Archive for the ‘తెలుగు భాష’ Category
మీడియావికీ మరియు ఇతర ఉపకరణాల స్థానికీకరణ
మీరు తెలుగు వికీపిడీయాకి వెళ్తే, వ్యాసాలు మాత్రమే కాక తతిమా సైటు అంతా తెలుగులోనే కనిపిస్తుంది. అలా సైటు మొత్తాన్నీ తెలుగులోనికి తీసుకువచ్చే ప్రక్రియని స్థానికీకరణ అంటారు. ఈ విషయంపై అవగాహనకు మీడియావికీ స్థానికీకరణ గురించిన ఈ స్వబోధక ప్రదర్శనని చూడండి:
దానిలో చెప్పినట్టుగా మీడియావికీ (అంటే వికీపిడియా వెనకవున్న ఉపకరణం) యొక్క స్థానికీకరణ translatewiki.net వద్ద జరుగుతుంది. అక్కడ అదొక్కటే కాకుండా, స్టేటస్.నెట్, ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్, వికియా, వికీరీడర్, షపడూ వంటి మరెన్నో ఉపకరణాల స్థానికీకరణ కూడా జరుగుతుంది. వీటన్నింటినీ తెలుగులో అందుబాటులో తీసుకురావడానికి ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ సైటులో నమోదయి అనువాదాలు చేయండి.
మీరు మీడియావికీని అనువదిస్తే, తెలుగు వికీపీడియా, విక్షనరీ వంటి వికీ ప్రాజెక్టులతో బాటు, తెలుగుపదం వంటి సైట్లు కూడా ఆ అనువాదాలతో లాభపడతాయి. స్టేటస్‌నెట్ ఉపకరణాన్ని అనువదిస్తే, etelugu.status.net, veeven.status.net, koodali.status.net, కేక వంటి సేవలు పూర్తిగా తెలుగులో అందుబాటులోకి వస్తాయి.
మిమ్నల్ని మరికాస్త ఊరించడానికి: ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం ఒక అనువాద ర్యాలీ నడుస్తుంది. దాని ప్రకారం, ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో మీరు గనక ఏప్రిల్ 23 2011 00:00 UTC నుండి ఏప్రిల్ 30 2011 24:00 UTC (భారత సమయం ప్రకారం శనివారం, ఏప్రిల్ 23 2011, ఉదయం 5:30 నుండి ఆదివారం, మే 01, 2011 ఉదయం 5:30 వరకు) మధ్య కాలంలో 500 అనువాదాలను పూర్తిచేస్తే, € 1,000 లలో భాగం పొందుతారు. మరిన్ని వివరాలు.
మరింకెందుకాలస్యం, ఆ ర్యాలీ సమయం మొదలయ్యే లోపు కొన్ని అనువాదాలు చేసి కాస్త అనుభవం సంపాదించి తయారుగా ఉండండి.
ఆనంద స్థానికీకరణం!
తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక
ఈ శనివారం హైదరాబాదు లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో జరిగిన తెలుగు అంతర్జాల సదస్సు గురించి మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. ఆ సదస్సుపై నా నివేదిక ఇది. ఇది అసంపూర్ణమే. ఆ ఆనందోత్సాహలూ ప్రేరణా ఈ టపాలో ప్రతిబింబించకపోవచ్చు.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఈ ఆదివారం తెలుగు బాటకి రండి!
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా e-తెలుగు సంస్థ తరపున తెలుగు బాట అనే ఒక నడక కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.
నేనింత బాగా చెప్పివుండలేను, కనుక రెండు మెచ్చుతునకలని ఇక్కడ అతికించేస్తున్నాను.
రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
— నాగ మురళీధర్
మాటల్లోనూ రాతల్లోనూ నెమ్మది నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురవుతోన్న మాతృభాషను కాపాడుకునేందుకు, భాష గురించిన చైతన్యాన్ని రగిలించేందుకు, భాష గురించి కొందరినైనా ఆలోచింపజేసేందుకు e-తెలుగు సంకల్పించిన “తెలుగు బాట” కార్యక్రమంలో పాల్గొని అందరం కలిసి భాషా చైతన్యం దిశగా భావావేశంతో, నాలుగడుగులు వేద్దాం!
— మనసులో మాట సుజాత
ఇతర ప్రాంతాల వారికి, వీలుంటే ఆ రోజు హైదరాబాదుకి రండి. లేదా, ఇలాంటి కార్యక్రమాన్ని మీ ఊళ్ళోనే మీ మిత్రులతోనూ తెలుగు భాషాభిమానులతోనూ కలిసి నిర్వహించండి.
