ఏదైనా ఓక ప్రోగ్రాం యొక్క వినియోగదారులు ఈ క్రింద చెప్పిన అన్ని స్వాతంత్ర్యాలని కలిగిఉంటే ఆ ప్రోగ్రాంని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అనవచ్చు.
- ఆ ప్రోగ్రాంని ఉపయోగించుకొనే స్వేచ్ఛ
- ఆ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందో అధ్యయనం చేసి దాన్ని అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొనే స్వేచ్ఛ.
- ఆ ప్రోగ్రాం ని పునఃపంపిణీ చేయగలిగే స్వేచ్ఛ (మీ పక్కింటతనికి మీరు సహాయం చెయ్యవచ్చు.)
- ఆ ప్రోగ్రాం ని మెరుగుపరిచే, మరియు మీ మెరుగుల్ని జనులందరికీ అందించగల్గే స్వేచ్ఛ (సమాజం అంతా లబ్ధి పొందుతుంది.)
(2 మరియు 4వ స్వేచ్ఛలకి ఆ ప్రోగ్రాం యొక్క మూల సంకేతం (source code) వినియోగదారునికి అందుబాటులో ఉండాలి.)
అంటే స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ప్రోగ్రాం యొక్క కాపీలని యథాతధంగా గానీ, లేదా మార్పులతో గానీ, ఉచితంగా గానీ, రొక్కమునకు గానీ, ఎవరికైనా, ఎప్పుడైనా మీరు అందిచవచ్చు. ఇవన్నీ చేయగల్గడానికి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు, మీరెవరికీ ఏమీ చెల్లించనవసరం లేదు.
మీరు ఒక స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ని పైకానికి కొని ఉండవచ్చు, లేదా ఉచితంగానైనా పొంది ఉండవచ్చు. మీరు ఎలా పొందారు అన్నదాంతో సంబంధం లేకుండా, దాన్ని కాపీ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, కాపీలని అమ్ముకోవచ్చు కూడా.
సుప్రసిద్దమైన వెబ్ విహరిణి ఫైర్ఫాక్స్ మరియు ఓపెన్ఆఫీస్ లు స్వేచ్ఛా సాఫ్ట్వేర్లకి ఉదాహరణలు.
గమనిక: గ్నూ వారి స్వేచ్ఛా సాఫ్ట్వేర్ నిర్వచనం నుండి సంగ్రాహ్యం.