మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక

పోయిన నెలాఖరులో సిలికాన్ వ్యాలీలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశపు ప్రారంభ సదస్సు యొక్క నివేదిక ఇది. నివేదికకు వెళ్ళేముందు రెండు ప్రశ్నలకు సమాధానాలు:

  • అమెరికాలో ఎందుకు? సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక రంగానికి ప్రధాన కేంద్రం. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నదీ ఇక్కడే. తెలుగు కోసం లేదా తెలుగు వారి కోసం వీరు చేసింది తక్కువే. వీరి దృష్టిని ఆకర్షించడం అన్నది ఈ సామావేశాన్ని అక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం. ఇక్కడి వదాన్యుల నుండి వివిధ చేపట్లకు నిధుల/విరాళాల సేకరణ మరో కారణం.
  • ‘తెలుగు అంతర్జాల’ అన్న పేరెందుకు? తెలుగు సంగణన గురించి అన్ని విషయాలనూ స్పృషించే ఈ సమావేశానికి పరిమితార్థాన్నిచ్చే అంతర్జాల సమావేశం అన్న పేరు ఎందుకు అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేసారు. ఇదీ ఆలోచన: ఇప్పుడంతా జాలమే. అన్ని రకాల ఉపకరణాలూ (క్లిష్టమైన ఫొటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగులతో సహా) జాల సేవలుగా మారిపోతున్నాయి. వివిధ సేవల భారీతనాన్ని సూచిండానికి ఇప్పుడు ఆంగ్లంలో web-scale అని వ్యవహరిస్తున్నారు. ఎలాగూ పూర్తిస్థాయిలో తెలుగు సంగణన సిద్ధమయితేనే జాలంలో తెలుగు సంపూర్ణమవుతుంది. కనుక అంతర్జాలం అన్నది విస్త్రుతార్థకమే.

ఇక ప్రారంభ సదస్సు నివేదిక.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీతాలాపనతో ప్రారంభ సభ మొదలయ్యింది. ఆ తర్వాత ఈ ప్రారంభసదస్సుకి మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేసారు. మనకన్నా తక్కువ జనాభా గల భాషలు కంప్యూటరీకరణలో ముందున్నాయని అన్నారు. తెలుగు పదకోశాలను రూపొందించాలని, తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఒక సంస్థని స్థాపించాలని అన్నారు. తెలుగు భాషను నిలబెట్టుకోడానికి అమెరికా లోని తెలుగు వారు చేస్తున్న కృషిని కొనియాడారు.

ఆతర్వాత సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ స్వాగతోపన్యాసం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను 120 మిలియన్ల (అంటే 12 కోట్ల) మంది మాట్లాడుతున్నారనీ, వీరిలో దాదాపు 8 కోట్ల మంది మొబైలు ఫోన్లను ఉపయోగిస్తున్నారనీ అన్నారు. కానీ ఇప్పటికీ తెలుగులో SMS లను పంపించుకోలేకపోవడం శోచనీయమనీ అన్నారు. విద్యావేత్తలను, పరిశోధకులను, ప్రభుత్వాన్ని, వ్యాపారసంస్థలనూ, ఔత్సాహికలను, మరియు భాషాభిమానులను ఒక చోటికి చేర్చి తెలుగు సంగణనలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న కృషిని తెలుసుకోవడం, వీరందరి మధ్య సమిష్టి కృషికి, సమన్వయానికి గల అవకాశాలను వెతకడం, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలను గుర్తించడం అన్నవి ఈ సమావేశ ముఖ్యోద్దేశాలుగా వివరించారు. వివిధ రంగాల కృషిని మనం సరిగ్గా వినియోగించుకుంటే తెలుగు సంబంధిత ఆర్థిక, వ్యాపార అవకాశాలు పెరుగుతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సమాచార శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రారంభ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఐటీ రంగంలో ఉన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు భారతీయులనీ, ప్రతీ ముగ్గురు భారతీయులలో ఒకరు తెలుగు వారనీ అన్నారు. కార్యాలయాలలో ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాలలో కాగితపు వినిమయం తగ్గాలనీ, కంప్యూటరీకరణ స్థానిక భాషలలో జరిగితే సామాన్య ప్రజలకు వేగవంతమైన సేవలు అందడంతో బాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సిలికానాంధ్ర సంయుక్తంగా ఏర్పరిచిన “విశ్వ తెలుగు అంతర్జాల వేదిక” (GIFT) యొక్క కార్యకలాపాలలో భాగంగా తలపెట్టిన తెలుగు యూనికోడ్ ఫాంట్ల కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా ఒక ఫాంటు తయారి ఖర్చును విరాళంగా అందిస్తానని తెలిపారు. ఐటీ రంగంలో చిన్న కంపెనీల ప్రోత్సాహానికి పన్నులలో 10% తగ్గింపును ప్రకటిస్తామని, నిరాటంకంగా వారి కార్యకలాపాలు సాగడానికి ESMA చట్టాన్ని వర్తింపజేస్తామని, విద్యుత్ కోత లేకుండా చూస్తామనీ అన్నారు. మాధాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలే కాకుండా మరో ప్రాంతాన్ని ఐటీ అభివృద్ధికి కేటాయిస్తామనీ ఈ మూడు ప్రాంతాలను అనుసంధానిస్తామనీ అన్నారు. వరంగల్, రాజమండ్రి వంటి రెండవ శ్రేణి పట్టణాలలో కూడా ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ ఐదారేళ్ళ క్రితం వరకూ తెలుగు తన జీవితకాలంలోనే మరణిస్తుందన్న భయం ఉండేదని, కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన తెలుగు భాషా చైతన్య యాత్ర మరియు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వంటి కార్యక్రమాలతో ఆ భయం పోయిందన్నారు. మన భాష తతిమా వాటికి తీసిపోదనీ, సాంకేతిక ఉపకరణాలన్నీ తెలుగులోనూ లభ్యమవాలనీ అన్నారు.

రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ తెలుగు తన మాతృ భాష కాదనీ, ఇరవై ఏళ్ళుగా అంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నందుకు తెలుగు తన కర్మభాష అయిందని అన్నారు. యూనికోడ్ కన్సార్టియంలో ప్రభుత్వ సంస్థలకు సంబంధించినంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే పూర్తిస్థాయి సభ్యురాలని అన్నారు. మొదటి దశలో 6 తెలుగు యూనికోడ్ ఫాంట్లను రూపొందించి ఉచితంగా అందిస్తామని, వివిధ సాఫ్ట్‌వేర్లలో, మొబైళ్ళలో వీటికి కంపాటబిలిటీ ఉండేలా చూస్తామనీ అన్నారు. మరిన్ని తెలుగు ఫాంట్ల తయారీకి విరాళాలివ్వాలని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

టీవీ9 ముఖ్య కార్యనిర్వహణ అధికారి రవి ప్రకాశ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సంస్కృతులు కనుమరుగయ్యే పరిస్థితి ఉందనీ ఇక్కడ ‘మన బడి’ పిల్లలు తెలుగులో మాట్లాడటం చూస్తూంటే ఆనందంగా ఉందని అన్నారు. మాతృభాషలో కార్యకలాపాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఐటీ శాఖ చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల తన అభినందనలను తెలియజేసారు. SMSలు కూడా తెలుగులో పంపించుకోలేని దౌర్భాగ్య స్థితి నుండి బయటపడాలని సూచించారు.

హిందీ అకాడమీ అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాల్లో తనది అర్ధజ్ఞానమనీ కానీ మంత్రి గారిది అర్థజ్ఞానమనీ చమత్కరించారు. మూగ ప్రజలు బధిర ప్రభుత్వం ఉంటే అసలు ఏ పనులు జరగవనీ ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం ఈమధ్య కాలంలో అరుదైన సంఘటన అని అన్నారు. ప్రాచీన హోదాను గుర్తు చేస్తూ “అమ్మకు పట్టు చీరలు తెచ్చాం కానీ అమ్మ మరణశయ్య మీద ఉంది” అని వాపోయారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా పత్రికాధిపతులు చాలా అనుకూలంగా స్పందించారనీ, ఈ సదస్సుకీ ఈనాడు నుండి మానుకొండ నాగేశ్వరరావు, ఆంధ్రప్రభ సంపాదకులు విజయబాబు, మరియు టీవీ9 ముఖ్యకార్యనిర్వహణాధికారి రవి ప్రకాశ్ తదితరులు హజరవ్వడం ఆనందంగా ఉందనీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్డ్ నెట్‌వర్కింగ్ (APSFKN) ముఖ్యకార్యనిర్వణాధికారి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ తన పిల్లలు తెలుగు భాషా సంస్కృతులకు దూరమవ్వకూడదని 2006లో ఆమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చేసాననీ ఇప్పుడే ‘మన బడి’ ఉంటే అన నిర్ణయం మరోలా ఉండేదనీ అన్నారు. ఫాంట్లు తదితర తెలుగు సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు కోటి రూపాయల వరకు విడుదల చేసామని అన్నారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటని ఆర్థిక శాఖ వారు ప్రశ్న వేసారని మనం రాబోయో పదేళ్ళకు కార్యక్రమాలను రూపొందిచుకోవాలని అన్నారు. తెలుగులో కూడా ఉద్యోగావకాశాల సృష్టికి ఈ సాంకేతిక అభివృద్ధి ద్వారా కృషిచేయాలని ఆయన సూచించారు.