ఆనంద తెలుగాయనం! *
రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు — నా ఆకాంక్షలు
రెండు రోజుల క్రితం నేను మొదలుపెట్టిన తెలుగు సమాచార వినియోగంపై అభిప్రాయ సేకరణలో అడిగిన ప్రశ్నలు ఇవీ:
మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?
ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది?
వాటికి సంబంధించి నా జవాబులూ ఆకాంక్షలు ఇవీ:
నేను బ్లాగులోకంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ జాలంలో తెలుగు సమాచారం చాలా పెరిగింది. పెరుగుదల రేటు కూడా గణణీయంగానే ఉంది. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాల్సివచ్చినప్పుడు, నేను ముందుగా తెలుగులో గూగిలిస్తున్నాను. మొన్నామధ్య హెపటైటిస్ బీ గురించి తెసుకుందామని సందేహిస్తూనే (అనగా, నేరుగా ఇంగ్లీషు వికీపీడియాకి వెళ్ళకుండా) తెలుగులో వెతికాను. నాక్కావలసిన సమాచారం తెవికీలో దొరికింది. కానీ ఇంకా చాలా విషయాల్లో తెలుగులో సమాచారం అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. వివిధ రంగాల వారీగా చూద్దాం:
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
అభిప్రాయ సేకరణ: మీ రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు ఎంత?
రోజూ మనం ఎంతో సమాచారాన్ని (క్రియాశీలంగానైనా లేదా యధాలాపంగానైనా) చదివి వినియోగిస్తుంటాం: వార్తలు, బ్లాగులు, ఈమెయిళ్లు, కబుర్లు (IM), సూక్ష్మ బ్లాగులూ, బజ్, వాల్, స్క్రాపులు, గట్రా. మీకు సంబంధించి వీటిలో సగటున రోజుకి తెలుగు ఎంత శాతం ఉండవచ్చు? మీ మౌఖిక సంభాషణలనీ, టీవీలో చూసిన మరియు రేడియో, జాలంలో విన్న తెలుగుని వదిలేస్తే, మీరు రోజు వారీ చదివే దానిలో తెలుగు సమాచారం/విషయం యొక్క శాతం ఎంత?
ఉదాహరణకి, మీరు ఒక రోజు అన్ని పనులూ ఇతరత్రా కాలక్షేపాల నుండి విరామం తీసుకుని, కేవలం ఒక్క నవ(ల)లే చదివారనుకుందాం. ఆ నవల(లు) తెలుగు అయితే, ఆ రోజు మీ తెలుగు సమాచార వినియోగం నూరు శాతం. ఆదే నవల ఆంగ్లమయితే, తెలుగు సున్నా. అలాంటి అనుభవాలు మీకు అరుదు అయితే, వాటిని వదిలివేసి సగటున మామూలు రోజుల్లో తెలుగు వినియోగం ఎంత అన్నది ఆలోచించండి.
మీరు చేసేవన్నీ పద్దురాసి, సంకలనించి, శాతం కట్టేంత ఖచ్చితంగా అక్కరలేదు కానీ, స్థూలంగా మీ అంచనా ఏమిటి?
అంకెల్లో తేల్చలేకపోతే, ఇక్కడ వ్యాఖ్యగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ సమాచారం వినియోగంలో తెలుగు శాతం పెరగాలనుకుంటున్నారా? లేదా, మీ తెలుగు వినియోగ ధోరణితో (నెమ్మదిగా అయినా పెరుగుతుందనే అనుకుంటున్నాను) మీరు సంతృప్తిగా ఉన్నారా?
ఇంకా మీరు తెలుగులో ఏయే సమాచారం/విషయాల్ని (ప్రత్యేకించి జాలంలో) చూడాలనుకుంటున్నారు? మరో రకంగా, మీకు తెలుగులో దొరకని సమాచారం ఏముంది? ఈ ప్రశ్నలడగడానికి కారణమేమంటే, మన సమాధానాలు లేదా అవసరాలు సమాచార సృష్టికర్తలకీ (బ్లాగర్లని కలిపే) మరియు జాల గూళ్ళ నిర్వాహకులకీ తమ తమ ప్రాధాన్యతలలో ఉపకరిస్తాయి. (చాలామంది తెలుగులో పర్యాటక సమాచారం చూడాలనుకుంటున్నాం అన్నారనుకోండి, ఆ దిశగా బ్లాగులూ లేదా సైట్లూ వస్తాయని ఆకాంక్ష.)
దీన్ని నా బ్లాగుకే పరిమితం చేయనవసరంలేదు; ఈ విషయంపై మీ ఆకాంక్షలనీ, అభిప్రాయాలని టపాగా మీ బ్లాగులో కూడా వ్రాయండి.
