ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!

భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)

ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:
ఇన్‌స్క్రిప్ట్+, విస్తృత తెలుగు కీబోర్డు అమరిక


ఒకే మీట మీద ఉన్న పలు అక్షరాలు ఉన్నాయి కదా. వాటిని టైపు చెయ్యాంటే… Shift, AltGr వంటి మీటలతో కలిపి టైపుచెయ్యవచ్చు. ఇలా:
మీటపై అక్షరాల స్థాయిలు

ఉదాహరణ:

రూపాయి (₹) గుర్తునీ, ఌ గుణింతాన్నీ (కౢప్తం), సంస్కృతం కోసం దేవనాగరి శైలి కామా (।), ఫుల్‌స్టాప్ (॥) లనూ (డా॥ రాజశేఖర్), ఉచ్చారణను సూచించే ఉదాత్త (అ॒) అనుదాత్త (ఇ॑), సంధిచిహ్నంగా వాడే అవగ్రహం (ఇతోఽధికం, మనో౾వేదన) వంటి వాటన్నింటినీ టైపు చెయ్యవచ్చు.

మీ కంప్యూటర్లో ఉన్న తెలుగు ఖతిలో పై అన్ని అక్షరాలూ లేకపోవచ్చు. (లోహిత్ ఖతిని స్థాపించుకోమని నా సలహా.) నా కంప్యూటర్లో ఇలా కనిపిస్తుంది.
కొన్ని ప్రాచీన తెలుగు అక్షరాలు

వీటితో బాటుగా ప్రాచీన భిన్నాంక చిహ్నాలనూ టైపుచెయ్యవచ్చు. (లంకెను సూచించినందుతు షణ్ముఖన్ గారికి నెనర్లు.)

ఊఁ, ఇదంతా బానే ఉంది. కానీ… ఈ కీబోర్డు లేయవుటుని పొందడమెలా?

విండోస్ XP/విస్టా/7

  1. సెటప్ దస్త్రాన్ని దించుకోండి.
  2. ఈ ఫైలు నుండి దస్తాలను వెలికి తీసి te-insr అన్న సంచయం లోని setup.exe అన్న ఫైలుని నడపండి. (ఈ కీబోర్డు లేయవుటు మీ కంప్యూటరులో స్థాపితమవుతుంది.)
  3. ఆ తర్వాత ఇంగ్లీషు, తెలుగుల మధ్య మారడానికి Left Alt+Shift అన్న మీటద్వయాన్ని ఉపయోగించండి.

జాలంలో

మీ కంప్యూటర్లో ఏమీ స్థాపించుకోనవసరం లేకుండానే జాలంలో లేఖిని ఇన్‌స్క్రిప్ట్ ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. మీకు గుర్తుండి ఉంటే… సరిగ్గా సంవత్సరం క్రితం లేఖిని ఇన్‌స్క్రిప్ట్ విడుదలయ్యింది! అప్పుడు చెప్పిన లోపాలన్నింటినీ ఇప్పుడు పరిష్కరించాను.

లినక్స్

iBus కొరకు

  1. ibus-m17n అన్న ఉపకరణాన్ని (ఇప్పటికే లేకుంటే) స్థాపించుకోండి.
  2. te-inscriptplus.mim అన్న దస్త్రాన్ని దించుకోండి.
  3. దాన్ని /usr/share/m17n సంచయం లోనికి కాపీ చెయ్యండి.
  4. ఆ తర్వాత, iBusని పునఃప్రారంభించండి.
  5. iBus అభిరుచులలో నుండి Telugu InScript+ (m17n) అన్న పద్ధతిని ఎంచుకోండి.
  6. సంపూర్ణ తెలుగు టంకనాన్ని ఆనందించండి!

