రెండు లంకెలు, ఒక వ్యాఖ్య
హెక్సాయర్ట్: విపత్తు సమయాల్లో ఉపయోగపడే గుడారం. ఇలాంటి మరిన్ని ఆలోచనలకై బహిరంగాకర (open source) సిద్ధాంతాలని నిర్మాణ రంగంలో వర్తింపజేస్తున్న అప్రొపీడియాని చూడండి.
ఇగ్నైట్: ఒక ఆలోచన గురించి 5 నిమిషాల్లోనే ప్రదర్శన (15 క్షణాలకి ఒకటి చొప్పున 20 ఫలకాలతో) ఇవ్వాలి.
వ్యాఖ్య:
Great minds discuss ideas, average minds discuss events, small minds discuss people.
జనవరి 2010
నా ఆసక్తులకి సంబంధించిన పనుల/తాజా విశేషాల నివేదిక:
- స్థానికీకరణ వేదిక ట్రాన్స్‌లేట్‌వికీ ఇప్పుడు మరింత మెరుగయ్యింది. కొత్త విశేషం: పాత అనువాదాల నుండి కొత్త వాటికి సలహాలను సూచిస్తుంది. ఉదాహరణకి క్రింది తెరపట్టుని చూడండి. అనువాద ప్రక్రియ వేగవంతమవడానికి మరియు అనువాదాలలో నియతత్వతకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
- నేను స్టేటస్‌నెట్ అనువాదాలని కొనసాగిస్తున్నాను. క్రమేపీ దాని ముఖాంతరం తెలుగు లోనికి మారుతుంది. మీ కోసం ఓ తెరపట్టు కుడివైపున. ప్రస్తుతం 0.9 సంచిక బీటా స్థాయిలో ఉంది.
- డ్రూపల్ 7 తయారవుతూంది. నెల మధ్యలో ఆల్ఫా1 విడుదలయ్యింది. ఆ వెంటనే దాన్ని అనువదించడానికి కూడా సిద్ధం చేసారు.
- పోయిన నెల 19% వద్ద ఉన్న పాటలపిట్ట అనువాదాల ప్రగతి ఇప్పుడు 38% కి చేరింది.
- ఎప్పుడో సంవత్సరం క్రింత కొంచెం చేసి మానివేసిన OLPC తెలుగీకరణని మళ్ళీ మొదలుపెట్టాను. 100 డాలర్లకి (చిన్నపిల్లల) అంకోపరుల ప్రాజెక్టు ఉంది కదా, అదే ఇది.
- మంటనక్క 3.6 సంచిక విడుదలయ్యింది. ఇప్పుడే దింపుకోండి. (ఆగండి, మీరు ఇప్పటికే పాత మంటనక్కని వాడుతుంటే, Help మెనూ నుండి Check for updates… అన్న ఆదేశాన్ని ఇవ్వండి. సరిపోతుంది. కొత్త సంచిక విడిగా స్థాపించబడకుండా, పాతదే తాజాకరించబడుతుంది.)

(1) అనువదించాల్సిన పాఠ్యం; (2) అనువాద సలహాలు; (3) అనువదించే చోటు. అనువాద సలహాల ఎడమ పక్కనున్న బాణాన్ని నొక్కితే, సలహా పాఠ్యం అనువదించే చోటులోనికి కాపీ అవుతుంది.
అంతే!
హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందుదాం!
హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం అని కొత్తపాళీ రాసారు. ఆయన అన్న వేమూరి వారి వీరతాళ్ళు (సుజనరంజని పత్రిక) లంకెలు:
వేమూరి వారు వీరతాళ్ళు అన్న బ్లాగుని కూడా మొదలుపెట్టారు. ఈ బ్లాగుని క్రియాశీలంగా కొనసాగించమని బ్లాగ్ముఖంగా వారికి నా అభ్యర్థన.
