పాత్రికేయులకు మరియు విలేఖరులకు, (ముద్రణా రంగంలో లేదా జాలానికి బయట వెబ్ చిరునామాలు ఇచ్చేవారికి)
వివిధ వ్యాసాలలో, కథనాలలో, వార్తలలో వెబ్ చిరునామాలను వాడుతుండవచ్చు. వెబ్ చిరునామాలో చిన్న తప్పు దొర్లినా మీ పాఠకులు ఆ వెబ్ సైటుని చేరుకోలేకపోవచ్చు. ఆవిధంగా, మీ వ్యాసపు/కథనపు ఫలితమే లేకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల మీ పత్రికపై విశ్వాసం (కనీసం సాంకేతిక అంశాలకు సంబంధించి) సన్నగిల్లే అవకాశాలూ ఉన్నాయి.
చాలా పత్రికలలో ఇచ్చే వెబ్ చిరునామాలు తప్పుగా ఉండడం నేను చూసాను. అందుకు కారణాలు చాలా ఉండవచ్చు. పొరపాటు మీ మొదటి ప్రతి నుండి, ముద్రణలోకి వెళ్ళే చివరి పాఠ్యం వరకు ఏ దశలోనైనా జరగవచ్చు.
మీకు (లేదా ముద్రణా ప్రక్రియలో మధ్య సిబ్భందికి) అంతర్జాలానికి సంబంధిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. అందువల్ల కూడా పొరపాట్లు జరగవచ్చు. వెబ్ చిరునామాలు ఇవ్వడంలో తరచూ దొర్లే పొరపాట్లను నివారించడానికి, మీరిచ్చే వెబ్ చిరునామాలు మీ పాఠకులను లక్ష్యిత వెబ్ సైట్లకి నేరుగా చేర్చేలా ఉండడానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి.
- చిరునామాలని టైపు చెయ్యకండి. కాపీ పేస్టు చెయ్యండి. ఇదే చాలా పొరపాట్లను నివారిస్తుంది.
- చాలా సందర్భాలలో పూర్తి చిరునామాని ఇవ్వడం అనవసరం. http, www లాంటి వాటిని వదిలివేయవచ్చు. ఇవి పూర్తిగా సాంకేతిక సౌలభ్యం కోసమే. ఇవి ఇవ్వకపోయినా ఆయా వెబ్ సైట్లను చేరుకోవచ్చు.
- చిరునామాలో ఉండేవి బ్యాక్ ష్లాషులా లేక ఫార్వార్డు ష్లాషులా? లేక, // (ష్లాషులు) : (కోలను)కి ముందు వస్తాయా వెనకా? లాంటి సందేహాలకు తావు లేకుండా, వాటిని వదిలేస్తే మేలు. వాటిని గుర్తుపెట్టుకోవడం అనవసరం.
- ఉదాహరణకి, http://www.eenadu.net/ కి బదులుగా కేవలం eenadu.net అని ఇచ్చినా సరిపోతుంది. మీ విహారిణి (browser) చిరునామా పట్టీలో టైపు చేసి చూడండి.
- మీరిచ్చిన చిరునామాలు సరైనవో కాదో తెలుసుకోడానికి (మీ చిత్తు ప్రతిలో సరిగానే ఉండవచ్చు. ముద్రణకు వెళ్ళే ప్రతిలో ఇచ్చిన చిరునామాలు పరీక్షించండి.) వాటిని మీరు సందర్శించి చూడండి.
- చిరునామా పొడవు ఎక్కువైన కొద్దీ దానిలో తప్పులు దొర్లే అవకాశం పెరుగుతుంది. పొడవైన చిరునామాలు పత్రికలలోని తక్కువ వెడల్పున్న వరుసలలో ఇమడవు. చిరునామా తర్వాతి లైనులోనికి దొర్లి, పాఠకులు ఆ చిరునామాలను టైపుచేసేప్పుడు అనవసరపు అదనపు ఖాళీలు ఇచ్చేఅవకాశం ఉంది. అందువల్ల, వారికి ఆ పేజీ కనబడకపోవచ్చు. కనుక పూర్తి చిరునామాతో పాటుగా, సైటు పేరు ఇచ్చి ఆ తర్వాత, లక్ష్యిత పేజీకి ఎలా చేరాలో చెప్పవచ్చు.