XKB కొరకు
te-inscriptplus దస్త్రాన్ని తెచ్చుకోండి. దీన్ని setxkbmap అన్న ఆదేశం ద్వారా నడుపుకోవచ్చు. ఈ దస్త్రాన్ని /usr/share/X11/xkb/symbols సంచయంలో ఉంచి rules/base.xml దస్త్రంలో తగిన మార్పులు చేస్తే, గ్నోమ్‌ కీబోర్డు ప్యానల్లో కనిపించాలి. కానీ ప్రస్తుతం దీన్ని గ్నోమ్ గుర్తించడం లేదు. తగిన పరిష్కారం దొరకగానే తెలియజేస్తాను, వేచివుండండి. పరిష్కారం దొరికింది. క్రింది సూచనలను పాఠించండి.

  1. te-inscriptplus దస్త్రాన్ని దించుకోండి.
  2. (రూటు లేదా సూడో ద్వారా) ఆ దస్త్రాన్ని /usr/share/X11/xkb/symbols సంచయం లోనికి కాపీ చేసుకోండి.
  3. (రూటు లేదా సూడో ద్వారా) /usr/share/X11/xkb/rules/evdev.xml అనే దస్త్రంలో ఈ క్రింది కోడుని “</layoutList> అనే పంక్తి పైన కాపీచేయండి:
    <layout>
      <configItem>
        <name>te-inscriptplus</name>
        <shortDescription>te</shortDescription>
        <description>Telugu (InScript+)</description>
    
        <languageList>
          <iso639Id>tel</iso639Id>
        </languageList>
      </configItem>
      <variant>
    
        <configItem>
          <name>basic</name>
          <description>Telugu (InScript+)</description>
          <languageList>
            <iso639Id>tel</iso639Id>
    
          </languageList>
        </configItem>
      </variant>
    </layout>
    
  4. ఆ తర్వాత xserverని పునఃప్రారంభించండి (లేదా ఒకసారి లాగ్-అవుట్ అయ్యి మళ్ళీ ప్రవేశించండి).

ఇన్‌స్క్రిప్ట్+ లేయవుటుని ఉపయోగించి చూడండి. సమస్యలను, లోపాలనూ నాకు తెలియజేయండి.

సంపూర్ణ తెలుగు టైపింగు కావాలనుకునే మీ బంధుమిత్రులకు దీని గురించి తెలియజేయండి.

ఆనంద తెలుగు టంకనం!

54 thoughts on “ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

  1. ఈ Inscript key board layout చాలా అసహజంగా ఉంది.
    ఉదాహరణకు ‘బ’ అనే అక్షరానికి keyboard పైన ఉన్న ‘Y’ అనే key ని కేటాయించారు. నాకైతే యేమీ నచ్చలేదు.
    ఇది మీరు చేసిన మార్పు కాకపోవచ్చు.
    మీరు ఇచ్చే IME లో customized keyboard layout కు అవకాశం ఉంటే బాగుంటుందని నా సూచన.

      1. మీ రన్నది చాలా నిజం. కాకపోతే కంప్యూటరు వాడే వాళ్ళలో అధికశాతం మంది ఈ ఇంగ్లీషు కీబోర్డుకు అలవాటుపడి ఉంటారు. కాబట్టి అందుచేత బకారాని వేలు ‘B’ దగ్గరకు పోవటం సహజం. వేరే కోబోర్డు అమరిక ఫోనోటిక్ గా మరీ తేడాగా ఉంటే అలవాటు పడటం కష్టం అవుతుందన్న ఉద్దేశంతో అలా అన్నాను. మరేమీ లేదు.

      1. అలాగా! చాలా సంతోషం అండీ. నేను యీ మైక్రోసాఫ్ట్ కీబోర్డు లేయవుట్ క్రియేటర్ను తప్పక ప్రయత్నిస్తాను. బహుధా కృతజ్ఞుడను.

  2. నమస్కారం వీవెన్ గారూ,
    నేను Ubuntu 11.10 వాడుతున్నాను. మీరు చెప్పినట్లు ౧.లోహిత్ ౨.iBus inscript+ ని సంస్థాపించాను.
    iBus-> Preferences->general-> custom font లో లోహిత్ తెలుగు ని ఎంచుకున్నాను కూడా.
    Right_Alt+Shit+F మీటలను కలిపి నొక్కితే, ఫైర్ఫాక్స్ లో Menu వస్తోంది, కానీ మీరు పొందుపరచిన కొత్త అక్షరాలు రావటం లేదు.
    వేరే ఏవైనా మార్పులు చేయాలా?