ఆనంద తెలుగీకరణం!
హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!
హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం అని కొత్తపాళీ రాసారు. ఆయన అన్న వేమూరి వారి వీరతాళ్ళు (సుజనరంజని పత్రిక) లంకెలు:
వేమూరి వారు వీరతాళ్ళు అన్న బ్లాగుని కూడా మొదలుపెట్టారు. ఈ బ్లాగుని క్రియాశీలంగా కొనసాగించమని బ్లాగ్ముఖంగా వారికి నా అభ్యర్థన.
ఇక హీబ్రూ. హీబ్రూ గురించి నాకు పెద్దగా (అసలేమీ) తెలియదు. కొ.పా. గారు లంకిచ్చిన ఆడియో విని ఆపై వికీపీడియాలో చదివాను. రెండు ముక్కల్లో కావాలంటే, కొ.పా. గారి టపాలో చంద్ర మోహన్ గారి వ్యాఖ్య:
మరణించిన రెండువేల సంవత్సరాల తరువాత ఫీనిక్సు పక్షిలా పునర్జీవితమైన్ ఆధునిక ప్రపంచ భాషల్లో ఒకటిగా మారిన హిబ్రూ భాషకథ భాషాప్రేమికులకు ‘బైబిల్’ లాంటిది (literally!). ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత హిబ్రూను అధికార భాషగా నిర్ణయించాక చూసుకుంటే వారికి మిగిలి ఉన్న ఒకేఒక లిఖిత సాహిత్యం పాత నిబంధన గ్రంధం ఒక్కటే. అందులోని పదాలనుండే ఆధునిక భావనలకు పదబంధాలను సృష్టించవలసి వచ్చింది. ఉదాహరణకు, విద్యుత్తు అన్న మాటకు ఏంపదం వాడాలా అని వెదికి బైబిల్లో దేవుని తలచుట్టూ ఉన్న కాంతి చక్రానికి వాడిన పదం “హష్ మల్” ను ఖాయం చేశారు. దేవుని సంజ్ఞ అనే అర్థంలో బైబిల్లో వాడిన ‘రాంజోర్’ అన్న పదాన్ని ‘traffic signal’ కు వాడారు. ఇలా ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళలో సకల విజ్ఞానశస్త్రాలనూ వారిభాషలోకి అనువదించుకొన్నారు. వారిభాషలోనే చదువుకొంటున్నారు.
మనమూ హీబ్రూ నుండి స్ఫూర్తి పొందాలి అని నేను చెప్పగలను. హీబ్రూ వికీపీడియా నిన్ననే లక్ష వ్యాసాలకు చేరిందని ఇప్పుడే చదివాను.
This achievement is quite remarkable for a language with less than 10 million speakers, from which about 3.5 million are native speakers (data taken from the Hebrew wikipedia).
86 మిలియన్ల మంది మాట్లాడేవారు (అందులో 74 మిలియన్లు తెలుగుని మాతృభాషగా గలవారు) ఉన్న తెలుగు భాష వికీపీడియాలో 44,274 వ్యాసాలు ఉన్నాయి (గణాంకాలు తెలుగు వికీపీడియా నుండి.)
అవును, మనం తప్పకుండా హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందాలి!
ఒకే అచ్చు గుణింతంతో పదాలు
తెలుగులో చాలా పదాలు ఒకే అచ్చుతో వస్తాయి. నాకు తట్టినవి ఇక్కడ. అసలు తలకట్టు తప్ప వేరే అచ్చులేని పదాలు (ఉదా. పలక) కాకుండా:
- ఆ
- కాకా (కాకా హోటల్ అంటాం కదా)
- కాజా
- కామా
- టాటా
- బాకా
- బాజా
- బాబా
- లావా
- ఇ
- గిరి
- చిలిపి
- తిమ్మిరి
- నిడివి
- పిడికిలి
- పిప్ఫి
- మిసిమి
- లిపి
- విరివి
- సిరి
- ఈ
- టీవీ
- ఉ
- ఉడుకు
- ఉరుము(లు)
- కుక్కు (సంచిలో కుక్కడం)
- కుదుపు(లు)
- కుదురు
- కులుకు(లు)
- గుద్దు(లు)
- గుబులు
- తుడుపు
- దుద్దు(లు)
- దున్ను
- పులుపు
- బుద్ధుడు
- ముక్కు(లు)
- ముగ్గు(లు)
- ముగ్గురు
- ముడుపు(లు)
- ముదురు
- ముద్దు(లు)
- మురుగు
- ములుకు
- ముసురు
- రుద్దు
- సుద్దులు
- ఏ
- వేరే
ఇంకేమైనా?


