తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక

ఈ శనివారం హైదరాబాదు లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో జరిగిన తెలుగు అంతర్జాల సదస్సు గురించి మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. ఆ సదస్సుపై నా నివేదిక ఇది. ఇది అసంపూర్ణమే. ఆ ఆనందోత్సాహలూ ప్రేరణా ఈ టపాలో ప్రతిబింబించకపోవచ్చు.

ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సౌజన్యంతో సిలికానాంధ్ర నిర్వహించింది. ఈ సదస్సులో రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యగారు ముఖ్య అతిథిగానూ, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ గారు అధ్యక్షలుగానూ పాల్గొన్నారు.

స్వాగత-, అతిధి-, అధ్యక్ష- ఉపన్యాసాలు అయ్యాకా ముఖ్య ప్రదర్శన/ప్రసంగాలు మొదలయ్యాయి. ఇవీ వాటి వివరాలు:

  1. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు గారు తెలుగులో రావాల్సిన వివిధ సాంకేతికతల గురించి వివరించారు.
    • కొత్త అంశం: మాండలిక పరివర్తనం. పాఠ్యాన్ని/వాచ్యాన్ని ఒకే భాష లోని వివిధ మాండలికాల మధ్య మార్పిడి.
  2. ఆచార్య పేరి భాస్కరరావు గారు పాఠ్యం నుండి వాచ్యం మరియు వాచ్యం నుండి పాఠ్యం వంటి ఆంశాలలో తను చేస్తున్న కృషి గురించి వారు పరిష్కరిస్తున్న సమస్యలను వివరించారు.
    • కొత్త పదాలు: అధిపాఠం (hypertext), అధిమాధ్యమం (hyper media), స్తరం/స్తరాలు (?)
    • ఇది పిల్లా లేక పిల్లా? అన్న దానిని ‘పాఠ్యం నుండి వాచ్యం’లో వచ్చే సమస్యలకి ఉదాహరణగా చెప్పారు. మొదటి ‘పిల్లా’ అన్నది ‘పిల్లి+యా’ అన్నమాట. ఈ పాఠ్యంలో ‘పిల్లా’ అన్న దాన్ని వ్యాచంలో రెండు రకాలగా ఉచ్చరించడమన్నది సమస్య. రాతలో ఇలాంటి సమస్యని అధిగమించడానికి అక్షరంపై ప్రాచీన గ్రంథాల్లో ఏటవాలు గుర్తుని ఉపయోగించారు. ఇదే సమస్య బ్యాంకు వంటి పదాల్లో కూడా వస్తుంది. దీన్ని మేషస్వరం అంటూ తాడేపల్లి గారు ఒక రూపాన్ని ప్రతిపాదించారు. (ఈ మేషస్వర అక్షర రూపాన్ని వారి కలగూరగంప బ్లాగులో కుడివైపున చూడవచ్చు.)
  3. చెవల అర్జునరావు గారు తెలుగు లినక్స్ (స్వేచ్ఛ లినక్స్, డెబియన్ మరియు ఉబుంటు) కొరకు జరిగిన కృషి మరియు ఫైర్‌ఫాక్స్, ఓపెన్‌ఆఫీస్, లిబ్రెఆఫీస్ స్థానికీకరణల గురించి వివరించారు.
  4. వి. వెంకటరమణ గారు తొంభైల నుండీ కంప్యూటర్లలో తెలుగు తీరుతెన్నులని వివరించారు. కొన్ని ప్రభుత్వ తెలుగు జాలగూళ్ళ వెనుక వీరు కృషి కూడా ఉందని చెప్పారు. అయితే వీరు యూనికోడ్ రాక పూర్వం వివిధ పనిముట్లూ పద్ధతులతో ఎలా తెలుగులో పత్రాలు జాలగూళ్ళు వంటివి చేసారో వివరించారు. యూనికోడ్ వచ్చాకా అవన్నీ సులభమయ్యాయి అని వారు చెప్పినా, ఆయన ప్రాధమికంగా ఐలీపు లోనే పనిచేసి దాన్ని యానికోడు లోనికి మార్చి పత్రాలకు/మెయిళ్ళకు ఉపయోగిస్తున్నట్లున్నారు.
  5. రామకృష్ణారెడ్డి మరియు కృష్ణబాబు గార్లు ఫెడోరా, రెడ్‌హాట్ లినక్సు పంపిణీలు, వాటిలో తెలుగు మరియు ఇతర భారతీయ భాషలకై జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలు, స్థానికీకరణ విశేషాలను తెలియజెప్పారు.
    • ఆసక్తికర అంశం: లోహిత్ ఖతి రూపాన్ని రెడ్‌హాట్ ఐదు కోట్లకు కొందంట. (లోహిత్ ఖతి ఇప్పుడు అందరికీ స్వేచ్ఛగా ఉచితంగా లభిస్తుంది. నెనర్లు రెడ్‌హాట్!)
  6. వాచ్య తెలుగు నుండి పాఠ్యాన్ని తయారుచేయడం, పాఠ్యం నుండి వాచ్యం, తెలుగు OCR అన్న అంశాలపై కృపాల్ కశ్యప్ ప్రదర్శన ఇచ్చారు.
  7. సామాన్య ప్రజలు కంప్యూటర్లు, మొబైళ్ళలోనూ, జాలంలోనూ నేడు తెలుగుని ఎలా ఉపయోగించుకోవచ్చు, పూర్తి స్థాయిలో కంప్యూటర్లలోనూ ఇతర పరికరాల్లోనూ తెలుగును తీసుకురావడానికి జరగాల్సిన కృషి గురించి నేను వివరించాను.

