మనం జాల పేజీల్లో ఉన్న సమాచారాన్ని కాపీ చేసుకోవాలంటే ముందుగా కాపలసిన పాఠ్యాన్ని మూషికంతో (మౌసుతో) లాగి ఎంచుకుంటాం (సెలెక్టు చేసుకుంటాం). లంకె పాఠ్యం కావాలంటే లంకె మొదలవక ముందు నుంచి లాగితే సరిపోతుంది. కానీ, లంకె మధ్యలో ఉన్న పాఠ్యాన్ని ఎంచుకోవాలంటే, కుదరదు. మనం లాగినప్పుడు లంకె మొత్తం వచ్చేస్తూంటుంది.
సమస్య అర్థం కావాలంటే ఈ క్రింది పంక్తిలో కేవలం “ఎస్వీ రంగారావు” అన్న పాఠ్యాన్ని ఎంచుకోండి.
తెలుగు వికీపీడియాలో ఎస్వీ రంగారావు వ్యాసంలో ఎస్వీ అంటే ఏంటో తెలుసుకోవచ్చు.
ఎంచుకోగలిగారా? కుదరడం లేదు కదా, అదీ సమస్య. ఈ సమస్యకి ఫైర్ఫాక్స్ జాల విహారిణిలో ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే: లంకె పాఠ్యాన్ని ఎంచుకోడానికి మూషికాన్ని లాగేటప్పుడు Alt మీటను నొక్కి పట్టుకోవడమే! తర్వాతి ఫైర్ఫాక్స్ సంచికలో (బహుశా వెర్షన్ 32 నుండి) ఆల్ట్ మీటను పట్టుకోనవసరం లేకుండా నేరుగానే లంకెల్లోని పాఠ్యాన్ని ఎంచుకోవడం సాధ్యమవుతూంది.
ఇతర జాల విహారిణుల్లో ఈ సౌలభ్యం ఉన్నట్టు లేదు. :-(
ఆనంద జాల విహారణం!
Ctrl+Alt వాడితే పనిచేస్తుంది, చూడండి.
విష్ణు గారూ, Alt ఒకటే సరిపోతుందని ఈ టపా సారాంశం. :-) (ఇది ప్రశ్న కాదు కాబట్టి, టపా శీర్షికను తగ్గట్టుగా మార్చాను.)
ఒకవేళ మీరు క్రోము, IEల కోసం చెప్పివుంటే, వాటిల్లో Ctrl+Alt కూడా పనిచేయడం లేదు.
టపాలో వివరించినట్టుగా Alt నొక్కి ప్రయత్నించాను కాని పని చేయటం లేదు. Ctrl+Alt నొక్కితే మీరు చేప్పినట్లు వీలవుతుంది. బహుశా నా ఫైర్ఫాక్స్ వర్షన్ వళ్ళ అయ్యి ఉండవచ్చనుకుంటా.