    1. iBus నడుస్తుందా? iBus input methodని Telugu (InScript+)కి మార్చిన తర్వాత తతిమా తెలుగు అక్షరాలు వస్తున్నాయా?

      పై రెండు ప్రశ్నలకూ జవాబు అవును అయితే, మీ ఉబుంటూలో AltGr లేదా 3వ స్థాయి మీట ఏమిటో చూడండి. మీ ఉబుంటులో Keyboard Layout Optionsకి వెళ్ళండి. అందులో Key to choose 3rd levelగా ఏ మీట ఉందో చూడండి. (ఉబుంటులో ఇక్కడకు వెళ్ళడమెలాగో ఖచ్చితంగా నాకు తెలియదు. బహుశా System > Preferences > Keyboard > Layouts > Options లేదా ప్యానల్లో కీబోర్డు లేయవుట్ ఇండికేటర్ పైన right-click చేసి అక్కడ వచ్చే Settings. లేదా System > Hardware > Keyboard > Layouts > Options కూడా కావచ్చు.)

      ఆవిధంగా మూడో స్థాయి మీటను (Right_Alt లేదా అక్కడ ఉన్న మీటలలో దేనినైనా) ఎంచుకుని, దాన్ని వాడుకోవచ్చు.

      1. చాలా thanks అండీ, ౩వ స్థాయి మీటని right alt కి మార్చిన తర్వాత అన్నీ పని చేస్తున్నాయండీ…

        కానీ, alt_g+shift+f మీటలను కలిపి వుపయోగిస్తే మీరు చెప్పినట్లు ‘ఓం’ రావటం లేదండీ, ఒకసారి చూడగలరు.

      2. ఓంకారం (ॐ) ఉన్నది x మీట పైన కదండీ!

        ఈ ॐ, ఉదాత్తోనుదాత్తాలూ (d, e మీటల మీదున్నవి) ibus దానిలో లేవు. ఇప్పుడు చేర్చాను. పైన చెప్పిన mim దస్త్రాన్ని కొత్తగా తెచ్చుకోండి.

      3. ఇప్పుడు అన్నీ వస్తున్నాయండీ…
        ౧. “ఉచ్చారణను సూచించే ఉదాత్త (అ॒) అనుదాత్త (ఇ॑), సంధిచిహ్నంగా వాడే అవగ్రహం (ఇతోఽధికం, మనో౾వేదన) వంటి వాటన్నింటినీ టైపు చెయ్యవచ్చు.”
        పై వాటి గురించి నాకు తెలియదండీ, వాటిని గూర్చి కాస్త చెప్తారా(ఏదైనా లంకె వున్నా ఇవ్వండి)?
        ౨. భిన్నాంకాల గురించి: http://www.eemaata.com/em/issues/200607/898.html
        ౩. ఒక హల్లు అచ్చుతో పూర్తయినప్పుడు దాని పక్కన మళ్ళీ గుణింతాలు రావటం అనవసరం కదండీ…
        అంటే కోో –> కో పూర్తయిన తర్వాత పొరపాటున ో (గుణింతం) వచ్చినా అది టైపు అవ్వకుండా చెయ్యటం కుదురుతుందా?

        Dne

      4. 1. అవగ్రహాల గురించి ఈ లంకెలో చూడండి. ఇక ఉదాత్త అనుదాత్తాలను సంస్కృత శ్లోకాలను వ్రాసేప్పుడు స్వరాల హెచ్చుతగ్గులను సూచించడానికి వాడతారని వారూవీరూ చెప్పగా విన్నదే. ఈ వికీపీడియా వ్యాసాన్ని చూడండి. వీటిని వాడిన తెలుగు పాఠ్యపు చిత్రం.

        2. లంకెకు నెనర్లండీ. టపాలో ప్రస్తావించాను.

        3. కుదరదండీ. ఇది మొద్దు కీబోర్డు లేయవుటు. ఏ మీటకి ఏ అక్షరం—దీనికి అంతే తెలుసు. తెలివి లేనిదిది.