ఆ తర్వాత ఆచరణీయ అంశాలపై సదస్యులందరూ పాల్గొనగా చర్చ జరిగింది. మధ్యలో తెలుగు పదాలపై అభిప్రాయాలతో కాస్త పక్కదారికి మళ్ళింది. సంస్కృత పదాలు ఉండకూడదని ఒకరూ (పదం అన్న పదం బదులు మాట అని వాడాలంటూ), సాంకేతికంగా ఆంగ్ల పదాలే వాడాలంటూ ఒకరు, ఇతర భాషలను చూసి ప్రేరణ చెందాలని, భాషా బేషజం ఉండకూడదని వీలైతే కన్నడ తమిళ భాషల పదాలను కూడా తెలుగుకి అన్వయించుకోవాలని, తెలుగు భాషకి అధికారిక నియంత్రణా మండలి ఉండాలనీ, పల్లెల నుండి మాటలను సేకరించాలని (తవ్వోడ ఉదాహరణ), ఇలా చాలా రకాలైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా జాలంలో తెలుగు పదాల గురించి ఇప్పటికే ఉన్న తెలుగుపదం (గుంపు) గురించి తెలియజేసాం. (కశ్యప్ తెలుగుపదం సైటుని వెంటనే తెరపై చూపించేసాడు కూడా.) వారిని ఇక్కడి చర్చల్లో పాలుపంచుకోమన్నాం.

ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన విన్నపాలు (ఈ విషయంపై చర్చలో వచ్చిన ఇతర సదస్యుల అభిప్రాయాలను కూడా ఇక్కడే చేర్చాను):

  • ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల జాలగూళ్ళన్నీ తెలుగులో కూడా అందుబాటులోనికి తీసుకురావాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనికోడ్ కన్సార్టియంలో సభ్యురాలవ్వాలి. తద్వారా యూనికోడ్ ప్రమాణంలో తెలుగు సంబంధిత అంశాలపైనా, ప్రాచీన కావ్యాలలో ఉపయోగించిన తెలుగు అక్షరాలను యూనికోడ్‌లో చేర్చే విషయమై కృషిచేయాలి.
  • సాంకేతిక విద్యను అందించే విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులు వారి విద్యాకాలంలో విద్యార్థికి కనీసం ఒక్క ప్రాజెక్టు చొప్పున తెలుగు సంబంధిత సాంకేతిక అంశాలపై ప్రాజెక్టు చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • తెలుగులో కృషి చేసే వ్యక్తులకూ స్వచ్ఛంద/వ్యాపార సంస్థలకూ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించాలి.
  • తెలుగు కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చెయ్యాలి.
  • పాఠశాలకు ప్రస్తుతం అందించిన కంప్యూటర్లలో తెలుగు ఉండేలా చూసి, పిల్లలకు కంప్యూటర్లలో తెలుగుని నేర్పాలి.

ఇతరత్రా సూచనల్లో తెలుగు టైపింగ్ పరిక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ధృవపత్రాలు ఇవ్వడం, మండల స్థాయిలో కంప్యూటర్లలో తెలుగు వాడకంపై అవగాహనా సదస్సులు నిర్వహించడం, సినిమాలు రేడియోల్లో తెలుగు పదాల వాడకం పెంచమనడం వంటివి ఉన్నాయి.