ఇక హీబ్రూ. హీబ్రూ గురించి నాకు పెద్దగా (అసలేమీ) తెలియదు. కొ.పా. గారు లంకిచ్చిన ఆడియో విని ఆపై వికీపీడియాలో చదివాను. రెండు ముక్కల్లో కావాలంటే, కొ.పా. గారి టపాలో చంద్ర మోహన్ గారి వ్యాఖ్య:
మరణించిన రెండువేల సంవత్సరాల తరువాత ఫీనిక్సు పక్షిలా పునర్జీవితమైన్ ఆధునిక ప్రపంచ భాషల్లో ఒకటిగా మారిన హిబ్రూ భాషకథ భాషాప్రేమికులకు ‘బైబిల్’ లాంటిది (literally!). ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత హిబ్రూను అధికార భాషగా నిర్ణయించాక చూసుకుంటే వారికి మిగిలి ఉన్న ఒకేఒక లిఖిత సాహిత్యం పాత నిబంధన గ్రంధం ఒక్కటే. అందులోని పదాలనుండే ఆధునిక భావనలకు పదబంధాలను సృష్టించవలసి వచ్చింది. ఉదాహరణకు, విద్యుత్తు అన్న మాటకు ఏంపదం వాడాలా అని వెదికి బైబిల్లో దేవుని తలచుట్టూ ఉన్న కాంతి చక్రానికి వాడిన పదం “హష్ మల్” ను ఖాయం చేశారు. దేవుని సంజ్ఞ అనే అర్థంలో బైబిల్లో వాడిన ‘రాంజోర్’ అన్న పదాన్ని ‘traffic signal’ కు వాడారు. ఇలా ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళలో సకల విజ్ఞానశస్త్రాలనూ వారిభాషలోకి అనువదించుకొన్నారు. వారిభాషలోనే చదువుకొంటున్నారు.
మనమూ హీబ్రూ నుండి స్ఫూర్తి పొందాలి అని నేను చెప్పగలను. హీబ్రూ వికీపీడియా నిన్ననే లక్ష వ్యాసాలకు చేరిందని ఇప్పుడే చదివాను.
This achievement is quite remarkable for a language with less than 10 million speakers, from which about 3.5 million are native speakers (data taken from the Hebrew wikipedia).
86 మిలియన్ల మంది మాట్లాడేవారు (అందులో 74 మిలియన్లు తెలుగుని మాతృభాషగా గలవారు) ఉన్న తెలుగు భాష వికీపీడియాలో 44,274 వ్యాసాలు ఉన్నాయి (గణాంకాలు తెలుగు వికీపీడియా నుండి.)
అవును, మనం తప్పకుండా హీబ్రూ నుండి స్ఫూర్తిని పొందాలి!
డిసెంబర్ 2009
నా కొన్ని ఆసక్తులకి సంబంధించిన జరుగుతున్న వివరాల నివేదిక.
e-తెలుగు
- e-తెలుగు యొక్క ప్రచారం మరియు ఆవగాహన కార్యకలాపంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ ప్రజలకి కంప్యూటర్లలో తెలుగుని చూడవచ్చూ రాయవచ్చూ, తెలుగులో బ్లాగులున్నాయి , వికీపీడియా ఉంది అని తెలియజేయడానికి హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలుని ఎర్పరచింది. ఈ సందర్భంగా కశ్యప్, చక్రవర్తి, సతీష్, మురళీధర్, కౌటిల్య, రవిచంద్ర, సుజాత, వరూధిని, మరియు ఇంకా ఇతర ఔత్సాహికుల కృషి శ్లాఘనీయం. నేను అక్కడకి మూడు రోజులు మాత్రమే వెళ్ళగలిగాను
కొత్త బ్లాగర్లను, ఇప్పటివరకూ నేను కలుసుకోని పాత బ్లాగర్లను, సాహిత్య/సినీరంగ ప్రముఖులనూ కలుసుకోవడం ఆనందదాయకం.
స్థానికీకరణ (తెలుగీకరణ)
- ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో ప్రస్తుతం ఓ అనువాద ర్యాలీ నడుస్తూంది. ఈ ర్యాలీలో 500 పైన మీడియావికీ పదబంధాల అనువాదాలు చేస్తే, వెయ్యి యూరోలని పంచుకోవడంలో భాగస్వాములు కావచ్చు. కానీ, మీరు ఈ టపా చదివే సమయానికి ఆ ర్యాలీ అయిపోవచ్చు. కానీ ఆ సైటు తరచూ ఇలా ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటుంది. వీటికోసం కాకున్నా, మీరు మరిన్ని ఉపకరణాలని తెలుగులో చూడాలనుకుంటే, ట్రాన్స్‌లేట్‌వికీలో చేరి, తెలుగీకరణ మొదలుపెట్టండి.
- స్టేటస్‌నెట్ అనువాదాలు 50% మార్కుని దాటాయి. ప్రస్తుత స్థితి: 52.15%.
- ఇప్పుడు వర్డ్ప్రెస్ని లాంచ్ప్యాడ్లో అనువదించవచ్చు. అనువదించడానికి వర్డ్‌ప్రెస్ తెలుగు అనువాదకుల జట్టులో చేరండి. (మీకు లాంచ్ప్యాడ్లో ఖాతా లేకపోతే సృష్టించుకోండి.)
