలి యొక్క యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతలను నేను కినిగె వారికి బదిలీ చేస్తున్నాను.

ప్రస్తుతం కూడలి మధ్యయుగానికి చెందిన నిర్మాణాకృతి/సాంకేతికతలపై పనిచేస్తుంది. :) దాన్ని మెరుగుపరచడానికి ఆకాశమంత అవకాశం ఉంది. ఈ మధ్య… ఉహూ ఎప్పడినుండో కూడలికి కేటాయించడానికి తగినంత సమయం నాకు దొరకడం లేదు. అందునా, నేను దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్న కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి.

కినిగె వాళ్ళు కూడలిని తెలుగు బ్లాగులోకానికే గాక తెలుగువారందరికీ మరింతగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.

గమనిక: కూడలికి సంబంధించిన ఈమెయిళ్ళను నా వ్యక్తిగత ఈమెయిలుకు కాకుండా support[at]కూడలి.orgకి పంపించండి. అలానే నాకు పంపించే వ్యక్తిగత సందేశాలను కూడలి చిరునామాకు కాక veeven@జీమెయిల్.కామ్ చిరునామాకు పంపండి.

అన్నట్టు, ఇన్నాళ్ళూ కూడలి పట్ల (తద్వారా నాపై) మీరు చూపించిన అభిమానానికీ మీరిచ్చిన సహకారానికీ కృతజ్ఞతలు. మరో ఉత్సాహకరమైన చేపట్టులో కలుద్దాం. :)

ప్రకటనలు

The Hidden Agenda: కూడలి

ముందుగా, పోల్ కేవలం పరాచికానికే. తర్వాత, స్పందించిన వారందరికీ నెనర్లు. చాలా అభిప్రాయాలు, ఆకాంక్షలు వెల్లువెత్తాయి.

అసలు ఈ ప్రక్రియని నేను మొదలుపెట్టింది ఇందుకూ:

తెలుగు బ్లాగుల సంఖ్య మునుపెన్నడూ లేనంత వేగంగా పెరుగుతుంది. కూడలిని మెరుగుపరిచే విషయంతో బాటు, నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూడలికి విషయ విధానం ఉండాలని ఆలోచిస్తున్నాను.

ఈ ప్రక్రియ అంతా కూడలికి ఉండాల్సిన దీర్ఘకాలిక విషయ విధానం గురించి. తాత్కాలిక నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాను. కూడలిని నా స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలపై నడిచే సంకలినిగా కంటే, ఒక ప్రకటిత విధానంపై నడపాలన్న ఆకాంక్ష దానికి మూలం. వ్యక్తిగా ఏదో ఒక పక్షం వహించడం తేలికే. అది కూడలిలో సంకలనించే బ్లాగుల రూపంలో ప్రతిఫలిస్తే, అది కూడలికే చేటు.

పై గద్య పైన ఉదహరించిన రెండు వాక్యాలనీ విశదంగా చూస్తే (లేదా అవి రాసినపుడు నా కవి హృదయం1), ముద్రణ, ప్రసార మాధ్యమాల్లోని వారూ, రాజకీయులూ (వారి అనుచరులూ, శత్రువులూ) ఇతరత్రా అంతా బ్లాగుల్లోనికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పటి పరిస్థితిని వీరందరి రాకతో హెచ్చవేసి ఆ రచ్చని చూడండి. (అదీ నేను ఆలోచిస్తున్న దిశ.) అప్పుడు వచ్చే కల్లోలాలని తట్టుకునే శక్తీ, మాధ్యమాధిపతులకున్న (ధన,కండ)బలం కూడలికీ నాకూ లేదు. ఉన్నదల్లా మీ అందరి ఆదరణే.

నా గత టపాలోని ఈ వాక్యం గురించీ కాస్త వివరణ:

మీరు—కూడలి సందర్శకులు—కూడలిలో ఎటువంటి బ్లాగులని చూడకూడదనుకుంటున్నారు?

రెండు విషయాలు: (1) చూడకూడదనుకుంటున్నవి అడిగాను; (2) ఎటువంటి అని అడిగాను, ఏవీ అనలేదు. మొదటిది, చూడాలనుకునే విషయాల/బ్లాగుల పరిధి సాధ్యమైన విస్తృతంగా ఉండాలని. రెండవది, ఎటువంటి అని ఉపయోగించినది వర్తమానం కంటే భవిష్యత్తు వైపు ఆలోచనకి మరియు సాధారణంగా అందరూ నిరసించే ప్రవర్తనలపై అందరి అభిప్రాయాలూ తెలుసుకోవాలని మరియు వాటిపై మరింత చర్చ జరగాలని.

