Posts Tagged ‘అభిప్రాయ సేకరణ’
అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా?
సూటిగా, సుత్తి లేకుండా ;)
పరాచికాలు అలా ఉంచితే, కూడలి కొన్ని రకాలైన బ్లాగులని అనుమతించడం ద్వారా ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలానే నిందాపూర్వక, ద్వేషపూర్వక (లేదా అటువంటి వ్యాఖ్యలని ప్రోత్సహించే) బ్లాగులకీ కూడలిలో స్థానం ఉండకూడదన్న విన్నపాలూ నాకొస్తున్నాయి. నన్ను సంప్రదించిన వాళ్ళకి నచ్చని బ్లాగులు చదవకండి అని సలహాని ఇస్తూ వస్తున్నాను. (నచ్చని బ్లాగులని మీకు కనబడకుండా చేసుకునే సౌలభ్యం కూడా కూడలిలో ఉంది.)
తెలుగు బ్లాగుల సంఖ్య మునుపెన్నడూ లేనంత వేగంగా పెరుగుతుంది. కూడలిని మెరుగుపరిచే విషయంతో బాటు, నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూడలికి విషయ విధానం ఉండాలని ఆలోచిస్తున్నాను. అదే పనిలో, బ్లాగరుల ప్రవర్తనా నియమావళి, బ్లాగర్ యొక్క విషయ విధానం, వర్డుప్రెస్సు.కామ్ యొక్క విషయసమర్పకుల బాధ్యతల (రెండవ బిందువు దాని ఉపబిందువుల) నీ చదువుతున్నాను. మీరూ చదవండి; బ్లాగరుగా మన హక్కులూ భాధ్యతలని తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా, మీరు—కూడలి సందర్శకులు—కూడలిలో ఎటువంటి బ్లాగులని చూడకూడదనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని ఇక్కడ వ్యాఖ్యలుగా గానీ, లేదా నేరుగా support ఎట్ koodali డాట్ org అన్న చిరునామాకి వేగు ద్వారా గానీ తెలియజేయవచ్చు.
తా.క.: వ్యాఖ్యలు నాకు ఖాళీ సమయం దొరికేంతవరకూ అనుమతి కోసం వేచియుంటాయి.తాజాకరణ.
అభిప్రాయ సేకరణ: మీ రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు ఎంత?
రోజూ మనం ఎంతో సమాచారాన్ని (క్రియాశీలంగానైనా లేదా యధాలాపంగానైనా) చదివి వినియోగిస్తుంటాం: వార్తలు, బ్లాగులు, ఈమెయిళ్లు, కబుర్లు (IM), సూక్ష్మ బ్లాగులూ, బజ్, వాల్, స్క్రాపులు, గట్రా. మీకు సంబంధించి వీటిలో సగటున రోజుకి తెలుగు ఎంత శాతం ఉండవచ్చు? మీ మౌఖిక సంభాషణలనీ, టీవీలో చూసిన మరియు రేడియో, జాలంలో విన్న తెలుగుని వదిలేస్తే, మీరు రోజు వారీ చదివే దానిలో తెలుగు సమాచారం/విషయం యొక్క శాతం ఎంత?
ఉదాహరణకి, మీరు ఒక రోజు అన్ని పనులూ ఇతరత్రా కాలక్షేపాల నుండి విరామం తీసుకుని, కేవలం ఒక్క నవ(ల)లే చదివారనుకుందాం. ఆ నవల(లు) తెలుగు అయితే, ఆ రోజు మీ తెలుగు సమాచార వినియోగం నూరు శాతం. ఆదే నవల ఆంగ్లమయితే, తెలుగు సున్నా. అలాంటి అనుభవాలు మీకు అరుదు అయితే, వాటిని వదిలివేసి సగటున మామూలు రోజుల్లో తెలుగు వినియోగం ఎంత అన్నది ఆలోచించండి.
మీరు చేసేవన్నీ పద్దురాసి, సంకలనించి, శాతం కట్టేంత ఖచ్చితంగా అక్కరలేదు కానీ, స్థూలంగా మీ అంచనా ఏమిటి?
అంకెల్లో తేల్చలేకపోతే, ఇక్కడ వ్యాఖ్యగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?
ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది? ఈ ప్రశ్నలడగడానికి కారణమేమంటే, మన సమాధానాలు లేదా అవసరాలు సమాచార సృష్టికర్తలకీ (బ్లాగర్లని కలిపే) మరియు జాల గూళ్ళ నిర్వాహకులకీ తమ తమ ప్రాధాన్యతలలో ఉపకరిస్తాయి. (చాలామంది తెలుగులో పర్యాటక సమాచారం చూడాలనుకుంటున్నాం అన్నారనుకోండి, ఆ దిశగా బ్లాగులూ లేదా సైట్లూ వస్తాయని ఆకాంక్ష.)
దీన్ని నా బ్లాగుకే పరిమితం చేయనవసరంలేదు; ఈ విషయంపై మీ ఆకాంక్షలనీ, అభిప్రాయాలని టపాగా మీ బ్లాగులో కూడా వ్రాయండి.
ఆనంద తెలుగీకరణం!

