సూక్ష్మసంగ్రహాలు: ఒక పరిచయం
సూక్ష్మసంగ్రహం (microsummary) అంటే ఏదైనా ఒక వెబ్‌పేజీ నుండి సంగ్రహించిన ఒక చిన్న సమాచార విశేషం. ఉదాహరణకి మీకు నచ్చిన బ్లాగులో కొత్త టపా, లేదా మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ షేరు యొక్క మార్కెట్ ధర, ఇలా ఏదైనా కావచ్చు.
ఉపయోగశీలత
తరచుగా తాజాకరించబడే ఈ చిన్న సమాచారంకోసం ప్రతీసారీ మీరు పూర్తి వెబ్‌పేజీని దర్శించనవసరంలేకుండా, మీ విహరిణి (web browser) ఈ సమాచారాన్ని సంగ్రహించిపెడుతుంది. ఉదాహరణకి, ఫైర్‌ఫాక్స్ 2 ఈ సూక్ష్మసంగ్రహాలని మన బుక్‌మార్కు యొక్క శీర్షికగా తరచూ తాజాకరించి చూపిస్తూంటుంది. వీటినే తాజా శీర్షికలు (live titles) అంటారు. మనక్కావాల్సిన సమాచారంకోసం బుక్‌మార్కుల పట్టీవైపోసారి చూస్తే సరిపోతుంది.
ఆవశ్యకాలు
- సూక్ష్మసంగ్రహాలకి తోడ్పాటుతో నిర్మించబడిన విహరిణి. ప్రస్తుతమున్న వెబ్ విహరిణులలో, ఫైర్‌ఫాక్స్ 2 మాత్రమే ఈ సూక్ష్మసంగ్రహాల తోడ్పాటుతో లభిస్తుంది.
- మీక్కావలసిన సమాచారాన్ని వెబ్‌పేజీ నుండి తీసుకొచ్చే యంత్రం (microsummary generator). ఈ యంత్రాన్ని మూడు విధాలుగా సమకూర్చుకోవచ్చు.
- ఆ వెబ్‌సైట్ తనే అందించినప్పుడు (ఉదాహరణ కూడలి, ఇంకా…)
- వేరే ఏదైనా వెబ్‌సైట్ మనక్కావల్సిన సైట్ కోసమై ఆ యంత్రాల్ని అందిస్తున్నప్పుడు (ప్రముఖ వెబ్సైట్ల కొరకు కొన్ని సూక్ష్మసంగ్రహ యంత్రాలు)
- మనకావల్సినట్టుగా మనమే తయారుచేసుకోవడం
నాక్కావల్సిన వెబ్‌సైట్ ఈ సూక్ష్మసంగ్రహ సహితమో కాదో తెలుసుకోవడం ఎలా?
ఒక వెబ్‌సైట్ తన పేజీలకి సంబంధించిన సూక్ష్మసంగ్రహ యంత్రాన్ని తనే అందిస్తే, ఆ వెబ్‌సైట్ సూక్ష్మసంగ్రహ సహితం అవుతుంది. (ఉదాహరణకి, కూడలి ఇప్పుడు సూక్ష్మసంగ్రహ సహితం. కూడలిలోని సరికొత్త టపా యొక్క శీర్షికని సూక్ష్మసంగ్రహంగా అందించే యంత్రాన్ని కూడలే అందిస్తుంది.) ఈ సూక్ష్మసంగ్రహాలనేవి ఇంకా కొత్త భావన కాబట్టి, ప్రస్తుతం వీటిని అందించే సైట్లు తక్కువే. సాధారణంగా అయితే వీటిని అందించే సైట్లోనే సూచిస్తారు (RSS ఫీడ్‌ని సూచించినట్టు). ఒకవేళ అలా సూచించకపోయినా, ఒక సైట్‌ని దర్శించినప్పుడు ఆ సైట్ సూక్ష్మసంగ్రహ సహితమో కాదో మన విహరిణి మనకు తెలుపుతుంది. ఉదాహరణకి, ఫైర్‌ఫాక్స్ 2లో మనమేదైనా వెబ్‌పేజీని బుక్‌మార్కు చేస్తున్నప్పుడు, ఆ బుక్‌మార్కు పేరుగా ఎంచుకోవడానికి వెబ్‌పేజీ శీర్షిక మరియు సూక్ష్మసంగ్రహాల ద్వారా రాబట్టిన తాజా శీర్షికలు ఒక జాబితాలో కనిపిస్తాయి. వీటిలో ఒక దానిని ఎన్నుకోవచ్చు. ఒకవేళ ఆ పేజీ సూక్ష్మసంగ్రహ సహితం కాకపోతే, బుక్‌మార్కు పేరుగా వెబ్‌పేజి శీర్షికే కనిపిస్తుంది. ఎన్నుకోవడానికి జాబితా కనిపించదు.

నేనే సూక్ష్మసంగ్రహ యంత్రాలని తయారుచేసుకోవాలంటే?
మీకు XML, XSL మరియు, XPath తెలిసి ఉండాలి. మరిన్ని వివరాలకు ఈ మొజిల్లా డెవలపర్ పేజీ చూడండి. మీకంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే, సూక్ష్మసంగ్రహ యంత్రకారిణి (ఫైర్‌ఫాక్స్ పొడగింత) మీకు ఉపయోగపడుతుంది.











