మీరు తెలుగు వికీపిడీయాకి వెళ్తే, వ్యాసాలు మాత్రమే కాక తతిమా సైటు అంతా తెలుగులోనే కనిపిస్తుంది. అలా సైటు మొత్తాన్నీ తెలుగులోనికి తీసుకువచ్చే ప్రక్రియని స్థానికీకరణ అంటారు. ఈ విషయంపై అవగాహనకు మీడియావికీ స్థానికీకరణ గురించిన ఈ స్వబోధక ప్రదర్శనని చూడండి:
దానిలో చెప్పినట్టుగా మీడియావికీ (అంటే వికీపిడియా వెనకవున్న ఉపకరణం) యొక్క స్థానికీకరణ translatewiki.net వద్ద జరుగుతుంది. అక్కడ అదొక్కటే కాకుండా, స్టేటస్.నెట్, ఓపెన్స్ట్రీట్మ్యాప్, వికియా, వికీరీడర్, షపడూ వంటి మరెన్నో ఉపకరణాల స్థానికీకరణ కూడా జరుగుతుంది. వీటన్నింటినీ తెలుగులో అందుబాటులో తీసుకురావడానికి ట్రాన్స్లేట్వికీ.నెట్ సైటులో నమోదయి అనువాదాలు చేయండి.
మీరు మీడియావికీని అనువదిస్తే, తెలుగు వికీపీడియా, విక్షనరీ వంటి వికీ ప్రాజెక్టులతో బాటు, తెలుగుపదం వంటి సైట్లు కూడా ఆ అనువాదాలతో లాభపడతాయి. స్టేటస్నెట్ ఉపకరణాన్ని అనువదిస్తే, etelugu.status.net, veeven.status.net, koodali.status.net, కేక వంటి సేవలు పూర్తిగా తెలుగులో అందుబాటులోకి వస్తాయి.
మిమ్నల్ని మరికాస్త ఊరించడానికి: ట్రాన్స్లేట్వికీ.నెట్ ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం ఒక అనువాద ర్యాలీ నడుస్తుంది. దాని ప్రకారం, ట్రాన్స్లేట్వికీ సైటులో మీరు గనక ఏప్రిల్ 23 2011 00:00 UTC నుండి ఏప్రిల్ 30 2011 24:00 UTC (భారత సమయం ప్రకారం శనివారం, ఏప్రిల్ 23 2011, ఉదయం 5:30 నుండి ఆదివారం, మే 01, 2011 ఉదయం 5:30 వరకు) మధ్య కాలంలో 500 అనువాదాలను పూర్తిచేస్తే, € 1,000 లలో భాగం పొందుతారు. మరిన్ని వివరాలు.
మరింకెందుకాలస్యం, ఆ ర్యాలీ సమయం మొదలయ్యే లోపు కొన్ని అనువాదాలు చేసి కాస్త అనుభవం సంపాదించి తయారుగా ఉండండి.
ఆనంద స్థానికీకరణం!