  3. వీవెన్ గారూ ఇలాంటిది ఏదైనా android కి ఉంటే బావుంటుంది. ఆండ్రోయిడ్ లో ఇప్పటి దాకా తెలుగు చదవటం కుదరదు. :-(
    lohith fonts వాడి ఓ hack ఉంది కానీ వొత్తులు ఏమీ పనిచేయవు. something to do with glyphs support in Android.

    దాని మీద ఎవరికైనా ఏమైనా తెలుసా?

  4. హలో వివెన్ గారు, నేను తెలుగు డి.టి.పి వర్క్ చేస్తుంటాను. నేను ఇంతకు ముందు వరకూ తెలుగు అను స్క్రిప్ట్, యాపిల్ కీబోర్డ్ వాడే దాన్ని. అలాగే టైపింగ్ ని పేజ్ మేకర్ లో చేసేదాన్ని. ఇప్పుడు యాపిల్ కీబోర్డ్ ని విండోస్ ఎక్స్ పిలో లోడ్ చేసుకుని ఓపెన్ ఆఫీస్ లో టైపింగ్ చేస్తున్నాను. కాని ఇక్కడ కొన్నిసమస్యలను ఫేస్ చేస్తున్నాను. కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పడు కలిసిపోతున్నాయి మరియు ‘‘ ’’గుర్తులు, కామ, పులిస్టాప్ లు పదాలకు సంబంధం లేకుండా దూరంగా వస్తున్నాయి. పొల్లు తర్వాత ఇచ్చిన పదాలు ఒకదాని లో ఒకటి కలిసి పోతున్నాయి. ఉదా: ’ఎమోషన్స్ ని‘ రాయాలన్నప్పడు ఇలా ’ని‘ దూరంగా రాయాల్సి వస్తోంది. అంతేకాకుండా కొన్ని అక్షరాలు మిస్ అవుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలపండి. అలాగే బుక్ వర్క్ ని ఓపెన్ ఆఫీస్ లో చేసి ప్రింటింగ్ కి ఇస్తే పర్వాలేదా? పేజ్ మేకరే వాడాలా

    1. నరసింహ మూర్తి గారూ,

      ఉదాత్తానికి (అక్షరం క్రింద అడ్డ గీత) అయితే Right_Alt + d. అనుదాత్తానికి (అక్షరం పైన నిలువు గీత) అయితే Right_Alt + e.

      సవరణ (2012-04-29): కీబోర్డు షార్టుకట్లలో ఇంతకు ముందు తప్పుగా Shift కూడా ఇచ్చాను. ఇప్పుడు సవరించాను.

      1. వీవెన్ గారు,
        మీరు చెప్పినట్లుగా type చేస్తే ఉదాత్త అనుదాత్తములు రావటం లేదు.
        నరసింహ మూర్తి.

      2. మీరు ఇన్‌స్క్రిప్ట్+ను ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కంప్యూటర్లో ఉన్న తెలుగు ఫాంటు ఏమిటి? (మీ కంప్యూటర్లో ఈ ఉదాత్త అనుదాత్తాలను కలిగివున్న ఫాంటు లేదేమోనని నా సందేహం.) వీలుంటే, మీరు టైపించిన పాఠ్యాన్ని నాకు పంపించండి.