టోక్యో విశ్వవిద్యాలయం ఆచార్యులు పేరి భాస్కరరావు మాట్లాడుతూ తెలుగుని జాలం లోనికి తీసువచ్చి దాన్ని ప్రపంచ వ్యాపంగా ఉన్న అన్ని మాండలికాల/యాసల తెలుగు వారికీ అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. ఫాంట్లు, పదకోశాలు, వ్యాకరణం, తదితర అంశాలలో జరగాల్సిన కృషిని వివరించారు.

ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఉమామహేశ్వరరావు ఈ ప్రారంభ సదస్సుకు ముఖ్య అతిథి, యూనికోడ్ కన్సార్టియం ఉపాధ్యక్షురాలు, యూనికోడ్ సాంకేతిక కమిటీ చైర్ లీసా మూర్ని పరిచయం చేసారు.

ముఖ్య అతిథి లీసా మూర్ యూనికోడ్ ప్రమాణంలో భారతీయ భాషల నిర్మాణాకృతి గురించి, ప్రస్తుత తోడ్పాటు గురించి, మరియు రాబోయే మార్పుల గురించి వివరించారు. యూనికోడ్ 6.0లో 19 భారతీయ లిపులు ఉన్నాయని, వైదిక లిపి కోసం కావాల్సిన గుర్తులను చేరుస్తున్నామీ చెప్పారు. యూనికోడ్ సైటులో భారతీయ లిపులపై 8 సాంకేతిక పత్రాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం క్రియాశీలంగా పనిజరుగుతున్న CLDR గురించి ఆవిడ వివరించారు. దీనికి తోడ్పడేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని, యూనికోడ్ సైటులోని తరచూ అడిగే ప్రశ్నలను తెలుగు లోనికి అనువందించాలని ఆవిడ సదస్యులకు సూచించారు. రూపాయి కొత్త గుర్తును యూనికోడ్ ప్రమాణంలో చేర్చడానికి అత్యంత తక్కువ సమయం తీసుకున్నామని ఆవిడ చెప్పారు (జూలై 20న ప్రతిపాదన వస్తే, దాన్ని ఆగస్టు 10 కల్లా ఆమోదించారనీ, అక్టోబరు 11కి ప్రమాణంలో విడుదల చేసామనీ చెప్పారు).

ఈ సందర్భంగా ఈ సమావేశాలలో ప్రదర్శనకు సమర్పించిన పత్రాలతో కూడిన ప్రత్యేక సంచిక సుజనరంజనిని కూడా విడుదల చేసారు.

ఆవిధంగా ప్రారంభ సదస్సు ముగిసింది. మధ్యాహ్న భోజనం తర్వాత సాంకేతిక సదస్సులు మొదలయ్యాయి. వాటిపై నా నివేదిక మరో టపాలో.

ప్రకటనలు

5 thoughts on “మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక

  1. వీవెన్ గారూ,
    మీ ప్రారంభ సదస్సు నివేదిక బాగుంది. సాంకేతిక సదస్సు నివేదిక కోసం ఎదురు చూస్తున్నాను. మీ లేఖిని ఇన్ స్క్రిప్ట్ ఈ రోజే చూసాను. చాలా ఉపయోగం గా ఉంది. దీనిని ’వర్చువల్ కీబోర్డ్’ గా మారిస్తే బాగుంటుందేమో నని అనిపించింది. క్షమించండి. మార్చడానికి సాంకేతికంగా ఎంత డిఫికల్టి లెవెల్ వుంటుందో నాకు తెలియదు. ఇక్కడ సందర్భం లేని విషయాన్ని చర్చించినందుకు మరలా క్షమించాలి.

    1. సునీత గారూ సాంకేతిక సదస్సుల వివరాలు ఇప్పటి వరకూ రాయలేకపోయాను. బద్దకించడానికి ఒక కారణం వాటిని ఇప్పటికే క్లుప్త రూపంలో నా ఐడెంటికాలో ప్రచురించాను. (అది 3వ పేజీ, క్రింది నుండి పైకి చదువుకోండి. ఆ తర్వాత రెండవ పేజీకి వెళ్ళండి.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.