- ఉదాహరణకి ఇలా, ఆంగ్ల వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ గురించిన పేజీని చూడండి. http://en.wikipedia.org/wiki/Andhra_Pradesh అనే లింకుని అనుసరించండి (లేదా en.wikipedia.org అనే సైటులోనికి వెళ్ళి అక్కడ సెర్చి బాక్సులో Andhra Pradesh అని టైపు చేయండి.)
- మరో ఉదాహరణ: సెల్ ఫోనులు ఎలా పనిచేస్తాయో తెలిపే వివిధ వ్యాసాలకోసం ఈ లింకుని దర్శించండి. http://electronics.howstuffworks.com/cell-phone-technology-channel.htm (లేదా howstuffworks.com అనే సైటులోనికి వెళ్ళి ప్రధాన నావిగేషన్ పట్టీలోని Electronics అన్న లింకుపై నొక్కండి, తర్వాత వచ్చే సబ్ నావిగేషను పట్టీ నుండి Phones ఆ తర్వాత Cell Phones అన్న లింకుని నొక్కండి.)
- గమనిక: ఈ పద్ధతి ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. మరియు అంతగా ప్రభావవంతం కాకపోవచ్చుకూడా.
- మీరిచ్చే వెబ్ చిరునామా మీ పత్రిక యొక్క అంతర్జాల సంచికలో కూడా వస్తుంటే, అందులోని లింకు పూర్తి చిరునామాతో నొక్కగలిగే విధంగా ఉండేలా చూసుకోండి.
- తెలుగులోని పదాలకు వివిధ రకాల స్పెల్లింగులు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి, ఈనాడుని eenadu లేదా eenaadu గా వ్రాయవచ్చు. అలానే, వార్తని vaartha, vartha లా కూడా వ్రాయవచ్చు. వెబ్ చిరునామాలు ఇచ్చేప్పుడు ఆ సైటు వాడే స్పెల్లింగునే వాడుతున్నారో లేదో సరిచూసుకోండి.
ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. (ఇది మీ పనితనాన్ని, చిత్తశుద్ధిని చిన్నచూపు చూసే ప్రయత్నం కాదు. కానీ మీ పని ఈ విషయంలో మరింత మెరుగ్గా, ఉపయోగశీలంగా ఉండటానికి నాకు తోచిన సూచనలు.)
ఆనంద జాలా విహరణం!
నేను కూడా చాలా రోజుల నుంచి ముద్రణలో తప్పులు గమనిస్తున్నాను.
మీ సూచనలు బాగున్నాయి.
వెబ్ చిరునామాలో ఒకొక్క సారి, కాపీ పేస్ట్ చేసెటప్పుడు కూడా “బ్రేక్” లు (ఖాళీ) లు వస్తుంటవి. వాటికి కూడా మీ టెక్నిక్‌లు తెలియజేస్తే బాగుంటుంది. అలాగే tinyurl లాంటి సేవలు గురించి ఉదహరించి / పరిచయం చేసినా బాగుండేది.
పేస్ట్ చేసేప్పుడు ఖాళీలు వస్తున్నాయా? ఎలాగబ్బా? ఉదాహరణ చిరునామా ఇవ్వగలరా?
నా మట్టుకు నేనే టైనీలను వాడను. అందుకే చెప్పలేదు. దీనికి ప్రత్యేక టపా అవసరం. ఎవరైనా రాస్తారేమో చూద్దాం.
నేను బ్లాగ్గుల్లో మీరు చెప్పినట్లుగా, కాపీ ,పేస్ట్ చేసినా, బ్లాగ్గులో నొక్కొనప్పుడు ‘ఉప్స్ లింక్ ఈజ్ బ్రోకెన్’ అనే సందేశం వస్తోంది.ఏం చేయమంటారు?