      3. వీవెన్ గారు,
        మీరు అడిగిన ప్రశ్నలు వాటి జవాబులు.
        ౧. మీరు ఇన్‌స్క్రిప్ట్+ను ఉపయోగిస్తున్నారా?
        నేను ఇన్‌స్క్రిప్ట్+ను (ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు మీరు ఇచ్చిన లింక్ ద్వారా te-insr download చేసుకుని) ఉపయోగిస్తున్నాను.
        ౨. అయితే, మీ కంప్యూటర్లో ఉన్న తెలుగు ఫాంటు ఏమిటి?
        మొత్తం ౩౧ తెలుగు ఫాంట్లు
        Akshar Unicode
        Akshar Unicode MS
        Code2000
        Gautami
        GIST-TOLTAmma
        GIST-TOLTAmruta
        GIST-TOLTAtreya
        GIST-TOLTCandana
        GIST-TOLTDeva
        GIST-TOLTDraupadi
        GIST-TOLTGolkonda
        GIST-TOLTKrishna
        GIST-TOLTManu
        GIST-TOLTMenaka
        GIST-TOLTPavani
        GIST-TOLTPriya
        GIST-TOLTRajan
        GIST-TOLTRajani
        GIST-TOLTSavjana
        GIST-TOLTSitara
        GIST-TOLTSwami
        GIST-TOLTVennela
        Lohit Telugu
        Potana 2000
        Ramaneeya
        RamaneeyaWin
        Sugun
        Sun-Extra
        Vajram
        Vani
        Vemana2000

        నేను Lohit Telugu ఖతి వాడినా కూడా ఉదాత్త, అనుదాత్తములు రావటము లేదు.
        క. నరసింహ మూర్తి.

      4. నరసింహ మూర్తి గారూ,

        పైన నేను చెప్పినవి తప్పు. వాటి బదులు ఉదాత్తానికి RightAlt + d మరియు అనుదాత్తానికి RightAlt + e లను ఉపయోగించి చూడండి.

        అయితే, మన తెలుగు ఖతులు ఏవీ ఈ ఉదాత్తానుదాత్త అక్షరాలకు రూపుని అందించడం లేదు. మీ విండోసులో ఉన్న హిందీ ఖతులలో (క్రింద సాగరు గారు చెప్పినట్టు) ఉండొచ్చు. లేదా, లోహిత్ దేవనాగరి ఖతిని దించుకొని చూడండి.

  5. వీవెన్ గారు,

    మీ ఈ ఇన్‌స్క్రిప్ట్+ చాలా ఉపయోగకారిగా ఉంది. దీనిని రూపొందించిన మీకు నా ధన్యవాదాలు.

    నేనూ ఈ ఇన్‌స్క్రిప్ట్+ ప్రతిష్ఠించి ఈ ఉదాత్త, అనుదాత్తములు టైపు చేయడానికి ప్రయత్నించాను. MS Word లో RightAlt + e తో ఉదాత్తము ( ॑ ) వచ్చింది కాని అది Mangal అనే దేవనాగరి ఖతిది.

    తెలుగు యూనికోడ్ స్టాండర్డ్ 6.1 లో ఈ ఉదాత్త, అనుదాత్తములు లేవు. దేవనాగరి లో 951, 952 స్థానాల్లో ఉన్నాయి. పూర్ణవిరామం, దీర్ఘవిరామం(DANDA, DOUBLE DANDA) లలాగా ఇవి ఇంకా జనరిక్ కాలేదు. కనుక తెలుగు ఖతులలో ఇవి చేర్చి వుండడానికి ఆస్కారం తక్కువ. ఈ ఉదాత్త, అనుదాత్తములు వ్రాయడానికి మీరు ఏ ఖతిని వాడుతున్నారో తెలుప గలరు.

    కొస మెరుపు: ఈ వెబ్ పుటలోని సమాచారాన్ని ఉపయోగించుకొని ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు కి సి-డాక్ వారి Enhanced INSCRIPT keyboard layout 5.2 పిడిఫ్ దస్త్రం లో చూపినట్లుగా(కీ స్థానం) కీ-లను జోడించి విస్త్రుత ఇన్‌స్క్రిప్టు కీబోర్డు తయారు చేసుకో గలిగాను. దీనికి మీకు నా ధన్యవాదాలు

    ఇట్లు,

    సాగరు.

    1. సాగరు గారూ సమాచారానికి కృతజ్ఞతలు. నా కంప్యూటర్లో ఈ ఉదాత్తానుదాత్తాలు లోహిత్ దేవనాగరి ఖతి నుండి ప్రదర్శితమవుతూండవచ్చు. (పైన వ్యాఖ్యలో లంకె ఇచ్చాను, దించుకోండి.).

