తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక!

కొన్నాళ్ళ క్రితం ప్రజ బ్లాగులో తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. (విచారకరంగా ఆ టపా ఇప్పుడు అందుబాటులో లేదు.) దానిపై రహ్మనుద్దీన్ తన ఆలోచనలను మరో టపాలో పంచుకున్నాడు. దీని ద్వారా కొంతవరకూ మూల టపా సారాంశాన్ని గ్రహించవచ్చు. ప్రజ టపాకి నేను స్పందిస్తూ ప్రాచీన హోదా, తత్ఫలిత విశిష్ట కేంద్రమూ సామాన్యులకి నేరుగా ఉపయోగపడకపోవచ్చు కానీ వాటివల్ల చరిత్ర సాహిత్య రంగాలకు ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు అని వ్రాసాను. ఆ టపాకి వచ్చిన వ్యాఖ్యల్లో ఒక ముఖ్యమైన సూచన జై గొట్టిముక్కల గారి నుండి వచ్చింది. హరి (సూరపనేని?) గారి వ్యాఖ్యల్లోనూ మంచి అంశాలు ఉన్నాయనుకున్నాను కానీ ఇప్పుడు టపానే అందుబాటులో లేదు. రహ్మాన్ టపా నుండి జై గారి వ్యాఖ్యను ఇక్కడ అతికిస్తున్నాను:

తెలుగు భాష పునరుజ్జీవనం అంశంలో ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భాషాభిమానులు, పండితులు మరియు భాషాశాస్త్ర నిపుణులు (linguistic experts) కలిసి మేధోమధనం చేయాలి.

లిపి/వ్యాకరణ సంస్కరణ, నిఘంటువులు, భాషా సరళీకరణ, మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం, పద్య రచన పునర్వైభవ ప్రాప్తి, కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం, చేతిరాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషకు ఒక మానిఫెస్టో కావాలి. ఇదంతా చేయడానికి ఎందరో పెద్దల సహకారం అవసరం. ఈ ప్రక్రియకు ఖర్చు ఆట్టే కాదు కానీ అందరినీ ఒకదగ్గర జమా చేయడం, వారి చర్చలను రికార్డు చేయడం మరియు వారి నిర్ణయాలను ప్రచురించడం కోసం ఎంతో ఓర్పు & శ్రమ పడుతుంది. Coordination, not funds, is the key to this exercise.

వారి వ్యాఖ్యలో ముఖ్య అంశం: సమన్వయం. పై వ్యాఖ్యలో ఒక రకంగా బాధ్యత నిపుణులు పండితులదే అనిపిస్తుంది. మనం—సామాన్యులం—ఏం చేయ్యగలం, ఏ విధంగా ఆ ప్రక్రియను మొదలుపెట్టగలం లేదా వెగిర పరచగలం, వివిధ రంగాల నిపుణుల మధ్య సమన్వయాన్ని ఎలా సాధించగలం, అసలు మనం ఆ ప్రక్రియలో ఎలా భాగస్వాములం అవగలం అన్న వాటిని అన్వేషించడం ఈ టపా ఉద్దేశం.

జాలమే వేదిక!

సమిష్టి కృషికీ సమన్వయానికీ అత్యుత్తమ వేదిక జాలం. ముందు తరాలకు అందుబాటులో లేని ఈ అద్భుతమైన వేదిక మనకు అందుబాటులో ఉంది. జాలం వేదికగానే అతి పేద్ద విజ్ఞాన సర్వస్వం వికీపీడియా (287 భాషలు, 3 కోట్ల వ్యాసాలు) సాధ్యమయ్యింది. సురక్షితమైన కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ గ్నూ/లినక్స్ నిర్మాణానికి జాలమే ఆధారం. ఇలాంటి భారీస్థాయి పరియోజనలే కాకుండా అనేక చిన్న చిన్న వ్యాపకాలూ ఇంతకు మునుపెన్నడూ సాధ్యం కాని రీతీలో జాలం ద్వారానే జరుగుతున్నాయి. ఔత్సాహికులు చిన్న సినిమాలు తీసి యూట్యూబులో విడుదల చేస్తున్నారు, కథలు వ్రాసి బ్లాగుల్లో ప్రచురిస్తున్నారు, పద్యాలు రాస్తున్నారు. జాలం మూలంగా మన తలసరి సాంస్కృతిక దిగుబడి మెల్లగా పెరుగుతోంది.

తెలుగు భాష విషయానికి వస్తే ఇదో మహత్తర అవకాశం. సామాన్యులుగా వ్యక్తి స్థాయిలోనూ సంఘటితంగానూ ఏమైనా చెయ్యడానికి ఇప్పుడున్నంత వెసులుబాటు మునుపెన్నడూ లేదు. ఇంగ్లీషు మీడియం బడులు తామరతంపరగా రాక మునుపు తెలుగు భాష మాధ్యమంగా చదువుకున్న చివరి తరం మధ్యవయస్కులుగా మారబోతున్న తరుణం ఇది. ఇప్పుడు కాకపోతే, ఇక ముందు ఏమీ చేయలేం.

వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.

తెలుగుకి మేనిఫెస్టో తయారు చెయ్యడానికి మొదటి మెట్టుగా మనందరం మన ఆలోచనలను మన బ్లాగుల్లోనూ, ప్లస్సులోనూ, ఫేస్‌బుక్కులోనూ రాద్దాం. తెలుగుకి ఆధునిక హోదా అంటే ఏమిటి? అది సాధించడానికి ఎవరెవరు ఏమేం చెయ్యాలి? మనం ఏం చెయ్యొచ్చు? కేవలం మీ ఆలోచనలే కానవసరం లేదు. పండితుల తోనూ, మేధావుల తోనూ, మీ తోటి సామాన్యులతోనూ మాట్లాడండి. వారి ఆకాంక్షలను తెలుసుకోండి. బయటి ప్రపంచంలో జరిగే చర్చల సారాంశాన్ని జాలంలో పంచుకోండి. ఈ మేనిఫెస్టో తయారీ తతంగం అంతా ఒక్కచోటే జరగాల్సిన పనిలేదు. జాల పుటలను లంకెలతో కలిపి ఎక్కడి నుండి ఎక్కడికైనా చేరుకోగలగే సౌలభ్యాన్ని వాడుకుందాం. సంబంధిత అంశాలకు మీ టపాల నుండి లంకెలు వేయండి. తెలుగు భాష, అభివృద్ధి గురించి మీరు ఇప్పటికే ఏమైనా అచ్చు పత్రికలకు వ్రాసి ఉంటే, వాటిని వెతకగలిగేలా చేయండి, వాటికి లంకె వెయ్యగలిగేలా చెయ్యండి (అంటే యూనికోడ్ తెలుగులో జాలంలో పెట్టండి).

కొందరు ఔత్సాహికులం ఇటువంటి ఆలోచనలను క్రోడీకరించడానికి ఒక వికీని మొదలుపెట్టాం. ఆ ఆలోచనలనూ చూడండి.

ఆదర్శాలు కాకుండా తేలికగా అమలుపరిచగలిగే విన్నూత్న, సృజనాత్మక ఆలోచనలను చేయండి, వాటిని అందరితో పంచుకోండి.

తెలుగు కేవలం కథలు, కవితలకో లేదా మామూలుగా మాట్లాడుకోడానికో మాత్రమే మిగిలిపోకుండా సమాచార సాంకేతిక రంగంలో, పాలనలో, బోధనలో ఎలా ఉండాలి? వాదాలలో పడి కొట్టుకుపోకుండా, కార్యాచరణ దిశగా ఫలితాల దిశగా ఎలా ప్రయాణించగలం? ఆలోచించండి, ప్రశ్నించండి, ప్రేరణనివ్వండి!

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.

నేటి మార్కెట్-నిర్దేశిత ఆర్థిక వ్యవస్థలో, వ్యాపార సంస్థల నుండి తెలుగుకి ఏమైనా ఆశించడానికి (అంటే వారి ఉత్పత్తులను తెలుగులో అందించడం వంటివి), మన తెలుగుకి మార్కెట్ ఉందనిపించగలగాలి. మనం వారిని అడగాలి. ఆయా నిర్ణయాలు తీసుకునే వారు మన ఆశయం ఆవేశాలపై గాక దత్తాంశంపై ఆధారపడతారు. అదెలా పెంచగలం?

ఇంకా… ఇంకా… … మీ ఆలోచనల కోసం ఎదురుచూస్తున్నాను.

ఇ.కూ.చూ.:

One thought on “తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక!

 1. ఎంతైనా మాతృభాష మాతృభాషే. మాతృభాష ద్వారా విషయాలను తెలుసుకోవటం అనేది నాలాంటి వాళ్ళకు తేలికగా ఉంటుంది.
  జాలం నుంచి ఎందరో వ్యక్తులు అందిస్తున్న విషయాల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నాము.
  …………
  కంప్యూటర్లో తెలుగు బ్లాగులు రాకముందు నాలాంటి వాళ్ళకు మా అభిప్రాయాలను చెప్పుకోవటానికి సరైన అవకాశం ఉండేది కాదు. పత్రికల వాళ్ళకు మా అభిప్రాయాలను పంపితే వాళ్ళు ప్రచురించటం అనేది కష్టంగా ఉండేది.
  ఇప్పుడు నా అభిప్రాయాలను బ్లాగులలో వ్రాయగలుగుతున్నానంటే .. దైవం దయ వల్ల మరియు మీ వంటి ఎందరో కృషిచేసి అభివృద్ధి చేసిన టెక్నాలజీ మొదలైనవి కారణాలు.

  దైవానికి కృతజ్ఞతలు మరియు కంప్యూటర్లో తెలుగును ఇలా అభివృద్ధి చేసిన , చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.