మరోసారి మరింత

1క్లుప్తత నా బలమూ, బలహీనతా.

అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా?

సూటిగా, సుత్తి లేకుండా ;)

 

పరాచికాలు అలా ఉంచితే, కూడలి కొన్ని రకాలైన బ్లాగులని అనుమతించడం ద్వారా ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలానే నిందాపూర్వక, ద్వేషపూర్వక (లేదా అటువంటి వ్యాఖ్యలని ప్రోత్సహించే) బ్లాగులకీ కూడలిలో స్థానం ఉండకూడదన్న విన్నపాలూ నాకొస్తున్నాయి. నన్ను సంప్రదించిన వాళ్ళకి నచ్చని బ్లాగులు చదవకండి అని సలహాని ఇస్తూ వస్తున్నాను. (నచ్చని బ్లాగులని మీకు కనబడకుండా చేసుకునే సౌలభ్యం కూడా కూడలిలో ఉంది.)

తెలుగు బ్లాగుల సంఖ్య మునుపెన్నడూ లేనంత వేగంగా పెరుగుతుంది. కూడలిని మెరుగుపరిచే విషయంతో బాటు, నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూడలికి విషయ విధానం ఉండాలని ఆలోచిస్తున్నాను. అదే పనిలో, బ్లాగరుల ప్రవర్తనా నియమావళి, బ్లాగర్ యొక్క విషయ విధానం, వర్డుప్రెస్సు.కామ్ యొక్క విషయసమర్పకుల బాధ్యతల (రెండవ బిందువు దాని ఉపబిందువుల) నీ చదువుతున్నాను. మీరూ చదవండి; బ్లాగరుగా మన హక్కులూ భాధ్యతలని తెలుసుకోవచ్చు.

ఈ సందర్భంగా, మీరు—కూడలి సందర్శకులు—కూడలిలో ఎటువంటి బ్లాగులని చూడకూడదనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని ఇక్కడ వ్యాఖ్యలుగా గానీ, లేదా నేరుగా support ఎట్ koodali డాట్ org అన్న చిరునామాకి వేగు ద్వారా గానీ తెలియజేయవచ్చు.

తా.క.: వ్యాఖ్యలు నాకు ఖాళీ సమయం దొరికేంతవరకూ అనుమతి కోసం వేచియుంటాయి.తాజాకరణ.

కూడలిలో మీకు నచ్చని బ్లాగులు, గట్రా

మీరు కూడలికి వచ్చినప్పుడు ఇలా అనుకోవాల్సివస్తుందా?

ఇప్పుడే కూడలి ఓపెన్ చేస్తే షరా మామూలు గా ఒక […] టపా కనిపించింది.
ఎప్పటిలానే మొదటగా కోపం, తర్వాత నవ్వు కొంచెం చిరాకు..

అది నిరాసక్తత, ఆందోళనగా మారే ముందే ఒక ఉపశమనం.

కూడలికి పెద్దయెత్తున మార్పులు జరిగి, టపాలకు రేటింగులు, మీకు నచ్చిన బ్లాగులతో ‘నా కూడలి’ లాంటి సౌలభ్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకూ కాస్త ఉపశమనంగా మీకు నచ్చని బ్లాగులని నుండి వచ్చే టపాలను కూడలి నుండి తొలగించుకొనే సదుపాయం కల్పిస్తున్నాను. మీకు నచ్చని బ్లాగులని ఒక జాబితాలో చేర్చుకుంటారు (ఈ జాబితా మీ విహారిణిలో కూకీలుగా భద్రమవుతుంది.). మీరు కూడలి తెరిచినప్పుడు, ఆ బ్లాగులనుండి టపాలని కూడలి మీకు చూపించదు. చదవడం కొనసాగించండి

[పూర్తయ్యింది] కూడలి రెండు మూడు రోజులు పనిచేయకపోవచ్చు!

కూడలి సర్వరుకి మార్పులు చేయబోతున్నాను. ఓ రెండు మూడు రోజులు ఒడిదుడుకులుండవచ్చు. కొంత సమయం అసలు పనిచేయకపోవచ్చు. ఓపిక వహించండి!

తాజాకలం 2009-04-20 8:01: మార్పులు పూర్తయ్యాయి. ఇప్పుడు కూడలి పనిచేస్తుంది. కూడలిని చేరుకోవడంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయండి.

కూడలి దృక్పథం

ఈ టపాకి నేపధ్యం ఈపాటికి మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా, కూడలి గురించిన ప్రాముఖ్య విషయాలను ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. కూడలి గురించి ఆసక్తి ఉంటే ఈ టపా మీకు ఉపయోగపడుతుంది.