      మీరు తయారుచేసిన కీబోర్డు భౌతికమా, లేక కంప్యూటర్లలో టైపు చెయ్యగలిగే పరికరమా?

      1. వీవెన్ గారు,

        అది మృదుసామాగ్రి మాత్రమే. మైక్రోసాఫ్టు కీబోర్డ్ లేయవుట్ క్రియేటర్ ని ఉపయోగించి చేసుకున్నాను.

        ఇట్లు,
        సాగరు.

  6. హలో వివెన్ గారు మేము బుక్ వర్క్ చేస్తుంటాం. దానికి సరిపడే ఫాంట్స్ ఏవో మాకు సరిగ్గా తెలియడం లేదు. మేము ప్రస్తుతానికి గౌతమి, లోహిత్, రమణీయ ఫాంట్స్ వాడుతున్నాము. అవి చూడటానికి గుండ్రంగా, అందంగా అనిపించడం లేదు. ఇంకా కొన్ని జిస్ట్ ఫాంట్స్ వాడుతున్నాము. వాటిలో మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావి డీఫాల్ట్ ఫాంట్స్ మంగళ, గౌతమిని తీసేసుకుంటున్నాయి. ప్లీజ్ మా వర్క్ కు సరిపడే ఫాంట్స్ చెప్పండి.

  7. నేను apple telugu keybord layout వాడుతున్నాను. దానిలో కొన్ని పదాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. ఉదా: వర్క్ కు, ఫాంట్స్ ను అని రాసేటప్స్తుడు కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు ‘కు, ను’ రాయాల్సి వస్తోంది. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పదాలను కలపడం కోసం inscript layout ని ఉపయోగించాల్సి వస్తోంది.

    మరొక సమస్య apple telugu keybord layoutలో కొన్ని అక్షరాలు పనిచెయ్వడం లేదు. దీని వలన కొన్ని పదాలను టైప్ చెయ్యలేకపోతున్నాను. ఉదా: ‘ఙ, ఞ’., వీటి కోసం నేను inscript layout ని ఉపయోగించాల్సి వస్తోంది. ఈ పై సమస్యల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి వీటకి పరిష్కారాన్ని చెప్పండి.

    1. పొల్లు మరియు తర్వాత అక్షరం కలిసిపోకుండా ఉండటానికి కావల్సిన కనిపించని అక్షరం (ZWNJ) నేను ఇంత క్రితం తయారు చేసిన ఆపిల్ లేయవుటులో లేదు. ఈ అక్షరాన్ని చేర్చిన కొత్త లేయవుటుని ఈ లంకె నుండి దించుకోండి (దీన్ని స్థాపించుకునే ముందు మీ కంప్యూటర్లో ఉన్న ఆపిల్ లేయవుటుని uninstall చేసుకోవాలి).

      ఇక కోసం Right Alt + R, కోసం Right Alt + T లను ఉపయోగించండి.

      1. మీరు పంపిన కొత్త లంకెను install చేసాను, అయినా కూడా అక్షరాలు కలిసిపోతున్నాయి సార్. దీనికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా?

  8. మీరు తయారు చేసిన ఈ ఇన్‌స్క్రిప్ట్+ కీబోర్డ్‌ని అనూ స్క్రిప్ట్ మేనేజరు 7 లో పెట్టుకోగలమా, ఏ విధంగా? తెలియజేయగలరు.
    2. వర్డ్ 2010 లో ఉదాత్త అనుదాత్తాలు ఏ ఖతితోను రావడం లేదు.

    1. ఈ ఇన్‌స్క్రిప్ట్+ కీబోర్డు స్వతంత్రమైనది. దీన్ని నేరుగా అనూ స్క్రిప్ట్ మేనేజరులో పెట్టుకోలేరు. అనూ లోని DOE చాలా వరకూ ఇలానే ఉంటుంది. ఈ కొత్త అక్షరాలను చేర్చమని అనూ వాళ్ళని అడిగి చూడండి.

      ఉద్దాత్త అనుదాత్తాలు కనబడకపోవడం గురించి, మీ కంప్యూటర్లో ఉన్న ఏ ఖతిలోనూ ఈ అక్షరాలకు తగిన చిహ్నాలు ఉండివుండవు.