- వర్డ్‌ప్రెస్.కామ్ కూడా తన అనువాద ఉపకరణాన్ని తాజాకరించింది. (ఇప్పుడు గ్లాట్ప్రెస్ అనే తమ స్వంత ఉపకరణాన్ని వాడుతున్నారు.) మీకు వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగు ఉంటే, మీ బ్లాగు రూపు మరియు నిర్వహణా కేంద్రాలని పూర్తిగా తెలుగులో చూడాలనుకుంటే, ఇందులో పాలుపంచుకోండి.
- తెలుగులో స్థానికీకరణ చెయ్యాలనుకునే వారికి వార్తలూ, మరియు స్థానికీకరణలో సాంకేతిక నమస్యలనీ పరిష్కరించుకోడానికీ telugu-l10n అనే గూగుల్ గుంపుని (గతంలో ఎప్పుడో) తెరిచాను. ఇకనుండి అది క్రియాశీలంగా ఉంటుంది.
- సాంగ్బర్డ్ (ముద్దుగా పాటలపిట్ట) యొక్క 1.4.1 సంచిక తయారు పూర్తికావస్తుంది, అనువాదాలు చెయ్యండహో అని ప్రకటించారు. తెలుగు అనువాదాలు 19% పూర్తి; మీరూ ఓ చేయివెయ్యండి మరి.
- ఫైర్‌ఫాక్స్ 3.6కి సంబంధించి మొజిల్లా సైటులో కనబడే సందేశాలని తెలుగులోనికి అనువదించాను.
స్వేచ్ఛా మృదూపకరణాలు
- తెలుగు(వారి)లో స్వేచ్ఛా మృదూపకరణాల వ్యాప్తికై foss-te అనే గూగుల్ గుంపుని ప్రారంభించాం. (స్వేచ్ఛా మృదూపకరణాలు అంటే?) గీతాచార్య మరియు ధనరాజ్ లు ఓపెనుద్యమం అని Books and Galfriendsలో మొదలుపెట్టారు. వారికి పెద్దప్రణాళికలే ఉన్నట్టున్నాయి.
- ఫైర్‌ఫాక్స్ 3.6 బీటా స్థితిలో ఉంది. ప్రయత్నించిచూడండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
‘యాహూ మెయిల్’ అని తెలుగులో ఎందుకు వెతుకుతున్నారు?
ఆశ్చర్యకరంగా నా బ్లాగుకి చాలా మంది “యాహూ మెయిల్” అని తెలుగులో శోధించి (ఈ టపాకి) వస్తున్నారు. జనాలు యాహూ మెయిల్ గురించి అంత ఎక్కువగా ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రింది తెరపట్టులలో మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్న కీపదాల సందర్శనలకి తేడాని గమనించండి. పొంతనే లేదు. (ఇదేమైనా గూగుల్ బాంబు లాంటిది కాదు కదా?)
గత 30 రోజులలో పై ఐదు కీపదాలు, వాటి ద్వారా నా బ్లాగుకి వచ్చిన సందర్శనలు:

ఏం జరుగుతోంది…
డిసెంబర్ రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం. మీ ఊళ్ళో ఏం చేస్తున్నారీసారి? ఇంకో నెల ఉందనుకోండి. కానీ ఇప్పటినుండే, స్కెచ్చు గీయండి.
డిసెంబర్ 17 నుండి 27 వరకూ, భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన!. ఈ ప్రదర్శనలో ఒక స్టాలు కోసం e-తెలుగు సన్నాహలు చేస్తుంది (పుస్తకాలు అమ్మడానికి కాదు, కంప్యూటర్లలోనూ జాలంలోనూ తెలుగు చూడొచ్చని రాయొచ్చనీ, తెలుగు బ్లాగులు ఉన్నాయనీ, తెలుగులో వికీపీడియా ఉందనీ సందర్శకులకి చెప్పడానికి).
మీడియావికీ తెలుగు అనువాదాలు 100% పూర్తయ్యాయి. (కానీ అది కదిలే లక్ష్యం. ఉన్న అనువాదాలన్నీ అత్యుత్తమం కాకపోవచ్చు. మీడియావికీకి మెరుగులద్దే కొద్దీ అనుదించాల్సిన కొత్త పదాలు రావొచ్చు.). ఈ అనువాదాలని ఉపయోగంలో చూడాలంటే, తెవికీని సందర్శించండి (వ్యాసాలు కాకుండా తెవికీలో కనబడేదంతా ఈ అనువాదాల ఫలితమే). అర్థంకాని పదబంధాలు లేదా అక్షరదోషాలు గట్రా కనబడితే తెలియజేయండి. లేదా మీకు ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద హక్కులుంటే, మీరే సరిదిద్దవచ్చు. ట్రాన్స్‌లేట్‌వికీ అనేది వివిధ ఉపకరణాల స్థానికీకరణకై ఉద్దేశించిన వికీ-ఆధారిత సైటు.