చదవడం కొనసాగించండి

కూడలిలో టపాల జీవితకాలాన్ని పెంచడం

ప్రస్తుత కూడలిలో ఉన్న సమస్యల్లో మరోటి కూడలిలో టపాల జీవితకాలం. దీన్ని కూడలి ప్రస్తుత నిర్మాణాకృతిలోనే పరిష్కరించ ప్రయత్నం చేసాను. ఇది అంసంపూర్ణం మరియు తాత్కాలికం. (మరింత మెరుగైన పరిష్కారం కొత్త కూడలిలో ఆశించవచ్చు.)

 • మొదటి పేజీలో ప్రస్తుతం కనిపించే టపాల సంఖ్యను 40కి పెంచాను. దీనివల్ల మొదటి పేజీ కొంత మెల్లగా లోడవవచ్చు. తేడా అంతగా తెలియకపోవచ్చులేండి. కానీ మీ టపా మరికాస్త ఎక్కువ సేపు కూడలిలో ఉంటుంది.

మరో ముఖ్యమైన మార్పు ఏమంటే—

 • అన్ని బ్లాగులు అనే కొత్త పేజీ
  • దీనిలో వివిధ జాబితాల నుండి శీర్షికలు మాత్రమే కనిపిస్తాయి.(సర్వరు పై భారం ఎక్కువ లేకుండా ఉండేందుకుగానూ బ్లాగులన్నింటినీ కూడలి జాబితాలుగా విభజించి ఈ జాబితాలని తాజాకరిస్తుంటుంది.)
  • మొదటి పేజీ మరియు బ్లాగుల పేజీల కంటే, ఈ పేజీలో 15 నిమిషాల ముందే టపాలు కనిపిస్తాయి. (మీరు టపా రాసిన తర్వాత కూడలిలో కనబడడానికి మామూలు పరిస్థితులలో గరిష్ఠంగా 75 నిమిషాలు పడుతుంది. కానీ ఈ పేజీలో అయితే గరిష్ఠంగా 60 నిమిషాలు పడుతుంది. )
  • ఈ పేజీలోని మరిన్ని అనే లింకుల ద్వారా ఆయా జాబితాల పేజీలకు వెళ్ళవచ్చు. ఉదాహరణ పేజీ: జాబితా 7 (లేలేత బ్లాగర్లు). ఈ జాబితాల పేజీలన్నీ కలగలుపుకుని 420 (60 x 7) టపాలు చూడవచ్చు. మీరు ఓ రెండు వారాలు కూడలి చూడలేకపోయినా, ఈ జాబితాల పేజీ మీకు అక్కరకు వస్తుంది.
  • ఈ పేజీ యొక్క మరో ప్రయోజనమేమంటే, ఎవరైనా ఓ బ్లాగరు చాలా టపాలు ఒకే రోజునే ప్రచురించారనుకోండి, ఈ పేజీలో ఆ బ్లాగరున్న జాబితాలో మాత్రమే అతని టపాల ప్రభావముంటుంది.
  • ఈ పేజీకి మొదటి పేజీలోని లింకుల పెట్టెలోని అన్ని బ్లాగులూ అన్న లింకు ద్వారా చేరుకోవచ్చు.

   కూడలి త్వరిత లింకుల పెట్టె
   కూడలి త్వరిత లింకుల పెట్టె

ఈ మార్పులు అసలైన పరిష్కారాలు కాకపోయినప్పటికీ, మొన్నటి పరిష్కారంతో కలిపి సమస్య తీవ్రతని తగ్గించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాను.

అన్నట్టు, కొత్త తరం కూడలిపై చర్చలో మీరు పాల్గొనవచ్చు.

మార్చిన టపాలు ఇక కూడలిలో రావు!

మీరు (బ్లాగుస్పాట్ బ్లాగర్లు) టపాలో ఏ మార్పు చేసినా లేదా టపాల యొక్క లేబుళ్ళు మార్చినా అవి కూడలిలో తిరిగి దర్శనమిచ్చేవి. ఈ ఇబ్బందికరమైన సమస్యని ఎట్టకేలకు పరిష్కరించాను.

అన్నట్టు, తర్వాతి తరం కూడలిపై పని మొదలైంది. (కూడలి మెరుగుపరచడం కోసం వస్తున్న టపాలు చదువుతున్నాను.) అయినా, ఇప్పట్లోనే ఇంకా ఏమీ ఆశించవద్దు. :)

మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?

కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.

కూడలిలో పిచ్చి అక్షరాలు

ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:

ఫీడులో తప్పిదం 1

ఫీడులో తప్పిదం 2

వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.

ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.

నెట్‌వైబ్స్‌లో కూడలి

నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.