ఇక ఈ సదస్సుకు ఫలంగా తెలుగు కోసం వివిధ చోట్ల జరుగుతున్న కృషిని సమన్వయపరిచేందుకు, వెగిరపరిచేందుకు విశ్వ అంతర్జాల తెలుగు వేదిక (Global Internet Forum for Telugu, GIFT) ను ఏర్పరచాలనీ, అలానే ఇలాంటి సదస్సును అంతర్జాతీయ స్థాయిలో “విశ్వ అంతర్జాల తెలుగు సదస్సు”ను సెప్టెంబరు నెలాఖరులో అమెరికాలో నిర్వహించాలని తీర్మానించారు. విశ్వ అంతర్జాల తెలుగు వేదిక యొక్క కార్యాచరణ బృందాలను నిర్ణయించేందుకు ఉమా మహేశ్వరరావు, పేరి భాస్కరరావు, అర్జునరావు మరియు వీవెన్ లను కమిటీ సభ్యులగా నియమించారు.

అలానే, అంతర్జాతీయ సదస్సు జరిగే లోపల ఈ క్రింది అంశాలపై ప్రాధమికంగా కృషి చేయాలనుకున్నారు:

  • కనీసం 6 తెలుగు యూనికోడ్ ఖతులను రూపొందించాలి.
  • తెలుగు ‘భాషా’ విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేసే కృషిచేయాలి.
  • తెలుగు OCRను అందుబాటు లోనికి తీసుకురావాలి.
  • తెలుగు ఉపకరణాల పోటీని నిర్వహించాలి. కంప్యూటర్ లేదా ఐఫోన్/మెబైల్ ఉపకరణాలు.

ఇలాంటి సదస్సుల్లో ప్రసంగాలూ, చర్చలూ ఒక ఎత్తయితే, మనం కలుసుకునే వ్యక్తులు, వారితో విరామ సమయంలో సంభాషణలు, కొత్త పరిచయాలు, ఆ సందర్భంగా వచ్చే ఊపు ఉత్సాహాలు మరో ఎత్తు. వాటిని అనుభవించితీరాలి కానీ మాటల్లో చెప్పలేం!

నాకు గుర్తున్న కొన్ని వాఖ్యలు, చతుర్లు గట్రా:

  • మనం ఆదర్శం కోసం ఒక దగ్గరకి వచ్చాం. కానీ అవసరంగా కలిస్తే అప్పుడు మరింత కృషి జరుగుతుంది అన్న సలహాకు ప్రతిగా “ఆనంద్ గూగుల్, ఫేస్‌బుక్ వంటి సైట్లు లేక ముందు వాటి అవసరం లేదు. సోనీ వాక్‌మ్యాన్ ప్రవేశపెట్టేముందు జరిపిన అవడోలనల్లో వాటిలో ధ్వని నాణ్యంగా ఉండదు, ఎవరూ కొనరు అన్న అభిప్రాయాలు వ్యక్తం చేసారంట. కనక మనం అవసరాన్ని ఊహించి కృషి చేయాలి” అని చెప్పారు. నేటి ఆదర్శమే రేపటికి అవసరం అవుతుంది! అవసరాన్ని ఊహించడమే మనకి ఆదర్శం!
  • అనూ ఫాంట్లు యూనికోడులో లభ్యం కాకపోవడంపై, (అనూ ఫాంట్స్ అధినేత మురళీకృష్ణ విజయవాడ లోని ఒక సదస్సులో) మాట ఇచ్చి ఏళ్ళు గడిచినా తర్వాత కూడా యూనికోడులో ఒక్క ఫాంటునీ విడుదల చేయకపోవడంపై, మరియు డబ్బు పోసి కొన్న ఫాంట్లతో ఈమెయళ్లు పంపించుకోలేకపోతున్న ఆవేదనతో అనూ వారి వ్యాపార ప్రవృత్తిని ఒకాయన “అనూ వారు తెలుగు భాషకీ తెలుగు లిపికీ ఇస్తున్న రాయల్టీ ఏమిటి?” అంటూ ప్రశ్నించారు.
  • టీవీ5 తూర్లపాటి గారు మాట్లాడుతూ జాలంలో తెలుగు పెరగడం తమకి ఎంతో తోడ్పడిందనీ, వారు జాలంలోని వివిధ వనరుల నుండి ముఖ్యంగా బ్లాగుల నుండి సమాచార సేకరణ చాలా సుఖంగా ఉందనీ చెప్పారు. ఈ సందర్భంగా కూడలి జల్లెడలను ప్రస్తావించారు.
  • ఫన్‌కౌంటర్ ఫణి మాధవ్ తన రాజకీయ ఫన్‌చాంగాన్ని వినిపించారు.

అన్నట్లు, నా ప్రదర్శనకు ఉపయోగించిన ఫలకాలు. నేను ఫలకాల్లో పదాలు తక్కువ ఉపయోగిస్తాను. కనుక ప్రత్యక్షంగా చూస్తే తప్ప కేవలం ఈ ఫలకాలు అంత అర్థవంతగా ఉండకపోవచ్చు. అయినా, ఇవిగోండి మీకోసం:

7 thoughts on “తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.