ఓపెన్‌స్ట్రీట్‌మాప్ కూడా తన స్థానికీకరణలకోసం ట్రాన్స్‌లేట్‌వికీని వాడుతూంది. స్వేచ్ఛా మైక్రోబ్లాగింగ్ ఉపకరణం స్టేటస్‌నెట్ తన స్థానికీకరణల కోసం ట్రాన్స్‌లేట్‌వికీని వాడటం మొదలుపెట్టింది. స్టేటస్‌నెట్‌ని ఉపకరణాన్ని ప్రత్యక్షంగా ఐడెంటికా సైటులో చూడవచ్చు. వీటిని మరియు ఇతర బహిరంగాకర (open source) ఉపకరణాలనీ తెలుగీకరిద్దామనుకుంటే, ట్రాన్స్‌లేట్‌వికీలో చేరండి. భవిష్యత్తులో మరిన్ని ఉపకరణాలు ట్రాన్స్‌లేట్‌వికీని తమ స్థానికీకరణ కేంద్రంగా ఏంచుకోబోతున్నాయి.
ఓ మూడు నెలల క్రితం డ్రూపల్ కూడా తన స్థానికీకరణని జాలంలోనే చేయగలిగే విధంగా localize.drupal.org అనే తన స్వంత వేదికని ఏర్పాటు చేసింది. దీనికి ముందు డ్రూపల్ స్థానికీకరణలు వేర్వేరు చోట్ల (జాలం లోనూ బయటా) వేర్వేరు సమూహాల నాయకత్వంలో జరిగేవి. ఈ స్థానికీకరణ పనంతా బహిరంగంగా ఒక్క చోటే జరిగితే, అదే పనిని వేరువేరు జట్లు చేయడాన్ని అరికట్టవచ్చు మరియు స్థానికీకరణలన్నీ ఒకే చోటినుండి అందుబాటులో ఉంటాయి. (ఉదాహరణకి, e-తెలుగు సైటు కోసం కొన్ని అనువాదాలు e-తెలుగు సైటులోనే చేసాం కానీ డ్రూపల్ వాడే ఇతరులకి అవి అందుబాటులో లేవు.) డ్రూపల్ ఈ ప్రకటన చేయగానే, నేను తెలుగు స్థానికీకరణ కూడా అక్కడే చేస్తామని అభ్యర్థించాను. ఆ తర్వాత, e-తెలుగు సైటులో చేసిన అనువాదాలను అక్కడికి దిగుమతి చేసి, నేనూ మరికొందరు అక్కడ కొన్ని అనువాదాలు చేసాం. ప్రస్తుతం 18% పూర్తి. ఇప్పుడు ఎవరైనా తమ తమ డ్రూపల్ సైట్ల కోసం తెలుగు అనువాదాలని అక్కడ నుండి దింపుకోవచ్చు.
ఈ నెల 9న నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఇంక్‌స్కేపుని తెలుగీకరించడం మొదలుపెట్టాను. దురదృష్టవశాత్తూ, దాన్ని జాలంలో స్థానికీకరించడం ఇంకా కుదరదు. మీకు ఆసక్తి ఉంటే, నాకు చెప్పండి.
ఆనంద తెలుగీకరణం!
తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)
వికీపీడియా అకాడమీ గురించి ఇటీవలే అర్జున రావు ఓ టపా రాసారు. ఆయన మాటల్లోనే:
వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు ఉన్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.
ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇవీ వివరాలు:
- వేదిక: chat.etelugu.org
- సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు
మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు.
కొన్ని ఉపయోగపడే లింకులు:
- ఐదు నిమిషాల్లో వికీపీడియా
- ఏది వికీపీడియా కాదు
- ఐదు మూలస్థంభాలు
- వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం (పొద్దు)
- తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (పొద్దు)
ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. (ఒకవేళ మీరు ఈ సెషనులో పాల్గొనలేక పోతే, మీ సందేహాలను ఇక్కడ వ్యాఖ్యలుగానైనా లేదా తెవికీలో అయినా అడగండి.)
ప్రతీ రోజూ కొంచెం కొంచెం చేరువగా…
… తెలుగు నిర్వాహక వ్యవస్థ వైపు.