    1. సుజల గారూ, తెలుగు టైపింగు నేర్చుకోడానికి ఇన్‌స్క్రిప్ట్ లేయవుటుని నేను సిఫారసు చేస్తాను. ఆ లేయవుటును చూస్తూ ప్రాక్టీసు చెయ్యండి. లేకపోతే మీటల మీద తెలుగు అక్షరాలు ఉన్న సురవర కీబోర్డును కొనుక్కోండి.

  9. వీవెన్ గారికి నమస్సులు,
    నా పేరు శ్రీనివాసుడు. నేనొక అనువాదకుడిని.
    ముందుగా తెలుగు పలుకుకు మీరు చేస్తున్న సేవలకు నెనర్లు. మీ చిట్కాలు ప్రయోగించి విజయవంతంగా apple key board layout ను, MS office లో తెలుగును స్థాపించుకోగలిగాను. కాని కొన్ని సమస్యలు మిగిలిపోయాయి. వివరిస్తాను.
    నా సమస్యలు
    నా OS Wnidows Xp3
    నేను వాడాలనుకుంటున్న మరియు MS office లో పనిచేయని ఖతులు Shreetel, TL_TTF Hemalatha, TL_TTF Harsha priya. పనిచేస్తున్న ఖతులు goutami, potana, ramabhadra and all unicode fonts. కాని Ariel Unicode MS పనిచేస్తున్నది – దీర్ఘాలు, కొమ్ములు, విడిగా వస్తున్నాయి.
    నేను వాడాలనుకుంటున్న మరియు Adobe Page maker లో పనిచేయని ఖతులు Shreetel, TL_TTF Hemalatha, TL_TTF Harsha priya. మరియు goutami, potana, ramabhadra and all unicode fonts కూడా పనిచేయడం లేదు.
    ఈ ఖతుల ఉపయోగించి నేనే టంకించే విధంగా యేం చేయాలో చెప్పగలరు.
    ఇంకా COREL, Indesign లలో పనిచేసే ఖతుల వివరాలు, వాటి స్థాపనను తెలియజేయగలరు.
    నెనరులతో
    శ్రీనివాసుడు

    1. శ్రీనివాసులు గారూ,

      నా యూనికోడ్ ఆపిల్ కీబోర్డు లేయవుటు మీకు ఉపయోగపడినందుకు సంతోషం. ఇక మీ సమస్యలకు సమాధానాలు:

      1. Shreetel, TL_TTF Hemalatha, TL_TTF Harsha priya అనేవి యూనికోడ్ ఖతులు కాదు. కనుక అవి నేను రూపొందిన ఆపిల్ లేయవుటుతో పనిచెయ్యవు. వాటి కోసం మీరు శ్రీలిపివారి టైపింగు టూలును వాడాల్సివుంటుంది.

      2. ఏరియల్ యూనికోడ్ ఎమ్మెస్ అనేది యూనికోడ్ ఖతే, కానీ దానీలో గుణింతాలకూ ఒత్తులకూ తోడ్పాటు లేదు. కనుక అది ప్రస్తుతానికి నిరుపయోగమే.

      3. అడోబీ పేజీమేకర్‌లో తెలుగు యూనికోడ్ ఖతులకు తోడ్పాటు లేదు కనుక పనిచెయ్యవు. పేజీమేకర్‌కు కొత్త సంచిక అయిన InDesignలో యూనికోడ్ ఖతులను ఉపయోగించుకోవచ్చు.

      4. కోరల్ డ్రా కొత్త సంచిక X9 లో యూనికోడ్ ఖతులకు తోడ్పాటు ఉందని విన్నాను (అంటే గౌతమీ, పోతన, రామభద్ర, పొన్నాల వంటివి పనిచెయ్యాలి), ప్రయత్నించి చూడండి.

