వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS
::first-letter
సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది.
ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు:
p::first-letter { font-size: 3em; }
కానీ కేవలం మొదటి పేరా లోని మొదటి అక్షరానికి మాత్రమే వర్తించాలంటే:
p:first-child::first-letter { font-size: 2em; color: red; }
పై నియమంలో, :first-child
అనే సూడో-తరగతి <p>
మూలకం అది ఉన్న స్థాయిలో మొదటిది అయితే గనక గుర్తిస్తుంది.
అక్కడవరకూ బానే ఉంది. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి, జాల విహారిణులు మొదటి అక్షరాన్ని సరిగా గుర్తించలేకపోతున్నాయి. (తెలుగులో ఒక అక్షరం 7 యూనికోడ్ కోడుపాయింట్ల వరకూ, అంతకంటే ఎక్కువకూడా, ఉండొచ్చు. ఉదాహరణకు స్ట్రాంగ్ అనే పదంలో మొదటి అక్షరం “స్ట్రాం”లో 7 కోడుపాయింట్లు ఉన్నాయి.) ఫైర్‌ఫాక్స్ వారికి నేను ఈ దోషాన్ని నివేదించాను. ఆ దోషం సరయ్యింది కనుక ఫైర్‌ఫాక్స్ ఇప్పుడు తెలుగు మొదటి అక్షరాన్ని సరిగానే గుర్తుపడుతూంది.
వివిధ విహారిణుల్లో తెలుగుకి సంబంధించి ::first-letter
సూడో-మూలకానికి ఉన్న తోడ్పాటు ఇదీ (బొమ్మను ఇంకా పెద్దగా చూడడానికి దానిపై నొక్కండి):
మీ అభిమాన విహారిణిలో దీన్ని పరీక్షించి చూడడానికి ఈ పేజీ (మరోటి) ఉపయోగపడవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే, మీ విహారిణి తయారీదారుకి నివేదించండి.
I made a jQuery plugin to solve this problem sometime back. Some one can download & participate
https://code.google.com/p/indic-css-pseudo-fc/