మీ కంప్యూటర్ మీతో తెలుగులో సంభాషిస్తే ఎలా ఉంటుంది? ఆ స్వప్నం నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. స్వేచ్ఛా మృదూపకరణాల ప్రాజెక్టులు దాదాపుగా అన్నీ తమ ఉపకరణాల స్థానికీకరణకి ఔత్సాహికులకి అవకాశమిస్తున్నాయి. చాలా మంది కృషి వల్ల ఇప్పటికే గ్నూ/లినక్స్ పాక్షికంగా తెలుగులో లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి కూడా తెలుగు ప్యాక్ ఉంది.
నా కంప్యూటర్లో నేను ఆటని గెలిస్తే ఇలా అభినందిస్తుంది:

నా డెస్క్‌టాప్ తెరపట్టు ఇదిగో. (పెద్దగా చూడడానికి బొమ్మపై నొక్కండి.)
ప్రతీ నవీకరణలోనూ డెబియన్ మరింతగా తెలుగుమయమవుతూ వస్తుంది. ఇంకా అర్థంకాని అనువాదాలు అక్కడక్కడా తాసరపడుతూనే ఉన్నాయి, కానీ పరిస్థితి క్రమంగా మెరుగవుతూవుంది.
ఈ తెలుగీకరణ ప్రయత్నాలలో మీరూ పాలుపంచుకోవచ్చు.
వివిధ ఔత్సాహికుల లెక్కలేనన్ని ప్రయత్నాలకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం!
నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ యొక్క సరికొత్త కూర్పు 3.5 ఈ మధ్యే విడుదలయ్యింది. (మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.) ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి చాలా వ్యాసాలు ఇప్పటికే జాలంలో తేలియాడుతున్నాయి చూడండి.

మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!
ప్రపంచవ్యాప్తంగా ఫైర్‌ఫాక్స్ 3.5 దింపుకోళ్ళు ఎలా జరుగుతున్నాయో చూడండి. అలానే ఫైర్‌ఫాక్స్ తాజా మార్కెట్ వాటా శాతాన్ని కూడా చూడండి.
హైదరాబాదులో సంబరాలు
గత ఏడాది లానే ఈ సారి కూడా ఫైర్‌ఫాక్స్ విడుదల సందర్భంగా హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ అభిమానులం కలుద్దాం రండి. ఆ వివరాలు:
తేదీ మరియు సమయం: ఆదివారం, జూలై 19, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు.
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
ఏం చేస్తాం:
- ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి మాట్లాడుకుందాం
- మీ మీ లాప్‌టాపులు (అంకోపరులు) తెస్తే, దానిలో మంటనక్క 3.5 ని స్థాపించి విశేషాలను అక్కడికక్కడే ప్రదర్శించవచ్చు.
- మీ లాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ల కోసం స్టిక్కర్లు, మీ కోసం ఫైర్‌ఫాక్స్ 3.5 బాడ్జీలు కూడా ఇస్తాం
మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానులై, హైదరాబాదులో ఉంటే ఈ సంబరాలకి తప్పకుండా రండి.
ఆనంద జాలా జ్వాలనం!
కూడలిలో మీకు నచ్చని బ్లాగులు, గట్రా
మీరు కూడలికి వచ్చినప్పుడు ఇలా అనుకోవాల్సివస్తుందా?
ఇప్పుడే కూడలి ఓపెన్ చేస్తే షరా మామూలు గా ఒక [...] టపా కనిపించింది.
ఎప్పటిలానే మొదటగా కోపం, తర్వాత నవ్వు కొంచెం చిరాకు..
అది నిరాసక్తత, ఆందోళనగా మారే ముందే ఒక ఉపశమనం.
కూడలికి పెద్దయెత్తున మార్పులు జరిగి, టపాలకు రేటింగులు, మీకు నచ్చిన బ్లాగులతో ‘నా కూడలి’ లాంటి సౌలభ్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకూ కాస్త ఉపశమనంగా మీకు నచ్చని బ్లాగులని నుండి వచ్చే టపాలను కూడలి నుండి తొలగించుకొనే సదుపాయం కల్పిస్తున్నాను. మీకు నచ్చని బ్లాగులని ఒక జాబితాలో చేర్చుకుంటారు (ఈ జాబితా మీ విహారిణిలో కూకీలుగా భద్రమవుతుంది.). మీరు కూడలి తెరిచినప్పుడు, ఆ బ్లాగులనుండి టపాలని కూడలి మీకు చూపించదు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

