ఆంగ్లంలో సంక్షిప్త పదాల వాడుక ఎక్కువ. (ఇటీవలి కాలంలో SMS ల జోరుతో ప్రతి పదాన్ని కుదించేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.) ఈ సంక్షిప్త పదాల్లో భాషని సృజనాత్మకంగా వాడటంలో accronyms ది ప్రత్యేక పాత్ర.
ఈ సంక్షిప్త పదాలతో కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. వేర్వేరు విషయాలకి, భావనలకి ఒకే సంక్షిప్త పదం ఉండే అవకాశం ఎక్కువే. IT అంటే Income Tax కావచ్చు, Information Technology కావచ్చు. ఆయా విషయేతర సందర్భాలో వాడినప్పుడు ఈ సంక్షిప్త పదాలు అయోమయాన్ని, సందిగ్ధత ని కల్గిస్తాయి.
ఇక ఒక రంగంలో వారి సంపలు (ఊ… సంక్షిప్త పదాల్లేండి) ఇతర రంగాల వారికి అంతగా కొరుకుడు పడవు. సమాచార సాంకేతిక రంగంలోనైతే, రోజుకో సంపదం (సంక్షిప్త పదం) పుట్టుకొస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఇక తెలుగు విషయానికి వస్తే, ఉన్నవే తక్కువ (లేదా, నాకు తెలియవా?). భాష యొక్క వాడకం పెరగాలంటే, ఇలాంటి సులువైన (సృష్టించేవారికి కష్టమైనా) పద్దతులని అవలంబించాలి.
అయితే, వీటిని మన రచనల్లో వాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శ్రోతలకి తెలిసి ఉండకపోవచ్చు. ఏదైనా పదానికి సంక్షిప్త రూపాన్ని రచనలో మొదటి సారి ఊపయోగించినప్పుడు దాని పూర్తిరూపాన్ని కూడ బ్రాకెట్లలో ఇస్తే తెలియనివారికి సౌలభ్యంగా ఉంటుంది.
నాకు తట్టిన కొన్ని తెలుగు సంక్షిప్త పదాలు:
- విరసం, విప్లవ రచయితల సంఘం
- అరసం, అభ్యుదయ రచయితల సంఘం
- తెవికీ, తెలుగు వికీపీడియా
- నివ్య, నిర్వాహక వ్యవస్థ Operating System (అందమైన పేరు కదూ? నా సృష్టే!)
మీకింకేమైనా తడితే వాటిని తెలుగు విక్షనరీ లో చేర్చండి.
అభాతెమాసం – అఖిల భారత తెలుగు మాట్లాడేవాళ్ళ సంఘం :P