  10. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈనాడు వెబ్‌సైటులోని ఫాంట్లు కనపడుతున్నాయి.
    కాని బ్లాగుల్లోని యూనికోడ్ ఫాంట్లు కనపడటంలేదు.
    గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో రూటింగ్ చెయ్యాలని, దానివల్ల ఫోను వారంటీ పోతుందని తెలిసింది.
    దీనికి పరిష్కారం ఏమైనా ఉందా?

    1. ముందుగా మీ ఫోను లోని ఆండ్రాయిడ్‌ను ఫోను తయారీదారు అందిస్తున్న సరికొత్త ఆండ్రాయిడ్ సంచికకు నవీకరించుకోండి. భారతదేశంలో ప్రస్తుతం లభించే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక తెలుగు ఖతిని అందిస్తున్నారని విన్నాను. కనుక కొత్త ఫోన్లలో నేరుగా తెలుగు కనిపిస్తుంది. ఇక మీ ఆండ్రాయిడ్ సంచికను నవీకరించుకునే వరకూ ఓపెరా మినీ అనే విహారిణిని ఉపయోగించండి. అందుకు సూచనలు ఇక్కడ ఉన్నాయి.

    1. “కుర్” అని టైపు చేసిన తర్వాత Ctrl+Shift+2 లేదా Right Alt+2 అన్న మీటలను నొక్కండి. ఆ తర్వాత “కురే” టైపు చెయ్యండి.

      పైన చెప్పిన కీబోర్డు షార్టుకట్లు కంటికి కనబడని Zero Width Non Joiner (ZWNJ) అనే సంకేతాన్ని చేరుస్తాయి. అందువల్ల పొల్లు తర్వాత వచ్చే హల్లు ఒత్తుగా మారదు.

  11. వీవన్‌గారు, తెలుగు ఖతి గౌతమ్ టైపు చేసినప్పుడు ఉదాత్తము టైపు Rt Alt e టైపు చేసినప్పుడు అక్షరము నుండి వేరుగా ఉంటుంది. కాని ఉదాహరణకు ప్రియతమ॑మం ప్రియాణా॑॑ం అని టైపు అవుతుంది, మరియు రెండు ఉదాత్తములు కలిసి ఉండాలి.
    దయచేసి వివరించగలరు.

    1. అవునండీ, ఇప్పుడు నాకూ విడిపోయే వస్తున్నాయి. ఇంతకు మునుపు వెనుక అక్షరంతో కలిసిపోయేవి. బహుశా, ఫాంట్లలో మార్పుల్లో ఇవి పోయి ఉండొచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని ఆయా ఖతుల తయారీదార్లకు నివేదించాలి. ఇప్పటికిప్పుడు పరిష్కారం ఏమీ లేదు.

  12. వీవన్ గారూ, నమస్కారము. ర్బ్ర అని టైప్ చేయాలి అంటే గౌతమి యూనికోడ్ ఫాంట్లో కరెక్టుగా వస్తోంది. కాని రామభద్ర ఫాంటులో తప్పుగా వస్తోంది. ర వత్తు మధ్యలో వస్తోంది. దీనిని ఎలా టైప్ చేయాలి

    1. నేను కూడా ఈ సమస్య ఎదుర్కున్నాను. అది ట్రూటైప్ ఫాంట్ లో అలా వస్తోంది. తెలుగుఫాంట్స్.ఇన్ కు వెళ్ళి రిజిష్టర్ అయి మల్లన్న, కృష్ణదేవరాయ, రామభద్ర ఫాంట్స్ డౌన్ లోడ్ చేసుకుని పాత వాటిని రీప్లేస్ చేయండి. సరిపోతుంది.

  13. నేను కూడా ఈ సమస్య ఎదుర్కున్నాను. అది ట్రూటైప్ ఫాంట్ లో అలా వస్తోంది. తెలుగుఫాంట్స్.ఇన్ కు వెళ్ళి రిజిష్టర్ అయి మల్లన్న, కృష్ణదేవరాయ, రామభద్ర ఫాంట్స్ డౌన్ లోడ్ చేసుకుని పాత వాటిని రీప్లేస్ చేయండి. సరిపోతుంది.

Leave a reply to వీవెన్ స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.